అన్న క్యాంటీన్‌లకు తెల్ల రంగు.. త్వరలో పేరు మార్పు - ప్రెస్‌రివ్యూ

  • 23 జూలై 2019
Image copyright facebook/Amaravati-People'sCapitalofAndhraPradesh

ఏపీలో అన్న క్యాంటీన్‌ రంగు మారుతోంది.. త్వరలో పేరు కూడా మార్చేందుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోందంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

'గత ఏడాది ఆగస్టు నెలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటిన్‌లను ప్రారంభించింది. టిట్‌కో సంస్థ ఆధ్వర్యం షాపూర్‌ జాఫలోన్‌జీ ఇందుకు అవసరమైన భవన నిర్మాణాలను పూర్తి చేసింది.

అన్న క్యాంటిన్లలో భోజనంతోపాటు ఉదయం టిఫిన్‌ రూ.5 కే అందిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వీటిని కొనసాగిస్తోంది. అయితే రంగు, పేరు మార్చాలని నిర్ణయించింద'ని అందులో పేర్కొన్నారు.

Image copyright facebook/ysjaganmohanreddy

ఏపీలో నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలు, మహిళలకే ప్రాధాన్యం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నిజమైన రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నారని 'సాక్షి' పత్రిక కథనం తెలిపింది.

'రాష్ట్రంలో అన్ని నామినేటెడ్‌ పదవుల్లో ఈ వర్గాలకు 50 శాతం పదవులు కేటాయించే బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఇక నుంచి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భర్తీ చేయబోయే అన్ని రకాల నామినేటెడ్‌ పదవుల్లో ఆ వర్గాలు కచ్చితంగా 50 శాతం పదవులు దక్కించుకుంటాయి. అదేవిధంగా ఈ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం ఆ వర్గాలకే ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించడం ఆ వర్గాలకు తీపి కబురే.

మహిళల రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్య్రం దిశగానూ జగన్‌ కీలక విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో భర్తీ చేయనున్న అన్ని నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో సగం అంటే 50 శాతం మహిళలకేనని తేల్చి చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభ సోమవారం ఆమోదించింది. దీంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పదవుల్లోనూ సగం మహిళలే దక్కించుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించే నామినేటెడ్‌ పదవులు, పనులలో 50 శాతంతో పాటు ఇతర జనరల్‌ విభాగంలోని నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ 50 శాతం మహిళలకు కేటాయించడం కొత్త చరిత్రే'నని ఆ కథనంలో విశ్లేషించారు.

Image copyright facebook/kcr

హరీశ్ రావు‌పై కేసీఆర్ ప్రశంసలు.. సొంతూరు చింతమడకలో ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తన స్వగ్రామమైన చింతమడకలో ఆత్మీయ అనురాగ సమ్మేళనాన్ని నిర్వహించారంటూ 'ఈనాడు' వార్తాకథనం ఆ వివరాలు అందించింది. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేసి తెలంగాణ ఆరోగ్య సూచీ రూపొందించే కార్యక్రమం తన స్వగ్రామం చింతమడక నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారని వెల్లడించింది.

'హెలికాప్టర్‌ ద్వారా నేరుగా ఇక్కడికి చేరుకున్న సీఎం దాదాపు 46 నిమిషాల పాటు గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గ్రామంలో ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని, అనంతరం వారికి అవసరమైన చికిత్సలూ అందించాలన్నారు. ఇక్కడ పూర్తయిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిద్దామన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు జరిపి, తెలంగాణ ఆరోగ్య సూచీని రూపొందించాలని పట్టుదలగా ఉన్నానని ఆయన వెల్లడించార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.

'చింతమడకకు కోరినన్ని నిధులు ఇస్తానని, గ్రామస్థులంతా ఐకమత్యంతో ఉండి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. చింతమడకతో పాటు మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామాల్లోని 2 వేల కుటుంబాలకు ఉపాధి చూపేలా రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఏడాదిలోగానే రాష్ట్రమంతా కాళేశ్వరం జలాలతో బతికే రోజులు రానున్నాయన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్‌ నాయకత్వంలో సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో ముందుందని కితాబిచ్చారు. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోల్చితే సిద్దిపేట మెరుగ్గా ఉందన్నారు. సిద్దిపేటకు విమానం తప్ప అన్నీ వచ్చాయని.. మిషన్‌ భగీరథకు సిద్దిపేటే ఆదర్శమని కేసీఆర్ అన్నార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.

కేటీఆర్ Image copyright facebook/ktr

గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్

తన పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు, పత్రికా ప్రకటనలు కాకుండా అవసరమున్న పేదలకు లేదా సమాజంలోని వివిధవర్గాలకు సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలని కేటీఆర్ పిలుపునిచ్చారని 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

'ఆయన పుట్టినరోజు (జూలై 24)ను పురస్కరించుకొని కేటీఆర్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ పేరుతో ట్విట్టర్ వేదికగా వినూత్నమైన ప్రచారాన్ని గతంలోనే ప్రారంభించారు.

దీనికి అన్నివర్గాల నుంచి విస్తృతమైన ఆదరణ లభిస్తున్నది. ఈ చాలెంజ్‌లో భాగంగా తమకు తోచినంత సహాయాన్ని చుట్టుపక్కలవారికి అందించడంతోపాటు మీరు కూడా ఇలా చేయండి అంటూ తమకు తెలిసిన వారిని నామినేట్ చేస్తున్నారు.

ఇలా నామినేట్ చేసినవారు సైతం ఎంతోకొంత ఇతరులకు సహకారం అందించేందుకు ముందుకొస్తున్నార'ని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)