కశ్మీర్ వివాదంపై మోదీ నన్ను మధ్యవర్తిగా ఉండమన్నారన్న ట్రంప్.. అడగలేదన్న భారత్

  • 23 జూలై 2019
ట్రంప్, ఖాన్ Image copyright Getty Images

భారత్ - పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయటానికి తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే.. భారతదేశం దీనిని వ్యతిరేకించింది.

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. అనంతరం ట్రంప్, ఇమ్రాన్‌‌లు వైట్ హౌస్‌లో సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

భారత్ - పాక్ మధ్య 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించటానికి మధ్యవర్తిగా ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కోరారని ట్రంప్ చెప్పారు. అందువల్ల మధ్యవర్తిగా ఉండటానికి తన సంసిద్ధతను తెలియజేస్తున్నానని చెప్పారు.

అయితే.. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత్‌లో దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఒక ప్రకటన జారీచేశారు.

''భారత్, పాకిస్తాన్ కోరితే కశ్మీర్ అంశం మీద మధ్యవర్తిత్వం చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని అధ్యక్షుడు ట్రంప్ చెప్పటం మేం చూశాం. ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ) అమెరికా అధ్యక్షుడికి అటువంటి విజ్ఞప్తి ఏదీ చేయలేదు’’ అని ఆ ప్రకటనలో స్పష్టంచేశారు.

‘‘పాకిస్తాన్‌కు సంబంధించిన అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలనూ ద్వైపాక్షికంగా మాత్రమే చర్చిస్తామన్నది భారత్ అనుసరిస్తున్న విధానం. పాకిస్తాన్‌తో ఎటువంటి సంప్రదింపులకైనా ముందు సీమాంతర ఉగ్రవాదం అంతం కావాల్సి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య అన్ని అంశాలనూ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవటానికి సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్‌లు భూమికగా ఉన్నాయి’’ అని ఉద్ఘాటించారు.

ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రెండు వారాల కిందట నేను ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశాను. ఆయన ‘మీరు మధ్యవర్తిగా ఉంటారా?’ అని అడిగారు. ఎక్కడ అని నేను అడిగాను. కశ్మీర్ విషయంలో అని ఆయన చెప్పారు’’ అని పేర్కొన్నారు.

‘‘నేను సాయం చేయగలుగుతానంటే.. ఎంతో సంతోషంగా మధ్యవర్తిగా ఉంటా. ఈ విషయంలో నా సాయం కావాలంటే అడగండి’’ అన్నారు ట్రంప్.

ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ఇతరుల నుంచి తీవ్ర స్పందనలు వ్యక్తమయ్యాయి.

ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఒక ట్వీట్ చేస్తూ.. ‘‘జమ్మూ కశ్మీర్ అంశంలో మూడో పక్షం మధ్యవర్తిత్వానికి ఇండియా ఎన్నడూ అంగీకరించలేదు’’ అని పేర్కొన్నారు.

‘‘ఒక విదేశీ శక్తిని మధ్యవర్తిత్వం చేయాలని ప్రధానమంత్రి మోదీ అడగటం.. దేశ ప్రయోజనాలకు నమ్మకద్రోహం చేయటమే. ప్రధాని దేశానికి సమాధానం చెప్పాలి’’ అంటూ తీవ్రంగా విమర్శించారు.

ఇదిలావుంటే.. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ట్రంప్ వ్యాఖ్యలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు.

‘‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. ఉపఖండంలో శాంతి స్థాపనలో అమెరికా కీలక పాత్ర పోషించగలదు. కశ్మీర్‌ వివాదం వల్ల 100 కోట్ల మందికి పైగా జనం ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొల్పగలరని నేను నమ్ముతున్నా’’ అని ఆయన చెప్పారు.

అంతేకాదు.. భారతదేశంతో చర్చలు ప్రారంభించటానికి పాకిస్తాన్ అన్ని ప్రయత్నాలూ చేసిందని.. కానీ ఆ దిశగా పురోగతి లభించలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు.

ఈ విషయంలో ట్రంప్ పాత్ర పోషించటానికి వీలుందని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం