ఫ్యామిలీతో చంద్రుడిపైకి వెళ్లి అక్కడ తన స్థలంలో ఇల్లు కట్టుకుంటానంటున్న హైదరాబాద్ వ్యాపారి

  • 24 జూలై 2019
రాజీవ్ భాగడి
చిత్రం శీర్షిక రాజీవ్ భాగడి

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రాజీవ్ భాగడికి 'చంద్రునిపై భూమి' ఉంది. దీనిని ధ్రువీకరిస్తున్నట్లుగా ఆయన వద్ద కొన్ని పత్రాలు ఉన్నాయి. 2003లో 140 అమెరికా డాలర్లు చెల్లించి ఆన్‌లైన్లో ఆయన దీనిని కొన్నారు.

ఈ కొనుగోలును ధ్రువీకరిస్తున్నట్లుగా ఆయన చూపుతున్న పత్రం ప్రకారం- చంద్రుడిపై మేర్ ఇంబ్రియం ప్రాంతంలో రాజీవ్‌కు ప్రాపర్టీ ఉంది. అమెరికాలో న్యూయార్క్ నగరంలోని 'లూనార్ రిజిస్ట్రీ' వద్ద ఇది రిజిస్టరై ఉన్నట్లు చెబుతున్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను దించేందుకు ఈ నెల 22న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించడంతో దేశ అంతరిక్ష కార్యక్రమ చరిత్రలో కొత్త దశ మొదలైంది. ఈ పరిణామం రాజీవ్‌కు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఏదో ఒక రోజు తాను కుటుంబ సమేతంగా చంద్రుడి మీదకు వెళ్తానని, వీలైతే అక్కడ ఏదైనా నిర్మాణం చేపడతాననే ఆశను చంద్రయాన్-2 మిషన్ తనకు కలిగించిందని ఆయన చెప్పారు.

రాజీవ్‌కే కాదు బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్, షారుఖ్ ఖాన్‌లకూ చంద్రమండలంపై స్థలం ఉంది.

సుశాంత్ సింగ్ సొంతంగా కొన్నారు. షారుఖ్‌కు బహుమతిగా వచ్చింది.

చిత్రం శీర్షిక చంద్రుడిపై స్థలం కొన్న ప్రముఖుల్లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఒకరు.

ఇంతకీ చంద్ర మండలం ఎవరిది?

ఇంతకూ చంద్ర మండలంపై స్థలం కొనుక్కోవచ్చా? అమ్మడానికైనా, కొనడానికైనా చంద్ర మండలం ఎవరిదైనా అయ్యుండాలి కదా? మరి ఇది ఎవరిది?

చంద్ర మండలంపై స్థలాలు, అనేక ఖగోళ పదార్థాలను అమ్ముతామనే వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. ఏ వెబ్‌సైట్ చూసినా తమదే చట్టబద్ధమైనదని చెప్పుకొంటోంది.

కానీ ఇది అసాధ్యమంటున్నారు అంతరిక్ష చట్టాల నిపుణులు.

1967లో ఐక్యరాజ్యసమితిలో 'ఔటర్ స్పేస్ ట్రీటీ'ని ఆమోదించారు. భారత్‌ సహా 100 దేశాలు దీనిపై సంతకం పెట్టాయి. చంద్ర మండలం, ఇతర ఖగోళ పదార్థాలు సహా అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది.

ఒప్పందంలోని అధికరణ 1 ప్రకారం- అంతరిక్షం, చంద్ర మండలం, ఇతర ఖగోళ పదార్థాలపై అన్వేషణ అన్ని దేశాల ప్రయోజనం కోసమే చేపట్టాలి. ఎలాంటి పక్షపాతం, వివక్ష లేకుండా ఇవి అంతర్జాతీయ చట్ట పరిధిలో అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిపై శాస్త్ర పరిశోధనలో దేశాలు పరస్పరం సహకరించుకోవాలి.

Image copyright Twitter/ISRO
చిత్రం శీర్షిక ఏదో ఒక రోజు తాను కుటుంబ సమేతంగా చంద్రుడి మీదకు వెళ్తాననే ఆశను చంద్రయాన్-2 మిషన్ తనకు కలిగించిందని రాజీవ్ భాగడి చెప్పారు.

అధికరణ 2 ప్రకారం- సార్వభౌమాధికారం ఉందని చెబుతూగాని, ఆక్రమణ లేదా మరో చర్యతోగాని అంతరిక్షం, చంద్ర మండలం, ఇతర ఖగోళ పదార్థాలపై జాతీయ కేటాయింపుకుగాని, స్థలాన్ని పొందేందుకుగాని వీల్లేదు.

అంతరిక్ష చట్ట అంతర్జాతీయ సంస్థ గౌరవ డైరెక్టర్ స్టీఫెన్ ఇ.డోలే బీబీసీతో మాట్లాడుతూ- ఏ దేశ నియంత్రణలోనూ లేని సముద్ర జలాల(హైసీస్) మాదిరే చంద్రుడు ఎవరికీ చెందడన్నారు.

చంద్రుడిపై జాతీయ కేటాయింపు గాని, ప్రైవేటు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని కలిగి ఉండేందుకుగాని నిబంధనలు అంగీకరించవని ఆయన చెప్పారు.

ఏ దేశానికీ చెందని సముద్ర జలాల్లో చేపలు పట్టుకొని ఉపయోగించుకొన్నట్లుగా చంద్రుడిపై ఉండే పదార్థాన్ని సేకరించి వాడుకోవచ్చని స్టీఫెన్ తెలిపారు. కానీ చంద్రుడిపై యాజమాన్యాన్ని మాత్రం పొందలేరన్నారు.

చంద్రుడి మీద స్థలంపై హక్కుల గురించి రాజీవ్ లాంటి వారికి పంపుతున్న పత్రాలకు చట్టబద్ధత ఉంటుందా, అవి చెల్లుతాయా అని అడగ్గా- ఒప్పందంలోని రెండో అధికరణ ప్రకారం అవి బోగస్ అని, అర్థరహితమని స్టీఫెన్ స్పష్టం చేశారు. చంద్ర మండలంపై స్థలం అమ్ముతామనేవారు మోసగాళ్లని, అసలు ఆ హక్కే వారికి లేదని చెప్పారు.

చంద్రుడిపై స్థల విక్రయం పత్రాలు ఇస్తున్న కంపెనీలపై కేసులు నమోదవుతున్నాయా, విచారణ జరుగుతోందా అనే వివరాలు తెలియలేదు.

లూనార్ రిజిస్ట్రీ, లూనార్ ల్యాండ్ అనే రెండు కంపెనీలకు ఈమెయిల్ చేసి, అవి ఇచ్చే పత్రాల చట్టబద్ధత గురించి వివరించాలని కోరగా, అవి స్పందించలేదు.

చంద్రుడిపై స్థల హక్కులు కల్పించాలని 'స్పేస్ సెటిల్‌మెంట్ ఇనిషియేటివ్' లాంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అంతరిక్ష సెటిల్‌మెంట్ ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు కావాలని, ఈ క్రమంలో ఈ హక్కులను కల్పించాల్సిన అవసరముందని చెబుతున్నాయి.

ద స్పేస్ సెటిల్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అలన్ వాసర్ బీబీసీతో మాట్లాడుతూ- చంద్రుడిపై శాశ్వత నివాసం ఉండేవారికే అక్కడి స్థలంపై హక్కులు ఉంటాయని తమ సంస్థ భావిస్తోందన్నారు. చంద్రుడిపై స్థలం అమ్మకం పత్రాలకు చట్టబద్ధత లేదన్నారు.

రాజీవ్ లాంటి వ్యక్తులు వారికి చంద్రుడిపై యాజమాన్య హక్కులు ఉన్నట్లు ఇప్పుడుగాని, మరెన్నడైనాగాని చెప్పుకోవడానికి వీల్లేదని ఆయన వ్యాఖ్యానించారు.

"చంద్ర మండలం ఎవరికీ చెందదు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం చంద్రుడు ఎన్నటికీ ఏ దేశానికీ చెందడు. చంద్రుడి మీద స్థలాన్ని అమ్ముతూ ఇచ్చే పత్రాలు చెల్లవు" అని అలన్ వాసర్ స్పష్టం చేశారు.

చిత్రం శీర్షిక చంద్రుడిపై పౌరసత్వానికి సంబంధించి ఇచ్చిన పత్రం

నాకు పెద్దగా ఆందోళన లేదు: రాజీవ్

తన వద్ద ఉన్న పత్రాలు చట్టబద్ధమైనవా, కాదా అనే అంశంపై తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని రాజీవ్ తెలిపారు. చంద్ర మండలం మీదకు మానవజాతి వెళ్లేందుకు తాను ఒక పెట్టుబడి పెట్టానని చెప్పారు.

"నన్ను చాల మంది 'ఫూల్' అన్నారు. పర్లేదు. కానీ నేనొక దృష్టితో ఇది చేశాను. చంద్ర మండలంతో మానవజాతికి ఎంతో మేలు జరుగుతుందన్నది నా నమ్మకం. నాకు ఇచ్చిన పత్రం చట్టబద్ధం కాకపోయినా, ఎప్పటికైనా చంద్ర మండలంపై మానవుడు ఉండగలిగితే చాలు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం