ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్’ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌లకు తలనొప్పి కాకూడదు - అభిప్రాయం

  • 25 జూలై 2019
గవర్నర్‌ హరిచందన్, సీఎం జగన్ Image copyright Twitter/IPR_AP

చరిత్ర దృష్టికోణం నుంచి దక్షణాదిని చూసినప్పుడు 24 జూలై 2019 ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని తన నూతన ప్రాదేశిక ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత, దాని తొలి 'రాజ్యాధినేత' (స్టేట్ హెడ్) ఆ రోజు ఉదయం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇప్పుడు ఆ పదవిలోకి వచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం, ప్రభుత్వాధినేతలు రావడం వెళ్ళడం వేరు. కానీ రాజ్యాధినేతగా గవర్నర్ పదవి చుట్టూ.. దృగ్గోచరమైన రాజ్యాంగ సంబంధిత అధికార సాంద్రత ఒదిగుంది. ప్రభుత్వాలు ఉన్నప్పుడు, లేనప్పుడు, మధ్య ఉండే.. విరామ కాలంలో కూడా అది యథావిధిగా ఉంటుంది, అందుకే గవర్నర్‌ను 'రాజ్యాధినేత' అనడం.

ఈ నియామకంతో ఐదేళ్ల క్రితం అమల్లోకి వచ్చిన 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లో ప్రధానాంశం పూర్తయినట్టైంది. చట్టం ఆచరణ, అమలులో మిగిలినవి ఇక ఇప్పుడు వేగవంతమవుతాయి.

రాష్ట్ర విభజన 2014 జూన్ 2 న జరిగాక, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఇప్పటి వరకు హైదరాబాద్ రాజభవన్‌లోనే ఉంటూ విధులు నిర్వహించారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజభవన్ నుంచి పరిపాలన సాగిస్తున్నారు.

Image copyright @AndhraPradeshCM

వింధ్య పర్వతాలకు ఇవతల దక్కన్ పీఠభూమిలో.. తూర్పు కనుమల పర్వత శ్రేణుల రక్షణ, నదీ తీర మైదానం, బందరు నౌకాశ్రయానికి ఫెర్రీ ఇన్ని వసతులు ఉన్న పట్టణం బెజవాడ. దాంతో దిల్లీ సుల్తాన్ల కాలంలో ఇది సైనిక పటాలాలకు మజిలీ స్థావరమయింది.

ఆ తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 'మద్రాస్ నేటివ్ ఇన్‌ఫాన్ట్రీ' 52 పటాలాలు 1858 తర్వాత బ్రిటిష్ మిలటరీ లో కలిసినప్పుడు, వాటిలో ఒకటైన 30వ రెజిమెంట్‌కు బెజవాడ కంటోన్మెంట్ అయింది. ఇలా మొదటి నుంచి కోస్తాంధ్రలో ప్రధాన కూడలి నగరం బెజవాడ.

దేశానికి స్వాత్యంత్రం వచ్చాక, ఇన్నాళ్ళకు అది ఇప్పుడు గవర్నర్ నివాస నగరం అయింది.

రాష్ట్ర విభజన తర్వాత, 'రాజ్యం' చిన్న చిన్న ప్రాదేశిక ప్రాంతాలకు తరలి వస్తున్న వైనం ఎటువంటిదో తెలుసుకోవడం ఈ సందర్భంగా ఆసక్తికరమైన అంశం అవుతుంది.

Image copyright Twitter/@IPR_AP
చిత్రం శీర్షిక బిశ్వభూషణ్ హరిచందన్

ఈస్ట్ ఇండియా కంపెనీ 1851 నాటికి దేశమంతటినీ తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ తర్వాత గవర్నర్ జనరల్ పరిపాలనా పరిధిలో గవర్నర్ల పరిపాలనలో కలకత్తా కేంద్రంగా బెంగాల్ ప్రెసిడెన్సీ, బొంబాయి కేంద్రంగా బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ కేంద్రంగా మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆగ్రా కేంద్రంగా నార్త్-వెస్ట్రన్ ప్రావిన్స్ ఉండేవి.

స్వాతంత్ర్యం తర్వాత పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో చిరకాల పోరాటం తర్వాత, భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా మద్రాస్ నుంచి 1953 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

1969 నాటికి తెలంగాణ ఉద్యమం మొదలయింది. పలు దశల్లో దాని ఉత్థానపతనాలు తర్వాత 2014 నాటికి అది సాకారమయింది, రాష్ట్రం రెండు అయింది. ఏపీ నూతన ముఖ్యమంత్రి చెబుతున్న ప్రతిపాదిత కొత్త జిల్లాలు కూడా వస్తే, అప్పుడు ప్రభుత్వ పరిపాలన మరింత సూక్ష్మస్థాయికి చేరుతుంది.

Image copyright @AndhraPradeshCM

అయితే, 'రాజ్యం ఎలా వస్తుంది...?' అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న.

గతంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర గవర్నర్ చేసే పర్యటనలు అంటే అవి- విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు మాత్రమే ఎక్కువసార్లు పరిమితమై ఉండేవి. ఇప్పుడిక అవి ద్వితీయ శ్రేణి నగరాలైన - ప్రొద్దుటూరు, కావలి, గుడివాడ, పిఠాపురం, టెక్కలి వంటి చిన్న పట్టణాలకు విస్తరిస్తాయి. దానివల్ల ఏమవుతుంది? అనేది మనకు కలిగే సందేహం.

కొత్త ప్రాంతాలు 'ఓపెన్' అవుతాయి. ప్రాంతాలు 'తెరవబడటం' అనేది అన్నిసార్లు 'లింక్ రోడ్లు' వేయడంతోనే కావు. గవర్నర్ వంటి రాజ్యాంగ పదవిలో ఉన్నవారి సందర్శనల వల్ల అది మరింత భిన్నంగా జరుగుతుంది. అప్పుడు ఆయా ప్రాంతాలు పట్టణాల 'ఎథోస్' బయట ప్రపంచానికి వెల్లడి అవుతాయి.

కొత్త జాతులు, తెగలు, లిపిలేని భాషలు, వెలుగు నోచుకోని చిన్నపట్టణాల వైతాళికులు అప్పుడు బయటకు వస్తారు. అప్పుడు వారికి 'రాజ్యం' గుర్తింపు దొరుకుతుంది. భాషావేత్తగా మనకు బాగా తెలిసిన సి.పి.బ్రౌన్ బ్రిటిష్ ప్రభుత్వ అధికారి. ఆయన పూనికతో తెలుగు భాషకు జరిగిన మేలు మనకు తెలుసు.

విభజన తర్వాత ఇప్పటి వరకు మూడు కార్యాలయాలకు వసతినిచ్చిన బెజవాడ పి.డబ్ల్యు.డి. గ్రౌండ్ సమీపంలో ఉన్న ఒకనాటి నీటిపారుదల శాఖ ఆవరణం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 'రాజ్ భవన్' అయింది.

చిత్రం శీర్షిక ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్ భవన్ నుంచి పరిపాలన సాగిస్తారు

ఒక ప్రాదేశిక ప్రాంతానికి కొత్తగా రాష్ట్ర ప్రతిపత్తి ప్రకటించాక, అందుకు అవసరమైన హంగులు ఏర్పడడానికి కనీస వ్యవధి అవసరం. అందుకే చట్టంలో కేంద్రం హైదరాబాద్ మీద పదేళ్ళు హక్కు ఏపీకి ఇచ్చింది.

అరవై ఏళ్ల క్రితం కర్నూలు నుంచి హైదరాబాద్ రాజధాని మారేసరికి, అప్పటికే 1948 నాటి 'పోలీస్ యాక్షన్' తర్వాత భారత ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చిన నిజాం నిర్మించిన సువిశాలమైన భవనాలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వసతికి అక్కడ సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు అవి అలా ఆదుకున్నాయి.

ఇప్పుడు అక్కడున్నతొమ్మిదేళ్ళ వెసులుబాటును వద్దు అనుకుని, ముందస్తు ఏర్పాట్లు లేకుండా హైదరాబాద్‌ను వదిలిపెట్టి బెజవాడ వచ్చేశాక అది ఏ ప్రభుత్వానికి అయినా సమస్యే.

ఇక్కడికి వచ్చాక, ఆరు నుంచి ఎనిమిది మాసాలు ఉండే బెజవాడ వేసవి ఉష్ణ తాపం, హైదరాబాద్ నగరానికి భిన్నంగా ఇక్కడ ఉండే ఉక్కబోత కారణంగా, 'వర్క్ ప్లేస్' అననుకూలత వచ్చిన వెంటనే సిబ్బందికి తొలి అవరోధం అయింది. దానివల్ల పని నాణ్యత మీద ఉండే ప్రభావం పైకి కనిపించేది కాదు. సరే, కుటుంబ సమస్యలు ఎటూ ఉంటాయి.

Image copyright @AndhraPradeshCM

ఐదేళ్ళు అయ్యాక క్రమంగా ఇప్పుడిప్పుడే ఇక్కడి పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఏపీ లాంటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇల్లు చక్కబెట్టుకుంటున్న స్థితి.

కొత్త గవర్నర్ విజయవాడ 'రాజ్ భవన్' లోకి రాకముందు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున ఇచ్చిన వీడ్కోలు సభలో ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మాట్లాడుతూ 'యు హావ్ ఎక్వైర్డ్ న్యూ ఎంపైర్' (నువ్వు కొత్త రాజ్యాన్ని పొందావు) అన్నారు.

అవును ఐదేళ్ళ రాష్ట్రం, ఐదు వారాల ప్రభుత్వం.

రెండోసారి అధికారం చేపట్టాక, ఇప్పటికే 'వంద రోజుల కార్యాచరణ' అని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం రావడంతో పరిపాలన వేగం అందుకోవాలి. అయితే, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ మూడు నెలలోపే దక్షణాదిలో బీజేపీ ‘పని’ మొదలెట్టింది. కర్ణాటకలో ‘ఆపరేషన్ కమల్’ పూర్తి అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్' మొదలుపెట్టింది. ఇటువంటివి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దృష్టిని తన పని మీదినుంచి మరల్చడమే తప్ప మరొకటి కాదు. ఇటువంటి పరిస్థితి వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రమే కాదు, రేపు ఆగస్టు 3వ తేదీన తన 85వ జన్మదినం జరుపుకోనున్నరాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు కూడా కొత్త తలనొప్పి కాకూడదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)