లోకేశ్ ట్వీట్: ‘జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం’ - ప్రెస్ రివ్యూ

  • 24 జూలై 2019
Image copyright facebook/naralokesh

ఆంధప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు 'నవరత్నాల' పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీల్లో ఒకటి ఇప్పుడు మాయమైపోయిందని టీడీపీ నేత నారా లోకేశ్ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం పేర్కొంది.

''46 ఏళ్ల జగన్‌కు ఉద్యోగం వచ్చింది గానీ.. 'నలభై ఐదేళ్ల వారికి పెన్షన్‌' రత్నం మాత్రం మాయమైంది' అని లోకేశ్‌ అన్నారు.

45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామన్న హామీ తమ మేనిఫెస్టోలో లేదంటూ అసెంబ్లీలో సీఎం, మంత్రులు చేసిన ప్రకటనపై ట్విటర్‌లో స్పందిస్తూ లోకేశ్ ఈ వ్యాఖ్య చేశారు.

''పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కిన వెంటనే మరచిపోయారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత తేలిగ్గా మాట మార్చి వారిని మోసం చేశారు. ఆయన మడమ తిప్పడం, మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేలు నష్టం జరుగుతోంది'' అని అన్నారు.

మరో ట్వీట్‌లో 'మూర్ఖత్వం అసలు పేరు.. అహంభావం ముద్దు పేరు అనే వాడుక జగన్‌ గారిని చూస్తుంటే అక్షరాలా నిజం అనిపిస్తోంది' అని వ్యాఖ్యానించారు.

''విద్యుత్‌ ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని, సమీక్ష వద్దని కేంద్రం, మేధావులు చెప్పినా ఆయన చెవికి ఎక్కలేదు. ఓ కమిటీ వేసి ఏదో చేసేద్దామని, అవినీతి నిరూపించాలని కసిగా ఉన్నారు. జగన్‌ గారూ! మీ కసి నాకు నచ్చింది. కానీ కేంద్ర సంస్థ ఎన్టీపీసీ వాళ్లకు నచ్చలేదనుకుంటాను. అందుకే ఒక లేఖ రాశారు. ఏమిటో... మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు'' అని లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.

Image copyright GOVERNOR.TSAP.NIC.IN
చిత్రం శీర్షిక తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌

'ఆ అధికారం సర్కారుకు ఉండటమేంటీ'

పురపాలక ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారం కల్పిస్తూ రూపొందించిన కొత్త పురపాలక బిల్లుపై తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ అభ్యంతరం చెప్పారని పేర్కొంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

గవర్నర్ సూచనను పరిగణనలోకి తీసుకొని సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో కొత్త పురపాలక చట్టం-2019 అమల్లోకి వచ్చింది. చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది.

కొత్త చట్టం ప్రకారమే పురపాలక ఎన్నికలు జరుగుతాయి. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం దీన్ని తెచ్చేందుకు పూనుకున్న విషయం తెలిసిందే.

ఉభయసభలు ఆమోదం తెలపడంతో బిల్లును గవర్నర్‌ ఆమోదానికి పంపింది. పరిశీలించిన గవర్నర్‌, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు.

పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సూచించేలా బిల్లులో పొందుపర్చడం సబబు కాదని, ఆ అధికారం ఎన్నికల సంఘానికే ఉండాలని గవర్నర్ సూచించారు.

కొత్త పురపాలక బిల్లులోని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని భాజపా ముందే చెప్పిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ బిల్లుపై గవర్నర్‌ నరసింహన్‌ అభ్యంతరాలు చెబుతూ తిప్పిపంపడం ప్రజాస్వామిక శక్తుల విజయంగా ఆయన వర్ణించారు.

Image copyright AFP

ఏపీలో వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్

ఆంధప్రదేశ్‌లో ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.

ఫీజు రీయింబర్స్‌మొంట్ ఫైలుపై జగన్ సంతకం నేపథ్యంలో, దీనిపై ఉన్నత విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ఫీజులపై జీవో 38 విడుదల చేసింది.

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ), బీఆర్క్, బీ.ఫార్మా, ఎం.ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2018-19 విద్యాసంవత్సరానికి అమలు చేసిన ఫీజులే 2019-20 విద్యా సంవత్సరానికి కూడా కొనసాగుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు.

యూనివర్సిటీ Image copyright twitter/lpuuniversity

తెలంగాణలో ప్రైవేటు వర్సిటీల కోసం కసరత్తు

తెలంగాణలో ప్రైవేటు వర్సిటీలను తీసుకువచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త రాసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రైవేటు వర్సిటీలు నడుస్తున్నాయి. వాటికి దీటుగా తెలంగాణలో ప్రైవేటు వర్సిటీలను తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

వర్సిటీల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో 20 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 10 ఎకరాల చొప్పున భూమి ఉండాలని, కార్పస్ ఫండ్ కింద రూ.10 కోట్లు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.

దీని పై మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని, ప్రభుత్వ ఆమోదం పొందాక ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు.

వచ్చే విద్యాసంవత్సరానికి ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు తీర్చగలిగే కోర్సులతో కొత్త వర్సిటీలు ఏర్పాటవుతాయని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)