పౌరసత్వం రద్దుతో భవిష్యత్తుపై భయం.. అస్సాంలో 50 మంది ఆత్మహత్య

  • 26 జూలై 2019
చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న జైనాల్ అలీ
చిత్రం శీర్షిక చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న జైనాల్ అలీ

జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్‌ఆర్‌సీ) తుది గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అక్రమ వలసదారుల పేరిట ఈశాన్య భారతంలోని అస్సాంలో 40 లక్షల మంది ప్రజల పౌరసత్వాన్ని రద్దు చేశారు. పౌరసత్వం రద్దు కావడంతో, భవిష్యత్తు ఏమవుతుందోననే భయంతో 50 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. గత రెండు వారాల్లోనే ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్నవారిలో జైనాల్ అలీ ఒకరు. ఈ నెల 4న జైనాల్ ఇంటికి సమీపంలోనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు.

అస్సాంలోని బొంగాయిగావ్ జిల్లాలోని డోమెర్‌పురి గ్రామంలో జైనాల్ కుటుంబం నివసిస్తోంది. ఇది దేశ రాజధాని దిల్లీకి 1,800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపౌరసత్వం రద్దు: అస్సాంలో '50 మంది ఆత్మహత్య'

గత ఏడాది విడుదలైన ఎన్‌ఆర్‌సీ జాబితాలో జైనాల్ పేరు లేదు.

పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు సంబంధిత ఫారం నింపినప్పటికీ ఆయన ఎప్పుడూ భయపడుతూనే ఉండేవారని భార్య మహెలా ఖాతూన్ చెప్పారు.

"ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో ఎలాగైనా తన పేరును చేర్పిస్తానని చెప్పి ఒక బ్రోకర్ జైనాల్‌ను డబ్బు అడిగాడు. అతన్ని నమ్మి నా భర్త డబ్బిచ్చాడు. తర్వాత అతడు మరింత డబ్బు కావాలన్నాడు. ఒకరోజు రాత్రి జైనాల్ ఆత్మహత్య చేసుకున్నారు. మనం డబ్బు సమకూర్చుకోలేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఆ రోజు రాత్రి ఆయన నాతో చెప్పారు. అది వినగానే నాకు చాలా భయమేసింది" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి జైనాల్ తన అన్న అబ్దుల్ ఖాలిక్‌తో మాట్లాడారు.

తన సోదరుడు ఇలాంటి చర్యకు ఒడిగడతాడని అబ్దుల్ ఊహించలేకపోయారు.

చిత్రం శీర్షిక అబ్దుల్ ఖాలిక్‌

"ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరు వెళ్లగొడతారు? నాదగ్గర అన్ని పత్రాలూ ఉన్నాయి. వాళ్లు నన్ను సుప్రీంకోర్టుకు వెళ్లమన్నా సరే.. అక్కడికి వెళ్లి నేను అస్సాం పౌరుడినని చట్టబద్ధంగా నిరూపించుకుంటాను" అని అబ్దుల్ తెలిపారు.

ఆత్మహత్యలపై సంబంధిత జిల్లాల పోలీసు ఉన్నతాధికారులందరితోనూ బీబీసీ మాట్లాడింది. కెమెరా ముందుకొచ్చి మాట్లాడటానికి వాళ్లు నిరాకరించారు.

అస్సాంలో ఆత్మహత్యలు వ్యక్తిగత కారణాల వల్లే జరిగాయని, ప్రజల్లో నిరాశా నిస్పృహలేవీ లేవని బీబీసీతో సంభాషణలో వారు చెప్పారు.

షాజహాన్ అలీ లాంటి సామాజిక కార్యకర్తలు మాత్రం- ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమన్నారు.

ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేని వాళ్లంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన చెప్పారు.

"పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే ఎన్నో పత్రాలు సేకరించుకోవాలి. లాయర్లకు చెల్లించుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకోవాలి. దీనికి కావాల్సిన ఆర్థిక స్తోమత లేనివాళ్లు ఆత్మహత్యల బాట పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది" అని షాజహాన్ వ్యాఖ్యానించారు.

వివిధ మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం, ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేవనే ఆందోళనతో ఇప్పటివరకు 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

తుది జాబితా విడుదలయ్యే తేదీ దగ్గర పడుతుండటంతో పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం