ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్?

  • 24 జూలై 2019
ఆపరేషన్ కమల్ Image copyright Getty Images

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని గద్దె దించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లపై కన్నేసింది.

మధ్యప్రదేశ్ పరిస్థితులు కూడా కర్ణాటకలాగే ఉన్నాయి. అక్కడ మొత్తం 231 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంది.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 114 స్థానాలు లభిస్తే, బీజేపీకి 108 సీట్లు వచ్చాయి. ఇక్కడ బీఎస్పీకి ఇద్దరు, సమాజ్‌వాదీ పార్టీకి ఒకరు, నలుగురు ఇండిపెండెంట్లు ఉండడంతో వారి డిమాండ్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. వీరిలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకు మంత్రిమండలిలో చోటు కూడా దక్కింది.

కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ బాగా పట్టు పెంచుకుంటోంది. దాంతో కాంగ్రెస్.. ఈ రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

Image copyright FACEBOOK KAMALNATH

రాజస్థాన్‌లో బీజేపీకి కష్టమే

రాజస్థాన్‌లో పరిస్థితులు మాత్రం కాస్త కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల తేడా చాలా ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్‌కు 112 స్థానాలుంటే, బీజేపీకి 72 సీట్లే ఉన్నాయి. ఈ తేడాను తగ్గించడానికి మిగతా పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టినా, అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. అంటే కాంగ్రెస్‌లో చీలిక రాకుండా బీజేపీ ఇక్కడ సీఎం కుర్చీని దక్కించుకోవడం కష్టం.

ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే, ఇక్కడ కాంగ్రెస్‌లో చాలా గ్రూపులు ఉన్నట్టు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, దిగ్విజయ్ సింగ్‌ వర్గాలు ఉన్నాయి. కమల్‌నాథ్ ఇప్పటికీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరూ లేరు.

Image copyright Getty Images

మధ్యప్రదేశ్‌లో కసరత్తులు

"పంజాబ్ అయినా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అయినా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న భూపేష్ బఘేల్‌ను ముఖ్యమంత్రిగా చేశారు. చాలా నెలల తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించారు" అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత అవినాశ్ బీబీసీతో అన్నారు.

కానీ ఇప్పుడు బీజేపీ తన మొత్తం దృష్టిని మధ్యప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడంపైనే పెట్టింది.

దానికి కసరత్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఎందుకంటే, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హఠాత్తుగా తన పాత ఫాంలోకి వచ్చేశారు.

Image copyright Twitter

ఎమ్మెల్యేకు 50 కోట్ల ఆఫర్

"కమల్‌నాథ్ ప్రభుత్వం ఏదో అలా నడుస్తోంది. అది నడిచినంత కాలం అలాగే నడుస్తుంది" అని చౌహాన్ ట్వీట్ చేశారు.

బీజేపీకి దమ్ముంటే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి చూడాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సవాలు విసిరారు. అప్పుడే బీజేపీ భ్రమలన్నీ దూరం అవుతాయన్నారు.

ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు మాత్రం మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలకు వేరే అర్థాలు తీశారు. బీజేపీ కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

"మా ప్రభుత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాంబతి బాయి ఉన్నారు. తను పార్టీ మారితే 50 కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని ఆమె చెప్పారు. వాళ్లు డబ్బుతో ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు. కానీ ఎన్ని చేసినా కాంగ్రెస్ ఐక్యంగా ఉంటుంది. మా సహచరులు మాతోనే ఉంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి అన్నిరకాల ఎత్తులూ వేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.

Image copyright Getty Images

పాత కేసులు తిరగదోడుతారా

"కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా 1984 సిక్కుల ఊచకోత కేసును తెరుస్తామని కేంద్రం ముందే సంకేతాలు ఇచ్చింది. దానితోపాటు ఆయనపై ఆదాయాన్ని మించిన ఆస్తులకు సంబంధించి చాలా పాత కేసులను కూడా తిరగదోడనున్నట్టు తెలుస్తోందని సీనియర్ జర్నలిస్ట్ సునీల్ జోషీ చెప్పారు.

"బీజేపీ వ్యూహం ఏంటంటే... ఏదైనా ఒక రాష్ట్రంలో వేరే పార్టీలు అధికారంలో ఉంటే, అక్కడ మెజారిటీలో తేడా చాలా తక్కువగా ఉంటే, తక్కువ ఆధిక్యంతో ప్రభుత్వం నడిపిస్తుంటే, ఆ ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నం చేయడమే" అని జోషి అన్నారు.

"కాంగ్రెస్ సంస్థాగతంగా అంతమైపోయింది. అందుకే కొందరు నేతలకు బీజేపీలో తమ రాజకీయ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని అనిపిస్తోంది. కాంగ్రెస్ మాత్రం.. మేం ఆ పార్టీని ముక్కలు చేస్తున్నాం అని చెబుతోంది. అది తప్పు. ఎవరూ ఎలాంటి బలవంతం చేయడం లేదు" అని బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్ విచార్ నేతామ్ బీబీసీతో అన్నారు.

Image copyright Getty Images

కానీ రాజస్థాన్‌ కాంగ్రెస్ ప్రతినిధి అర్చనా శర్మ మాత్రం.. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఏం చేయగలిగినా, రాజస్థాన్‌లో మాత్రం వారి ఎత్తులు పనిచేయవు అన్నారు. అయితే బీజేపీ మాత్రం గెహ్లాత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తోంది.

"రాజస్థాన్‌లో కాంగ్రెస్ స్వయంగా 112 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. బీజేపీకి కేవలం 72 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. రాజస్థాన్‌లో అధికారంలోకి రావాలనుకోవడం బీజేపీకి కలగానే మిగిలిపోతుంది" అని అర్చన చెప్పారు.

Image copyright Getty Images

ఉత్సాహంగా బీజేపీ

కానీ రాజస్థాన్ బీజేపీ శాఖ చాలా ఉత్సాహంతో ఉంది. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వారి కూటమిలోని వారు తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

బీజేపీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలాగోలా ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తోందన్న విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి ముకేష్ పారిఖ్ కొట్టిపారేశారు.

"కాంగ్రెస్ లోలోపల చాలా లుకలుకలు ఉన్నాయి. జాతీయ అధ్యక్షుడు పారిపోయారు. తర్వాత అధ్యక్షుడుగా ఇంకా ఎవరినీ నియమించలేదు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు దిగులుతో, నైరాశ్యంలో ఉన్నారు. అలాంటప్పుడు బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయి. మేం అందర్నీ స్వాగతిస్తాం. ప్రలోభపెట్టం" అన్నారు.

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే అధికార కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య స్వల్ప తేడా ఉన్నది అక్కడ మాత్రమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)