‘మరో ఆరేళ్లలో భారత్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బైక్‌లే’

  • 26 జూలై 2019
ఎలక్ట్రిక్ వాహనం

2030లోగా భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లు వంద శాతం ఉండాలని, ఇది తన లక్ష్యమని 2017లో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆటోమొబైల్ పరిశ్రమ విస్మయం చెందింది.

"మీకు నచ్చినా, నచ్చకున్నా నేను ఇది సాధించి తీరతాను. మీ అభిప్రాయాలు కూడా అడగను. బలవంతంగానైనా సరే ఇది జరిగేలా చూస్తా" అని ఆయన ఒక పారిశ్రామిక సదస్సులో తేల్చి చెప్పారు.

బ్రిటన్, ఫ్రాన్స్ సైతం సంప్రదాయ ఇంజిన్లతో నడిచే కార్లను దశల వారీగా తగ్గిస్తూ 2040 నాటికి పూర్తిగా ఆపేయాలనుకొంటున్న నేపథ్యంలో, భారత్‌లో 2030 నాటికే వంద శాతం ఎలక్ట్రిక్ కార్లే ఉండాలన్న లక్ష్యం చాలా పెద్దది.

ఈ లక్ష్యాన్ని తర్వాత గడ్కరీతోపాటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 100 శాతం నుంచి బాగా తగ్గించుకున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల లక్ష్యం ఇప్పుడు కేవలం 30 శాతమే.

ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యతిరేకత, ఉద్యోగాలు పోతాయనే ఆందోళన, ఇతర కారణాలతో ప్రభుత్వం తన లక్ష్యాన్ని కుదించుకుంది.

ఇప్పుడు కార్ల కన్నా దిగువ స్థాయి వాహనాలైన టూవీలర్లు, ఆటో రిక్షాలపై దృష్టి పెట్టాలని సర్కారు నిర్ణయించింది.

Image copyright Getty Images

2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశంలో సుమారు 34 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. అదే టూవీలర్లైతే ఏకంగా 2 కోట్ల 12 లక్షలు విక్రయమయ్యాయి. త్రిచక్ర వాహనాల సంఖ్యయితే ఏడు లక్షలుగా ఉంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల గణాంకాలు చెబుతున్న విషయమిది.

ప్రభుత్వ కొత్త ప్రతిపాదన ప్రకారం దేశంలో 2023 నాటికి త్రిచక్ర వాహనాలు, 2025 నాటికి టూవీలర్లు అన్నీ ఎలక్ట్రిక్‌వే ఉంటాయి.

ఈ విషయంలో ప్రభుత్వానికి రెండు ప్రధాన లక్ష్యాలున్నట్లు కనిపిస్తోంది. ఒకటి- కాలుష్యాన్ని నియంత్రించడం. రెండు- ఎదుగుతున్న రంగమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ముందు వరుసలో నిలవడం.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలవాలని భారత్ కోరుకొంటోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల 2019-20 బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

అమెరికాలోని డెట్రాయిట్ నగరం ఆటోమొబైల్ తయారీ రంగానికి ఎలా కేంద్రంగా నిలుస్తోందో, అలా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భవిష్యత్తులో ఒక భారత నగరం కేంద్రంగా ఎదగాలనే ఆశాభావాన్ని భారత ఆర్థిక సర్వే వ్యక్తంచేసింది.

Image copyright Getty Images

అదే సవాలు

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పోటీదారుల కంటే ముందు నిలవడం, వాటికి మార్కెట్‌ను కల్పించడం సవాలుతో కూడుకున్న విషయాలు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహన రంగంలో ముందంజలో ఉన్న చైనా తరహాలో మౌలిక సదుపాయాలు భారత్‌కు లేవు.

ఈ రంగంలో ప్రపంచంలోనే చైనా అతిపెద్ద మార్కెట్. ఈ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలు చైనాలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. బ్యాటరీలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం కూడా చైనాయే.

2018లో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలు సహా నూతన ఇంధన వాహనాల(ఎన్‌ఈవీల) అమ్మకాలు బాగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికాలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు 'టెస్లా' చైనాలోని షాంఘై నగరంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఈ ఏడాది చివర్లోగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది.

Image copyright Getty Images

చైనా, నార్వేల నుంచి ఏం నేర్చుకోవాలి?

చైనా నుంచి భారత్ కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.

చైనాలో కాలుష్యం అధికంగా ఉండే నగరాల్లో విక్రయించే సంప్రదాయ కార్ల సంఖ్యపై పరిమితి పెట్టడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను అధికారులు ప్రోత్సహించారు.

కార్ల తయారీ సంస్థలు వాటి ఉత్పత్తిలో నిర్దేశిత శాతం మేర ఎలక్ట్రిక్ కార్లను తయారుచేయాలనే నిబంధన కూడా పెట్టారు.

ఐరోపాలోని నార్వే దేశం నుంచి కూడా భారత్ స్ఫూర్తి పొందాల్సి ఉంది. అక్కడ 2018లో కార్ల అమ్మకాల్లో 50 శాతం కార్లు ఎలక్ట్రిక్‌వే. కంబస్టన్-ఇంజిన్‌తో నడిచే సంప్రదాయ వాహనాలను దశల వారీగా 2025 నాటికి దేశంలో లేకుండా చేయాలని నార్వే నిర్ణయించింది.

భారత్‌లోనూ కొన్ని ప్రోత్సాహకర సంకేతాలు ఉన్నాయి.

Image copyright Reuters

పెరుగుతున్న కొత్త మోడళ్లు

దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్‌, నివాస ప్రాంతాల్లో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.

ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్), ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) త్వరలోనే ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని సన్నాహాలు చేస్తున్నాయి.

రానున్న రెండేళ్లలో పది వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఈఈఎస్‌ఎల్ భావిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త మోడళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Image copyright Getty Images

హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ కారు 'కోనా'ను ఈ నెల్లోనే ఆవిష్కరించింది. 'నిస్సన్' తన మోడల్ 'లీఫ్‌'ను త్వరలోనే విడుదల చేసే అవకాశముంది.

భారత సంస్థలు మహీంద్రా&మహీంద్రా, టాటా మోటార్స్ రెండూ ఎలక్ట్రిక్ కార్లు అమ్ముతున్నాయి.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఇప్పటికే అనేక మోడళ్లు వచ్చాయి.

‘బౌన్స్’ లాంటి బైక్ షేరింగ్ కంపెనీలు ఎలక్ట్రిక్ బాట పడుతున్నాయి.

చాలా నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు కూడా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి.

ట్యాక్సీ సేవలు అందించే యాప్‌లు, హోం డెలివరీ సర్వీసులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నాయి.

ఎలక్ట్రిక్ క్యాబ్‌లను ప్రయోగాత్మకంగా తిప్పి చూశాక, ‘ఓలా’ విద్యుత్ బైక్‌లు, త్రిచక్ర వాహనాలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. వాహనాల ఛార్జింగ్‌కు చాలా సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఛార్జింగ్ చేసిన బ్యాటరీలను మార్పిడి చేసుకొనే విధానం పట్ల ఓలా మొగ్గు చూపుతోంది. ‘బౌన్స్’ కూడా ఈ విధానాన్ని అనుసరిస్తోంది.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు, స్థానికంగా తయారీని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

బ్యాటరీల వ్యయం తగ్గిపోతోంది. ఇది ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌కు తోడ్పడే అవకాశముంది. తద్వారా ఇతర ఇంధనాలతో నడిచే వాహనాలతో విక్రయాల్లో ఈ వాహనాలు పోటీపడగలవు. కాలుష్యం లేకపోవడం ఈ వాహనాలతో ఉన్న అదనపు ప్రయోజనం.

తనదైన రీతిలో, తనదైన వేగంతో ఎలక్ట్రిక్ వాహన రంగంలో ముందుకు వెళ్లేందుకు ఈ అంశాలు భారత్‌కు దోహదం చేయగలవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)