మధ్యప్రదేశ్: కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తామన్న బీజేపీకి షాక్, ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిక

  • 24 జూలై 2019
కమల్ నాథ్ Image copyright FACEBOOK/THEKAMALNATH

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కౌల్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బెదిరించిన బీజేపీకి స్వయంగా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తగ్గినట్లైంది.

బుధవారం అసెంబ్లీలో ఓటింగ్ జరిగినపుడు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు.

దీంతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని త్వరలో గద్దె దించుతామన్న ఆ పార్టీకి షాక్ తగిలింది.

క్రిమినల్ లా సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ దీనిపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. దాంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు.

ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ దానికి 122 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు స్పీకర్‌ది.

విపక్షాలకు ఒక్క ఓటూ రాలేదు

కమల్‌నాథ్ ప్రభుత్వ ఎమ్మెల్యేలకు అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. విపక్షాలకు ఒక్క ఓటు కూడా రాలేదు.

ఎందుకంటే ఓటింగ్‌లో బీజేపీ పాల్గొనలేదు. అయితే, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు.

దమ్ముంటే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టమని బీజేపీకి కమల్ నాథ్ మొదటే సవాలు విసిరారు.

అందుకే అసెంబ్లీలో క్రిమినల్ లా సవరణ బిల్లు ప్రవేశపెట్టినపుడు దానిపై ఓటింగ్ జరిగేలా చూసింది.

"బీజేపీ గత ఆరు నెలలుగా మాది మైనారిటీ ప్రభుత్వం అని చెబుతూ వస్తోంది. ఈరోజు ఉదయం కూడా ప్రతిపక్ష నేత త్వరలో ప్రభుత్వం పడిపోతుందనే సంకేతాలు ఇచ్చారు. నేను ఆయన్ను స్వాగతించాను. అవిశ్వాస తీర్మానం పెట్టమన్నాను. వాళ్లు దాన్ని స్వీకరించలేదు" అని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిన తర్వాత కమల్ నాథ్ అన్నారు.

"మేం అటో ఇటో తేల్చేయాలని అనుకున్నాం. ఈరోజు జరిగిన ఓటింగ్ ఒక బిల్లుపై జరిగింది కాదు. ఇది మెజారిటీ పొందేందుకు జరిగింది. ఈ ఓటింగ్‌లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు" అని కమల్ నాథ్ అన్నారు.

మైహర్ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠీ అంతకు ముందు కాంగ్రెస్‌లోనే ఉండేవారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన "నాకు మైహర్ అభివృద్ధి కూడా కావాలి. బీజేపీ అబద్ధపు హామీలతో తనను తాను ప్రచారం చేసుకుంటోంది. మైహర్‌లో కూడా చాలా హామీలు గుప్పించింది. అవేవీ నెరవేరలేదు" అని త్రిపాఠీ అన్నారు.

"ఈరోజు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మెరుగైన పాలన అందిస్తోంది. నేను కమల్‌నాథ్‌తో ఇంతకు ముందు కూడా కలిసి పనిచేశా. దీనిని మీరు ఘర్ వాపసీ అనే అనుకోండి. నాకు నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి. అక్కడ ఎలాంటి పనులూ జరగలేదు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)