మూకదాడులు తక్షణమే ఆగాలి.. మోదీకి ప్రముఖుల లేఖ

  • 24 జూలై 2019
మణిరత్నం Image copyright facebook/madrastalkiesofficial
చిత్రం శీర్షిక మణిరత్నం

ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న మూకదాడుల (లించింగ్) ఘటనలతో ఆందోళనకు గురైన కళాకారులతోపాటు చాలా మంది ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కళ, వైద్య, విద్యారంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకాలు చేశారు. చిత్రపరిశ్రమ నుంచి మణిరత్నం, అనురాగ్ కశ్యప్, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణ, కొంకణా సేన్ లాంటి ప్రముఖులు ఉన్నారు. మిగతా వారిలో చరిత్రకారులు, రచయిత రామచంద్ర గుహ లాంటివారు కూడా ఈ లేఖపై సంతకం చేశారు.

లించింగ్ ఘటనలు తక్షణం ఆగేలా చూడాలని వారు ఈ లేఖలో ప్రధానిని కోరారు.

ప్రముఖులు తమ లేఖలో 'నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో' (ఎన్సీఆర్బీ) గణాంకాలను ప్రస్తావించారు. 2009 జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 మధ్యలో మతగుర్తింపు ఆధారంగా 254 నేరాలు నమోదైనట్లు తెలిపారు. వీరిలో 91 మందిని హత్య చేశారని, 579 మంది గాయపడ్డారని చెప్పారు.

భారత రాజ్యాంగంలో భారతదేశాన్ని ఒక లౌకిక గణతంత్ర రాజ్యమని, ఇక్కడ అన్ని మతాలు, సమాజాలు, కులాలు, అన్ని లింగాల వారికి సమాన హక్కులు లభించాయని చెప్పారని వీరు లేఖలో తెలిపారు.

దేశంలో 14 శాతం ముస్లి జనాభా ఉంది, కానీ ఇలాంటి 62 శాతం నేరాల్లో వారే బాధితులుగా నిలిచారని లేఖలో చెప్పారు.

ఈ లేఖలో చెప్పిన వివరాల ప్రకారం ఇలాంటి నేరాల్లో 90 శాతం నరేంద్ర మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చాక, అంటే 2014 మే తర్వాతే జరిగాయి.

Image copyright RAMCHANDRA GUHA
చిత్రం శీర్షిక రామచంద్ర గుహ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో లించింగ్ ఘటనలను ఖండించారు. కానీ అది సరిపోదని ప్రముఖులు భావించారు. ఇలాంటి కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో 'అసమ్మతి' ప్రాధాన్యాన్ని కూడా వీరు తమ లేఖలో నొక్కి చెప్పారు. ఏదైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే, వారిపై 'యాంటీ నేషనల్' లేదా 'అర్బన్ నక్సల్' అనే ముద్ర వేయకూడదని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం