ఇంటికి చేరిన జషిత్.. మూడు రోజుల తర్వాత వదిలిపెట్టిన కిడ్నాపర్లు

  • 25 జూలై 2019
జషిత్ Image copyright UGC

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ఉత్కంఠ రేపిన బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. నాలుగేళ్ల జషిత్‌ను గురువారం తెల్లవారు జామున కిడ్నాపర్లు తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి మండలం కుతుకులూరు రోడ్డు వద్ద వదిలి వెళ్లారు.

ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బాలుడిని వదిలి వెళ్లడం తాము చూసినట్లు దగ్గర్లో ఉన్న క్వారీలో పనిచేసే కూలీలు తమకు సమాచారం ఇచ్చారని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అష్మీ బీబీసీకి తెలిపారు.

తమ బృందం ఆ ప్రాంతానికి చేరుకుని బాలుడిని తీసుకువచ్చిందని, తానే స్వయంగా వెళ్లి ఆ బాలుడిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించానని ఆమె చెప్పారు.

బాలుడికి గాయాలేమీ కాలేదని, క్షేమంగా ఉన్నాడని వివరించారు.

కిడ్నాపర్లను త్వరలోనే పట్టుకుంటామని, బాలుడిని రక్షించడంలో సహకరించిన ప్రజలకు, మీడియా, సోషల్ మీడియాకు అష్మీ కృతజ్ఞతలు తెలిపారు.

మండపేటలో కిడ్నాప్.. సోషల్ మీడియాలో వైరల్

తూర్పు గోదావరిలోని మండపేటలో సోమవారం ఉదయం జషిత్ కిడ్నాప్‌కు గురయ్యాడు.

తన నానమ్మ పార్వతితో కలిసి జషిద్ తమ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి అతడిని ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

జషిత్ తల్లి నాగావళి తొమ్మిది నెలల గర్భవతి. కుమారుడి కోసం ఆమె, జషిత్ తండ్రి వెంకటరమణ కన్నీరు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బాలుడి ఫొటోను షేర్ చేస్తూ, ఆచూకీ దొరికితే వెంటనే తెలియజేయాలని కోరుతూ చాలా మంది ఫేస్‌బుక్‌, ట్విటర్ వంటి వేదికల్లో పోస్ట్‌లు పెట్టారు.

టీవీ ఛానెళ్లు కూడా ఈ కిడ్నాప్ వ్యవహారం గురించి విస్తృతంగా కథనాలు ప్రసారం చేశాయి.

దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 500 మంది సిబ్బందితో మొత్తం 17 బృందాలు ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఎస్పీ తెలిపారు.

Image copyright UGC

‘ఇడ్లీలు పెట్టారు’

ఇంటికి చేరుకున్న తర్వాత కిడ్నాపర్ల గురించి జషిత్ మీడియాకు వివరాలు వెల్లడించాడు.

కిడ్నాపర్లు రోజూ తనకు తినడానికి ఇడ్లీలు పెట్టారని వివరించాడు.

తనను వాళ్లు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని, రాజు అనే యువకుడి ఇంట్లో ఉంచారని అన్నాడు.

ఇంటికి చేరుకున్న వెంటనే జషిత్ ఆకలిగా ఉందని అన్నాడని, అతడికి టిఫిన్ తినిపించామని వెంకట రమణ బీబీసీకి తెలిపారు.

జషిత్‌ను చూసిన వెంటనే తన భార్య ఉద్వేగానికి గురయ్యారని, తమ కుమారుడిని హత్తుకుని ఏడ్చారని ఆయన చెప్పారు.

పోలీసులు వైద్యుడిని తీసుకువచ్చి, జషిత్‌కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారని రమణ తెలిపారు.

‘ముసుగులు ధరించారు’

కిడ్నాపర్ల గురించి వివరాలు అడిగినప్పుడు నానమ్మను కొట్టి తనను తీసుకువెళ్లినట్లు జషిత్ చెబుతున్నాడని, కిడ్నాపర్ల మొహాలకు ముసుగులు ఉన్నాయని అంటున్నాడని రమణ వివరించారు.

నిద్ర లేకపోవడంతో బాలుడు నీరసంగా ఉన్నాడని, వివరాలు చెప్పేందుకు కాస్త భయపడుతున్నాడని అన్నారు.

కుతుకులూరు రోడ్డులోని అమ్మవారి గుడి దగ్గర జషిత్‌ను అక్కడి క్వారీలో పనిచేస్తున్న ఏసు అనే వ్యక్తి గుర్తించారని, కిడ్నాప్ వ్యవహారం ముందుగానే తెలియడంతో ఆయన క్వారీ యజమానిని అప్రమత్తం చేశారని రమణ చెప్పారు.

గురువారం ఉదయం ఆరుగంటలకు క్వారీ యజమాని నుంచి తనకు ఫోన్ వచ్చిందని, వెంటనే అక్కడికి వెళ్లానని వివరించారు.

కిడ్నాప్ ఉదంతం గురించి సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడం, మీడియాలోనూ కథనాలు రావడం తమ కుమారుడు ఇంటికి తిరిగిరావడంలో ప్రధాన పాత్ర పోషించాయని రమణ అన్నారు. ఇందుకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)