ఇస్రో గగన్‌యాన్: అంతరిక్షంలోకి మానవాకార రోబోలను ఎందుకు పంపిస్తోంది

  • 27 జూలై 2019
రోబో Image copyright Getty Images
చిత్రం శీర్షిక హ్యూమనాయిడ్ రోబో (ప్రతీకాత్మక చిత్రం)

మనుషులకన్నా ముందు అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి జీవులు జంతువులు. అయితే.. ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోలను (మానవాకార రోబోలను) మాత్రమే అంతరిక్షనౌకలో విశ్వంలోకి పంపిస్తున్న మొట్టమొదటి దేశం భారతదేశం.

భారతదేశం 2022లో తన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు కేంద్ర ప్రభుత్వం 140 కోట్ల డాలర్లు నిధులు కేటాయించింది.

ఈ ప్రయోగానికి భారతదేశపు అతి భారీ రాకెట్ అయిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-3 (జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ఉపగ్రహ వాహక నౌక)ను ఉపయోగించాలని ఇస్రో యోచిస్తోంది.

భారత వాయుసేనతో కలిసి ఇస్రో 10 మంది వ్యోమగాములకు శిక్షణనిస్తుంది. వారిలో ముగ్గురిని 2022 అంతరిక్షయానానికి ఎంపిక చేస్తుంది.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఇస్రో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌ను అంతరిక్ష ప్రయాణానికి ఉపయోగించనుంది

ఇప్పటివరకూ.. రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే దేశీయంగా తయారు చేసిన రాకెట్లను ఉపయోగించి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాయి. భారతదేశం కూడా ఇలాగే చేయగలిగితే.. తన సొంత గడ్డ నుంచి మనుషులను అంతరిక్షంలోకి పంపించిన నాలుగో దేశంగా నిలుస్తుంది.

అయితే.. మనుషులను అంతరిక్షంలోకి పంపించిన ఇతర దేశాలు.. మనుషుల కన్నా ముందు జంతువులను పంపించాయి. కానీ భారతదేశం అలా చేయటం లేదు. జంతువులను కాకుండా హ్యూమనాయిడ్ రోబోలను పంపిస్తోంది. అంతరిక్షంలో దీర్ఘ కాలం పాటు ఉంటే.. అక్కడ భారరహిత స్థితి, అణుధార్మికతలు మనుషుల శరీరాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది అర్థంచేసుకోవటానికి ఈ రోబోలను పంపుతోంది.

''ఇది చాలా ఆకాంక్షలు సవాళ్లతో కూడిన జాతీయ కార్యక్రమం. అయితే.. భారతీయులను అంతరిక్షంలోకి పంపించేముందు.. క్రూ (వ్యోమగాములు ప్రయాణించే) మాడ్యూల్ పరిమితులను పరీక్షించటానికి హ్యూమనాయిడ్లను రెండు సార్లు పంపిస్తాం'' అని చెప్పారు ఇస్రో చైర్మన్ కె.శివన్.

అంతరిక్ష ప్రయాణాలు ప్రారంభించిన తొలినాళ్లలో.. భారరహిత పరిస్థితులను మనుషులు తట్టుకుని మనగలుగుతారా, అక్కడి అణుధార్మికత ప్రాణాంతకమవుతుందా.. అనే అంశాలపై ఆందోళనలు ఉండేవి. అంతరిక్షంలోకి ప్రాణులను పంపించటం సురక్షితమేనా అనేది నిర్ధారించుకోవటానికి చాలా ప్రయోగాలు నిర్వహించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సోవియట్ రష్యా అంతరిక్షంలోకి లైకా అనే కుక్కను పంపంచింది

అందులో భాగంగా.. 1961లో అంతరిక్షంలో భూమి చుట్టూ తిరిగిన మొదటి మానవుడు యూరీ గగారిన్‌ను అక్కడికి పంపించటానికి ముందు.. ఈగలు, ఎలుకలు, కోతులు, కుక్కలు, పిల్లులు, చింపాజీలు, తాబేళ్లు, సాలీళ్లను విశ్వంలోకి పంపించారు.

2011లో అంతరిక్ష నౌకను వినియోగం నుంచి తప్పించిన తర్వాత.. అమెరికా నుంచి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఏదీ జరగలేదు. నాసా ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వ్యోమగాములను పంపించటానికి, తీసుకురావటానికి రష్యా సోయజ్ మాడ్యూళ్ల మీద ఆధారపడింది.

అమెరికా నుంచి వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లటానికి సమర్థవంతమైన అంతరిక్షనౌకను నిర్మించటం కోసం ఎలాన్ మస్క్ స్పేస్-ఎక్స్ సంస్థకు, బోయింగ్ సంస్థకు కలిపి 680 కోట్ల డాలర్లు నిధులు అందించింది నాసా.

Image copyright AFP
చిత్రం శీర్షిక భారత శాస్త్రవేత్తలు దేశీయంగా తయారుచేసిన స్పేస్ సూట్‌‌ ధరించిన వ్యాస రచయిత పల్లవ బాగ్లా

ప్రస్తుతం ఈ అమెరికా సంస్థలు రెండు కొత్త క్రూ మాడ్యూళ్లను తయారు చేస్తున్నాయి. స్పేస్-ఎక్స్ నిర్మిస్తున్న వాహనానికి డ్రాగన్ అని పేరు పెట్టారు. ఇక బోయింగ్ తయారు చేస్తున్న నౌకకు స్టార్‌లైనర్ అని నామకరణం చేశారు. ఇవి రెండూ త్వరలో తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నాయి.

గత మార్చిలో క్రూ డ్రాగన్‌ను అంతరిక్షంలోకి పంపించటానికి స్పేస్-ఎక్స్ సంస్థ తన ఫాల్కన్-9 రాకెట్‌ను ఉపయోగించుకుంది. ఈ అంతరిక్ష నౌక పనితీరును పరీక్షించటానికి అందులో రిప్లే అని పేరుపెట్టిన ఓ మానవాకార డమ్మీ వ్యోమగామిని పంపించారు. ఈ ప్రయోగాత్మక మిషన్‌లో మనుషులు ఎవరూ లేరు.

''స్పేస్-ఎక్స్ కానీ, బోయింగ్ కానీ.. తమ అంతరిక్ష నౌకల్లో మనుషులకన్నా ముందు జంతువులను పంపించబోవు'' అని నాసా వ్యోమగామి, ఏరోస్పేస్ వైద్య నిపుణుడు డాక్టర్ మైకేల్ ఆర్ బారట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)