జనాభా లెక్కల్లో పొరపాట్లు దొర్లాయా.. యుగాండా నుంచి భారత్‌కు భారీ వలసలు నిజమేనా

  • 26 జూలై 2019
వ్యక్తులు Image copyright Getty Images

ఆఫ్రికాలోని యుగాండా నుంచి భారత్‌కు వలస వచ్చినవారి సంఖ్య శరవేగంగా, వేలకు వేలు పెరిగిందని భారత్ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ భారీ పెరుగుదలలో వాస్తవమెంత? అధికారులు చేసిన పెద్ద తప్పిదం వల్లే ఈ సంఖ్య భారీగా పెరిగినట్లు కనిపిస్తుండొచ్చని వలస అంశాల నిపుణుడు చిన్మయ్ తుంబే చెప్పారు.

చిన్మయ్ విశ్లేషణ ఆయన మాటల్లోనే....

1890ల్లో భారత్ నుంచి సుమారు 40 వేల మందిని వలస కార్మికులుగా యుగాండా తీసుకెళ్లారు. వీరిలో అత్యధికులు పంజాబీలే. యుగాండా రాజధాన కంపాలాను కెన్యాలోని మొంబాసతో కలిపేందుకు చేపట్టిన యుగాండా రైల్వే నిర్మాణంలో పాల్గొనేందుకు వీరిని అక్కడకు తీసుకెళ్లారు.

1972లో సైనిక పాలకుడు ఈదీ అమీన్ ఆదేశాల మేరకు వీరంతా ఉగాండాను వీడాల్సి వచ్చింది. వీరిలో చాలామంది యుగాండా సంపదను దోచుకొంటున్నారని ఆయన అప్పట్లో ఆరోపించారు. (వీరిలో చాలా మంది 1980లు, 1990ల్లో తిరిగి యుగాండాకు వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచారు.)

ద ఘోస్ట్ అండ్ ద డార్క్‌నెస్(1996), ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్(2006) లాంటి హాలీవుడ్ చిత్రాల్లో ఈ అంశాలను చూపించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈదీ అమీన్

ఇప్పుడు ఈ సంవత్సరంలో యుగాండా, భారత్ మధ్య సంబంధాలను చాటే మరో ఆసక్తికర అంశం 2011 భారత ప్రభుత్వ జనగణన వివరాల రూపంలో వెలుగులోకి వచ్చింది.

భారత్‌లో జనగణన పదేళ్లకోసారి జరుగుతుంది. అందులోని కొన్ని వివరాలను ఇప్పుడు విడుదల చేస్తున్నారు.

భారత జనాభా 2001 నుంచి 2011 మధ్య పదేళ్ల కాలంలో 18.1 కోట్లు పెరిగి 121 కోట్లకు చేరిందని ఈ డేటా చెబుతోంది.

ఈ మధ్యే విడుదల చేసిన వలసదారుల గణాంకాల ప్రకారం- యుగాండా నుంచి భారత్‌కు వచ్చామన్నవారి సంఖ్య 2001లో 694 కాగా, 2011 నాటికి ఇది 1,51,363కు పెరిగింది.

మహిళల్లో ఈ పెరుగుదల మరీ ఆశ్చర్యకరంగా ఉంది. 2001లో యుగాండా మహిళా వలసదారుల సంఖ్య 339 మాత్రమే కాగా, 2011 నాటికి ఇది ఏకంగా 1,11,700కు దూసుకెళ్లింది.

ఇదే కాలంలో వలస వచ్చిన పురుషుల సంఖ్య 355 నుంచి 39,663కు పెరిగింది.

Image copyright Getty Images

పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక తర్వాత అత్యధికంగా ఆఫ్రికా దేశం యుగాండా నుంచే భారత్‌కు వలసలు ఉన్నాయి. ఈ వలసదారుల్లో యుగాండా నుంచి భారత్‌కు వచ్చిన యుగాండా జాతీయులు లేదా యుగాండాలో నివసిస్తూ తిరిగి భారత్‌కు వచ్చేసిన భారతీయులు ఉంటారు.

శతాబ్దం కిందటితో పోలిస్తే ఇప్పుడు ఉగాండా వెళ్లే భారతీయ వలసదారుల్లో పంజాబీల శాతం నామమాత్రం.

2001 నుంచి 2011 మధ్య ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు వలస వచ్చిన ఉగాండా జాతీయులు, లేదా యుగాండా నుంచి తిరిగి వచ్చేసిన భారతీయుల సంఖ్య 5 నుంచి 94,704కు పెరిగింది.

ఈ గణాంకాలు చూస్తే జనగణనలో ఏదో పెద్ద తప్పిదం జరిగిందనిగాని, లేదా మన కాలంలో ముందెన్నడూ చూడని సామాజిక పరిణామం సంభవించిందనిగాని అనిపించవచ్చు. నాకైతే పెద్ద తప్పిదమే జరిగి ఉండొచ్చని అనిపిస్తోంది.

రెండు అంశాలు నా అంచనాను బలపరుస్తున్నాయి.

ఒకటి- వలసదారుల్లో మహిళలు, మగవారి సంఖ్యల్లో భారీ తేడా ఉంది. రెండోదేమిటంటే- ఉగాండా నుంచి వచ్చినవారిలో 77 వేల మందికి పైగా వలసదారులు తాము పదేళ్లకుపైగా భారత్‌లో ఉంటున్నామన్నారు. కానీ 2001 జనగణన ప్రకారం వీరి సంఖ్య 694.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2060 నాటికి భారత జనాభా 160 కోట్ల నుంచి 180 కోట్ల మధ్య ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ రెండు అంశాలనూ గమనిస్తే, జనగణనలో తప్పు జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.

జనగణన ప్రశ్నావళి ఒక చిన్నపత్రం. జనాభా లెక్కల సమయంలో, ఎవరైనా వ్యక్తి తాను వేరే దేశం నుంచి వచ్చానని చెబితే, సిబ్బంది ఆ దేశం పేరును నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ పత్రాలను స్కాన్ చేస్తారు. తర్వాత ఈ సమాచారం ఆధారంగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ పట్టికలు రూపొందిస్తుంది. వీటిని వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.

యుగాండా నుంచి భారత్‌కు వలస వచ్చినవారి సంఖ్యపై పరిశీలన జరుపుతున్నామని జనగణన విభాగం సీనియర్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

(చిన్మయ్ తుంబే ఇండియా మూవింగ్: ఎ హిస్టరీ ఆఫ్ మైగ్రేషన్' పుస్తక రచయిత)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం