ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ

  • 25 జూలై 2019
ఆర్టోస్

కూల్ డ్రింకు తాగే చాలా మందికి ప్రపంచంలో మొదటి, రెండో స్థానాల్లో ఉన్న బ్రాండ్లు తెలుసు. భారత్‌లో కూడా అనేక కూల్ డ్రింక్ బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో మేడిన్ ఈస్ట్ గోదావరి ఆర్టోస్ కూల్ డ్రింక్ ప్రత్యేకమైనది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రింక్ పరిశ్రమ.. ఎంతో పోటీని, ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని నిలబడింది. వందేళ్ల దీని ప్రస్థానం వెనుక, ఎన్ని సవాళ్లు వచ్చినా తమ ఉత్పత్తి కొనసాగించాలన్న పట్టుదల ఉంది. "ఇది మా డ్రింకు అండీ!" అని సొంతం చేసుకున్న మార్కెట్ ఉంది.

అలా మొదలైంది

సంస్థ ప్రస్తుత మేనేజింగ్ పార్ట్‌నర్ అడ్డూరి జగన్నాథ వర్మ అందించిన వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్ర రాజు, జగన్నాథ రాజులు అన్నదమ్ములు. 1910-11 సమయంలో రామచంద్ర రాజు ఓ రోడ్ కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగి. ఆ పనులపై కాకినాడలోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ పాడై ఉన్న సోడా మెషీన్ కనిపించింది. నిజానికి అదేం మెషీనో కూడా ఆయనకు తెలీదు.

అంతకుముందు అక్కడ పనిచేసిన బ్రిటిష్ అధికారి దాన్ని వదిలేసి వెళ్లినట్టు సిబ్బంది చెప్పారు. దానిలో నీళ్లు పోసి ఏదో తయారు చేసుకుని తాగేవారు అని వివరించారు. దీంతో, ఆ మెషీన్ తనకు కావాలని కోరి, దానికి కొంత ధర చెల్లించి తన ఇంటికి తెచ్చుకున్నారు రామచంద్ర రాజు.

ఇంటికి తెచ్చారు కానీ, దాంతో ఏం చేయాలో తెలీదు. ఆ సందర్భంలో ఆయన ఇంటికి వచ్చిన స్నేహితుడు తాను అలాంటి యంత్రాన్ని విశాఖలో ఒక ఓడలో చూశానని చెప్పడంతో విశాఖపట్నం ఓడరేవుకు వెళ్లి అక్కడ నావికులతో మాట్లాడారు. దాన్ని సోడా మెషీన్ అని గుర్తించిన ఓడ సిబ్బంది.. రామచంద్ర రాజు ఆసక్తిని గమనించి అది పనిచేసే తీరు వివరించారు. అంతేకాదు, ఆ మెషీన్‌కి సంబంధించిన కొన్ని స్పేర్ పార్టులు అందించారు. సోడాలు పట్టేందుకు కొన్ని సీసాలు ఉచితంగా ఇచ్చారు.

ఆ మెషీన్‌ను తిరిగి రామచంద్రాపురం తీసుకువచ్చి, దానితో 12 బాటిళ్లలో సోడాలు పట్టి, వాటిని ఇంటింటికీ తిరిగి అమ్మేవారు రామచంద్ర రాజు. కానీ అప్పటికి భారతీయులకు సోడా కొత్త కావడంతో అంతగా ఆదరణ రాలేదు. సోడా సీసా చేసే శబ్దం, అందులో నుంచి వచ్చే పొగ స్థానికులకు భయాన్నీ, ఆశ్చర్యాన్నీ కలిగించాయి.

1914 ప్రాంతంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాకినాడ పరిసరాల మీదుగా వెళ్తున్న బ్రిటిష్ సైనికులు సోడాలను చూసి వాటిని తాగడం ప్రారంభించారు. అది చూసిన స్థానికులు, సోడాలు చెడు కాదని గుర్తించి, వారు కూడా తాగడం మొదలుపెట్టారు.

సోడా నుంచి కూల్ డ్రింక్ వరకూ

రామచంద్ర రాజు తమ్ముడు జగన్నాథ రాజు చదువు ముగించుకుని రామచంద్రాపురం వచ్చిన తరువాత వారికి కూల్ డ్రింక్ తయారీ ప్రారంభించాలన్న ఆసక్తి మొదలైంది. అప్పట్లో కూల్ డ్రింక్స్ షాపుల్లో అమ్మేవారు కాదు. అప్పటి మద్రాస్ నుంచి కలకత్తా వెళ్లే హౌరా మెయిల్ రైల్లో మాత్రమే అవి దొరికేవి.

కూల్ డ్రింక్ ఆలోచన ఎలా మొదలైందన్న స్పష్టమైన సమాచారం లేదు. కానీ రామచంద్రాపురం దగ్గర్లోని ఒక లైబ్రరీకి తరచూ వెళ్లే జగన్నాథ రాజు, అక్కడ ఒక మేగజైన్లో కూల్ డ్రింక్ ముడి సరుకులు సరఫరా చేసే బ్రిటిష్ కంపెనీ ప్రకటన (యాడ్) ఒకటి చూశారు. తమకు ఆ సరుకులు కావాలని వారికి ఉత్తరం రాస్తే, సరిపడా డబ్బు, దగ్గర్లో ఉన్న ఓడరేవు వివరాలు పంపాలని సమాధానం వచ్చింది. డబ్బు కడితే, కాకినాడ ఓడరేవుకు సరుకు వచ్చింది.

ముడి సరుకు అంటే కేవలం ఫ్లేవర్లు మాత్రమే కాదు. అప్పట్లో భారతదేశంలో గాజు సీసాల తయారీ, పంచదార ఉత్పత్తి.. ఏదీ లేదు. దీంతో సీసాలు, వాటి మూతలు (చెక్కతో చేసే బిరడాలు), పంచదార (చక్కెర), ఫ్లేవర్లు, సిట్రస్ యాసిడ్ ఇవన్నీ యూరప్ నుంచి దిగుమతి చేసుకునేవారు. వాటిని ఇక్కడ తగిన పాళ్లలో కలిపి కూల్ డ్రింక్స్ తయారు చేసేవారు. అలా 1919లో మొదటిసారి కూల్ డ్రింక్స్ వ్యాపారం ప్రారంభమైంది.

ఆ సమయంలో భారతదేశంలో అతి కొద్ది ప్రాంతాల్లోనే సాఫ్ట్ డ్రింకులు దొరికేవి. అవన్నీ పెద్ద నగరాలే. కానీ తూర్పుగోదావరి జిల్లా మాత్రం ఆ రోజుల్లోనే కూల్ డ్రింకుకు అలవాటు పడింది. మద్రాసులో స్పెన్సర్స్, మదురైలో విన్సెంట్, దిల్లీ, బాంబేల్లో డ్యూక్స్ అనే బ్రాండ్లతో కూల్ డ్రింకులు అమ్మేవారు. వాటి సరసన రామచంద్రాపురం 'రామచంద్ర రాజు డ్రింకు' చేరింది.

రెండో ప్రపంచ యుద్ధం - అన్ని డ్రింకులూ ఆగినా ఆర్టోస్ మాత్రం ఆగలేదు

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పదార్థాలపైనే కూల్ డ్రింక్ ఉత్పత్తి పూర్తిగా ఆధారపడి ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో సరకు రవాణాకు ఇబ్బంది ఎదురైంది. దిగుమతులు ఆగిపోయాయి. భారతదేశంలోని చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో భారత్‌లో కూల్ డ్రింక్స్ ఉత్పత్తి ఆగిపోయింది. దిల్లీ, బాంబే, చెన్నై.. అన్నిచోట్లా ఇదే పరిస్థితి.

కానీ ఆర్టోస్ మాత్రం ఆగలేదు.

ముడి సరుకు ఆగిపోయినా ఉత్పత్తి ఆపకూడదన్న పట్టుదలతో సొంతంగా పళ్ల రసాలతో కొత్త డ్రింకులు తయారు చేయడం ప్రారంభించారు. అటవీ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో నారింజ పళ్లు సేకరించి, సిట్రస్ యాసిడ్ బదులు నిమ్మరసం ఉపయోగించారు. పంచదార బదులు బెల్లాన్ని కరిగించి, రెండు మూడుసార్లు రిఫైన్ చేసి, ద్రవరూపంలో మార్చి, లిక్విడ్ స్వీట్‌నర్ తయారు చేశారు.

ఈ మూడింటి మిశ్రమంతో, కృత్రిమ ఫ్లేవర్లు లేని పండ్ల రసాలతో తయారైన కూల్ డ్రింకును విక్రయించడం ప్రారంభించారు.

పూర్తిగా పండ్లతో చేయడం వల్ల ఖర్చు పెరిగి లాభాలు తగ్గినా కొనసాగించారు. అదే సమయంలో.. మూతపడ్డ మద్రాస్ స్పెన్సర్స్ కూల్ డ్రింక్ వారు రామచంద్రాపురం వచ్చి ఈ ఫ్లేవర్ తమకు సరఫరా చేయమని కోరగా, ముడి సరుకు అందుబాటులో లేకపోవడం వల్ల చేయలేకపోయారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చాక మళ్లీ దిగుమతులు మొదలయ్యాయి. 1950-60లలో భారత్‌లో పరిశ్రమలు పెరిగాయి. చక్కెర కర్మాగారాలు వచ్చాయి. యూరప్‌కు చెందిన కొన్ని సాఫ్ట్ డ్రింకుల కంపెనీలు బొంబాయిలో ఎసెన్స్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాయి. దీంతో ఆర్టోస్ మళ్లీ కూల్ డ్రింకుల ఉత్పత్తి ప్రారంభించింది. ఒక దశలో ఆర్టోస్ నుంచి దాదాపు 26 ఉత్పత్తులు వచ్చేవి.

పరిమిత మార్కెట్

ప్రస్తుతం ఆర్టోస్ బ్రాండుకు తూర్పుగోదావరి జిల్లానే ప్రధాన మార్కెట్. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కొద్దిగా విస్తరించింది. 1960లలో ఈ సంస్థ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ విస్తరించింది. 1960లో విశాఖపట్నంలో ఒక యూనిట్ కూడా పెట్టారు. కానీ అదే సందర్భంలో యాజమాన్యం బీరు తయారీలోకి ప్రవేశించింది. ఆర్టోస్ బ్రూవరీస్ ఏర్పాటు చేసింది. దీంతో కూల్ డ్రింకు ఉత్పత్తిపై నుంచి దృష్టి మరలి, మార్కెట్ తగ్గింది. 1978లో బీరు ఫ్యాక్టరీని అమ్మేసి మళ్లీ కూల్ డ్రింకుపై దృష్టి పెట్టారు.

ప్రస్తుతం భారీ రీటైల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని మార్కెట్ చేస్తున్నారు. గాజు సీసాల డిస్ట్రిబ్యూషన్ కంటే, ప్లాస్టిక్ సీసాలు (పెట్ బాటిల్స్) సరఫరా సులువు కావడంతో వాటిపై దృష్టిపెట్టింది సంస్థ.

"ప్రస్తుతం మేం భారీగా విస్తరిస్తున్నాం. మరో ప్లాంటు నిర్మాణం చేయబోతున్నాం. ఏటా 30 శాతం పెరుగుదల నమోదు చేస్తున్నాం. త్వరలో విజయవాడ, హైదరాబాద్‌లలో విస్తరిస్తాం" అని బీబీసీతో చెప్పారు ప్రస్తుత మేనేజింగ్ పార్టనర్ అడ్డూరి జగన్నాథ వర్మ.

ఆర్టోస్ పేరు ఎలా వచ్చింది?

సంస్థ ప్రారంభమైనప్పుడు 'ఎ రామచంద్రరాజు అండ్ బ్రదర్స్' పేరుతో ఉండేది. కూల్ డ్రింక్ బ్రాండ్ కూడా అదే పేరుతో ఉంది.

"1950లలో రాజమండ్రిలో మరో సంస్థ బీవీ రాజు పేరుతో డ్రింక్స్ అమ్మడం ప్రారంభించారు. మేం వాడే డిజైన్, ఫాంట్ అన్నీ వారు వాడేశారు. దీంతో మా అమ్మకాలకు ఇబ్బందైంది. అప్పట్లో మా తాతగారు కోర్టుకు వెళ్లగా ట్రేడ్ మార్క్ లేకపోవడంతో కేసు నిలవలేదు. దీంతో ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. దానికి మనిషి పేరు కాకుండా వేరే పేరు అవసరం పడింది. దీంతో ఆర్టోస్ అని పెట్టారు. ఎ రామచంద్ర రాజు టానిక్స్ (స్థానికులు డ్రింకును టానిక్ అని పిలుస్తారు) అనే పేరు నుంచి ఆర్టోస్ అనే పదం తీసి పెట్టారనుకుంటున్నాం. 1958లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వచ్చింది" అని వివరించారు జగన్నాథ వర్మ.

కుటుంబ వ్యాపారం

ఆర్టోస్ బ్రాండు రామచంద్ర రాజు, జగన్నాథ రాజు సోదరుల భాగస్వామ్యంతో ప్రారంభమైంది. రామచంద్ర రాజు విడిపోయిన తరువాత కూడా ఆయన పేరు కొనసాగించారు. ఆ తరువాత జగన్నాథ రాజు కుమారులు పద్మనాభ రాజు, సత్యనారాయణ రాజులు వ్యాపారం కొనసాగించారు. తరువాత సత్యనారాయణ రాజు కుమారులు జగన్నాథ వర్మ, వీరభద్ర రాజు, పద్మనాభ వర్మలు ప్రస్తుతం భాగస్వాములుగా ఉన్నారు. వీరి తరువాత నాలుగో తరం వారు కూడా వ్యాపారంలో ఇప్పుడు ప్రవేశిస్తున్నారు.

"మా వ్యాపార విజయానికి ఒకటే కారణం. కుటుంబ సభ్యుల మధ్య సహకారం. అన్నను తమ్ముళ్లు గౌరవిస్తారు. ఒకే మాట మీద ఉంటారు. నాకు నా తమ్ముళ్లు మద్దతిస్తున్నారు" అన్నారు జగన్నాథ వర్మ.

బహుళ జాతి సంస్థలతో పోటీ

"1950లలో కోకా కోలా కంపెనీకి హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ దగ్గర్లో మాత్రమే యూనిట్ ఉండేది. వాళ్లు మాకు రాజమండ్రి ఫ్రాంచైజీ ఇస్తామన్నారు. కానీ దానికి బదులుగా, ఆర్టోస్ బ్రాండ్ ఆపేయాలని షరతు విధించారు. మేం ఒప్పుకోలేదు.

ఇక్కడ ఎవరి మార్కెట్ వారికి ఉంది. వాళ్లకు ప్రపంచవ్యాప్త మార్కెట్ ఉందని ధీమా. మా బ్రాండ్ విలువ మాకుందని మా ధీమా. గోదావరి జిల్లాల్లో కూల్ డ్రింక్ వాడకం ఎక్కువ. అందుకే కోక్‌కు ఇక్కడ రెండు ప్లాంట్లు ఉన్నాయి.

భారత్‌కే చెందిన మరో ప్రముఖ కూల్ డ్రింక్ ఉత్పత్తిదారు పార్లె బ్రాండ్ 'గోల్డ్ స్పాట్' కూడా 1970లలో రాజమండ్రిలో తమ ఫ్రాంచైజీని ప్రారంభించింది. కోక్, పెప్సీ, పార్లే సంస్థలు ఉన్నా మేం ఎప్పుడూ తగ్గలేదు. మా మార్కెట్ మాకు ఉంది" అన్నారు జగన్నాథ వర్మ.

చాలా మంది అనుకునేట్టు ఆర్టోస్ ప్రధాన డ్రింక్ కోలా కాదు. (కోక్, పెప్సీ, థమ్స్‌ అప్ రుచి వచ్చే దాన్ని కోలా అంటారు)

ఆర్టోస్ కోలా ఉత్పత్తి చేయడం లేదు. వీరిది ద్రాక్ష ఫ్లేవర్. ఆర్టోస్ అమ్మకాల్లో అదే ఎక్కువగా ఉండేది. దాంతో పాటు ఆరెంజ్, లెమన్, క్లియర్ లెమన్, సోడాలను వీరు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 100 మంది సిబ్బంది ఉన్నారు. వీరి ఉత్పత్తులు ఎంఎన్సీల కంటే 25 శాతం తక్కువ ధరకు దొరుకుతాయి.

చోటా కోక్ వచ్చినా చెదరలేదు

ఆర్టోస్ వంటి సంస్థలు భారత్‌లో పదుల సంఖ్యలో ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో అనేక కంపెనీలు స్థానికంగా రకరకాల ఫ్లేవర్లలో కూల్ డ్రింకులను అందిస్తున్నాయి. అయితే వాటిలో సుదీర్ఘ కాలం తమ మార్కెట్‌ను నిలబెట్టుకున్న, వేళ్లపై లెక్కపెట్ట దగ్గ సంస్థల్లో ఆర్టోస్ ఒకటి.

2001 ప్రాంతంలో కోక్ కంపెనీ 200 ఎంఎల్ సీసాను 5 రూపాయలకు అమ్మడం ప్రారంభించింది. ఆ ప్రయోగం భారత్‌లో మొదటిసారి తూర్పుగోదావరిలో చేసింది ఆ సంస్థ. తరువాత దేశమంతా విస్తరించింది. అప్పటి వరకూ ఎంఎన్సీల కంటే తక్కువ ధరకు కూల్ డ్రింకులు అమ్ముతున్న స్థానిక బ్రాండ్లు ఆ దెబ్బకు విలవిల్లాడాయి. చాలా సంస్థలు ఉత్పత్తి ఆపేశాయి.

"2001 ప్రాంతంలో మాక్కూడా అదొక సవాల్. మేం ఆ విషయంలో వారితో పోటీ పడ్డాం. మా డ్రింకు ధర ఐదు నుంచి ఐదున్నరకు పెంచి మళ్లీ ఐదుకు తగ్గించాం. ఆ సమయంలో కోక్ దెబ్బకు దేశంలో చాలా సంస్థలు దెబ్బతిన్నాయి. పెప్సీ కూడా అదే దారిలోకి వచ్చింది. కానీ మేం మాత్రం ఆ పోటీని కూడా తట్టుకుని నిలబడగలిగాం" అంటూ అప్పటి విషయాలు చెప్పుకొచ్చారు జగన్నాథ వర్మ.

"నాకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ ఈ డ్రింకు తాగుతున్నానండి. అప్పట్నుంచి తెలుసు. చిన్నప్పుడు ఇంట్లోవాళ్లు తెమ్మంటే తెచ్చేవాణ్ని. రుచి బావుండేది. తల్లితండ్రులు అలవాటు చేసిందే మనకూ నచ్చుతాది కదా. కూల్ డ్రింక్ తాగాలనిపించినప్పుడు ఆర్టోస్ ఉంటే, అదే తాగుతాను. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన మా అధికారులకూ దీని రుచి చూపిస్తాను. నేను పెద్దయ్యాక తెలిసింది ఇది ఇక్కడే రామచంద్రాపురంలో తయారవుతుందని. అప్పుడు ఇంకా ఆశ్చర్యం, ఆనందం వేసింది" అన్నారు రాజమండ్రికి చెందిన పాపారావు అనేవ్యక్తి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)