కేసీఆర్‌ చాలా మంచివారు, తెలుగువాళ్లు ఎక్కడున్నా కలిసుండాలి’: వైఎస్ జగన్ - ప్రెస్ రివ్యూ

  • 26 జూలై 2019
Image copyright Telangana CMO

తెలంగాణతో తమ రాష్ట్రానికి సఖ్యత అవసరమని, తెలుగువాళ్లు ఎక్కడున్నా కలిసుండాలని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించినట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంచి వారని, మంచి చేయడానికి ముందడుగు వేస్తుంటే హర్షించాల్సింది పోయి వక్రీకరించడం ఎంత వరకు ధర్మమని జగన్ ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల భావితరాల ప్రయోజనాల కోసమే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించాలని తాను, కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

'తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే అవి మన వరకూ వస్తాయా?' అంటూ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలు సహేతుకమైనవేనని, అలాంటి పరిస్థితే లేకపోతే తాము ఈ అడుగు వేయాలని ఎందుకు అనుకుంటామని జగన్ అన్నారు.

''తెలంగాణను దాటుకుని 2,500 టీఎంసీల గోదావరి జలాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. గోదావరి నది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో 120 రోజులు వరదతో పొంగుతుంది. వరద ఉన్న రోజుల్లో రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున 120 రోజుల్లో 450 నుంచి 500 టీఎంసీలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తీసుకెళ్లాలని ఇద్దరు ముఖ్యమంత్రులం నిర్ణయించాం'' అని జగన్ చెప్పారు.

ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోతే భావితరాలపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

జలాశయానికి గోదావరి జలాలు తరలిస్తే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న అక్కసుతోనే ప్రతిపక్ష సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

Image copyright CHANDRABABU/FB

‘కేసీఆర్ రుణం తీర్చుకోవడానికే తెలంగాణకు నీళ్లు’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

ఎన్నికల సమయంలో నిధులిచ్చిన కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు జగన్ ఏపీలోని భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

''తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలపైనే. జగన్‌ చెబుతున్నట్లు నీళ్ల కోసం తెలంగాణపై ఆధారపడితే ఏపీలో భావితరాలు దెబ్బతింటాయి. మన నీళ్ల కోసం ప్రాజెక్టులు తెలంగాణ భూభాగంలో కట్టి వాళ్లకు వాటా ఇవ్వడం సరికాదు'' అని చంద్రబాబు అన్నారు.

గతంలో కేసీఆర్‌ను తిట్టిన జగన్‌, ఇప్పుడు ఆయన్ను పొగుడుతున్నారని.. నీటి వాటాలు, ప్రాజెక్టుల విషయంలో మాటమారుస్తూ ప్రజలను ఏమారుస్తున్నారని ఆరోపించారు.

స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌ తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

''మన నీళ్లు మనం, తెలంగాణ నీళ్లు వారు వాడుకునేలా చూడాలి. ఇది జగన్‌ సొంత విషయం కాదు. ఏపీ ప్రజల హక్కు. మనం వాడుకోగా మిగిలితే తెలంగాణకు ఇస్తే బాగుంటుంది. డబ్బులు ఇచ్చారు కదా అని నీళ్లిస్తామంటే రైతులు చూస్తూ కూర్చోరు'' అని చంద్రబాబు అన్నారు.

తెలంగాణతో సఖ్యత అభినందనీయమేనని, కానీ భవిష్యతులో పరిస్థితి మారితే ఏం చేస్తారని ప్రశ్నించారు. స్వరాష్ట్రంలోనే ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు.

''అసెంబ్లీలో సీఎం, మంత్రుల ప్రవర్తన దారుణంగా ఉంది. అది ప్రజాసమస్యలు చర్చించే వేదిక. మాట్లాడేందుకు మాకు అవకాశమివ్వడం లేదు'' అని చంద్రబాబు అన్నారు.

టీచర్లకు త్వరలో పదోన్నతులు

ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వీలైనంత త్వరలోనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

పాత జిల్లాలు, కొత్త జిల్లాలవారీగా సీనియార్టీ జాబితాలు సిద్ధంచేస్తున్నట్లు సమాచారం. పదోన్నతులను పాత జిల్లాలవారీగా కల్పించాలా.. కొత్త జిల్లాలవారీగా కల్పించాలా అనే అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాలకు కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉందని, ఆ తర్వాత స్థానిక పరిస్థితుల ఆధారంగా పదోన్నతుల అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఏడేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పించడానికి ఏర్పాట్లుచేస్తున్నట్టు చెప్పారు.

దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందే అవకాశం ఉందని కమిషనర్ అభిప్రాయపడ్డారు.

ఆసరా పింఛన్లు, కేసీఆర్ Image copyright Twitter/trspartyonline

అరుగుతున్న వేలి ముద్రలు.. ఆసరా పింఛనుదారులకు కష్టాలు

వేలి ముద్ర రేఖలు అరిగిపోవడంతో తెలంగాణలో దాదాపు 50 వేల మంది ఆసరా పింఛన్లను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈనాడు దినపత్రిక ఓ వార్త రాసింది.

వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లను ప్రభుత్వం 'ఆసరా' పేరుతో అందజేస్తోంది. 46 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.

మట్టిపనులు చేస్తుండటం, వయస్సు మీద పడుతుండటం, బీడీలు చట్టడం వంటి కారణాల వల్ల కొందరికి బొటన వేళ్లలోని రేఖలు అరిగిపోతున్నాయి. బయోమెట్రిక్ పరికరాలు లబ్ధిదారుల వేలి ముద్రలను గుర్తించడం లేదు.

ఫలితంగా పింఛన్లు తీసుకునే సమయంలో వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు దాదాపు 2 లక్షల మంది ఉంటారని గ్రామీణాభివృద్ధి శాఖ కొంతకాలం క్రితం అంచనావేసింది. ఆయా పంచాయతీ కార్యదర్శుల వేలిముద్రలను స్వీకరించి పింఛను అందజేసేలా ఏర్పాట్లు చేసింది.

వేలిముద్రల సమస్య ఉన్నవారిలో 50 వేల మందికి రేఖలు అరిగిపోయాయని, వారికి శాశ్వత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవసరమని ఇటీవల తేల్చింది.

బయోమెట్రిక్‌ పరికరాల స్థానంలో ఐరిస్‌ పరికరాలను ప్రవేశపెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

ఐరిస్‌ పరికరాల ఏర్పాటుపై గ్రామీణాభివృద్ధి శాఖ చాలాకాలంగా తపాలా శాఖ అధికారులతో చర్చిస్తూనే ఉంది.

ఐరిస్‌ పరికరాల ఏర్పాటుకు తపాలా శాఖ అంగీకరించి ప్రస్తుతం సాంకేతికపరమైన అంశాలపై సంబంధిత విభాగాలతో భేటీ అవుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి రావచ్చని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు