స్పీకరు స్థానంలోని మహిళా ఎంపీతో ‘మీ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మట్లాడాలని ఉంద’న్న ఆజంఖాన్

  • 26 జూలై 2019
పార్లమెంట్ ఆజంఖాన్ రమాదేవి Image copyright Getty Images

సమాజ్‌వాది పార్టీ ఎంపీ ఆజంఖాన్ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. గురవారం లోక్ సభలో స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశిస్తూ ''మీ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మట్లాడాలని ఉంది'' అని ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్‌తో సహా అనేక మంది మహిళా ఎంపీలు ఆజంఖాన్ క్షమాపణ చెప్పాలని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, ''నిన్న ఈ సభలో ఏం జరిగిందో దేశమంతా చూసింది. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన బిల్లు ఇదే సభలో పాసైంది. మీరు ఏ ఒక్క మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించవద్దు'' అని పేర్కొన్నారు.

టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి కూడా ఆజంఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Image copyright Getty Images

''నిన్న జరిగిన ఘటనపై పార్టీబేధం లేకుండా అందరూ ఖండించడం స్వాగతించాల్సిన పరిణామం. అందరూ ఒకే గొంతుతో ఈ ఘటనను ఖండించారు'' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

''ఆజంఖాన్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే. లేదంటే ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలి'' అని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఈ ఘటనను ఖండిస్తోందని ఆ పార్టీ నేత రంజన్ చౌదరీ పేర్కొన్నారు. ''మహిళలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. కొన్నిసార్లు సోనియా గాంధీని కూడా ఇటలీ బొమ్మ అంటూ ఇలానే అవమానించారు'' అని ఆయన పేర్కొన్నారు.

సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం ఆజంఖాన్ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు.

''రమాదేవిని ఉద్దేశించి ఆయన అసభ్యంగా మాట్లాడారని నేను అనుకోవడం లేదు'' అని పేర్కొన్నారు.

Image copyright Getty Images

ఈ ఘటన తర్వాత ఆజంఖాన్ పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. ''సభలో నేను అసభ్యంగా మాట్లాడినట్లైతే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా'' అని చెప్పారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ''మహిళలను కించపరుస్తూ ఆజంఖాన్‌ పార్లమెంటులో వాడిన భాష దారుణం. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలను అవమానపరిచేవిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన పార్లమెంటులోనే కాదు, మొత్తం మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలి'' అని ట్వీట్ చేశారు.

రామాదేవి కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

''ఆయన మహిళలను ఎప్పుడూ గౌరవించరు. జయప్రద గురించి ఆయన గతంలో ఎంత అసభ్యంగా మాట్లాడారో మనందరికీ తెలుసు. ఆయనకు లోక్‌సభలో ఉండే అర్హత లేదు. ఆయనను సభ నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరుతా'' అని రమాదేవి పేర్కొన్నారు.

Image copyright Getty Images

గురువారం ఆజంఖాన్ వ్యాఖ్యల అనంతరం సభలో ఉన్న చాలా మంది ఎంపీలు ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

దీంతో స్పందించిన ఆజంఖాన్ ''మీరు చాలా గౌరవనీయులు. నాకు సోదరితో సమానం'' అని రమాదేవిని ఉద్దేశించి చెప్పారు.

ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని పేర్కొన్నారు. ఆజంఖాన్ తరచూగా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారని, సభ నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)