ఫంక్షన్‌లో వచ్చిన చదివింపులతో ఈ రైతు కోటీశ్వరుడయ్యాడు.. ఎంత వచ్చాయంటే.. : ప్రెస్ రివ్యూ

  • 27 జూలై 2019
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడులో ఓ విందు కార్యక్రమానికి వచ్చిన చదివింపులతో ఓ రైతు కోటీశ్వరుడుగా మారినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం రాసింది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే, బంధు మిత్రులు చదివింపుల ద్వారా వారికి ఆర్థిక సాయం చేస్తారు. తమిళనాడులోని పుదుక్కోట జిల్లా కీరామంగళం తాలూకాలోని వడగాడు, పరిసర గ్రామాల్లో ఈ సంప్రదాయం ఉంది.

వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి గురువారం తన బంధుమిత్రులు, గ్రామస్థులకు ఇలాగే విందు ఏర్పాటుచేశారు.

సుమారు 50,000 ఆహ్వాన పత్రికలను ముద్రించి పంచారు. విందు కోసం 1000 కిలోల మేక మాంసాన్ని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆయన రూ.15 లక్షలు ఖర్చుపెట్టారు.

దాదాపు ఐదు వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారు ఇచ్చిన చదివింపుల రూపంలో కృష్ణమూర్తికి ఏకంగా రూ.4 కోట్లు వచ్చాయి.

డబ్బులు లెక్కించేందుకు కౌంటింగ్ మెషిన్స్‌ను, బ్యాంకు ఉద్యోగుల సేవలను ఆయన వినియోగించుకున్నారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Image copyright REVANTHOFFICIAL/FACEBOOK

'టీఆర్‌ఎస్, బీజేపీలది డూప్‌ ఫైటింగ్‌'

బీజేపీ, టీఆర్‌ఎస్‌ డూప్‌ ఫైటింగ్‌ చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

ఆర్టీఐ చట్ట సవరణ, హరితహారం సందర్భంగా పార్లమెంటులో కనిపించిన దృశ్యాలు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల అనుబంధం గురించి చెప్పకనే చెబుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.

పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌, సంతో‌షకుమార్‌ కలిసి హరితహారం మొక్కలను నాటారని, తద్వారా బీజేపీతో కేసీఆర్‌ బంధాన్ని చాటారని ఆరోపించారు.

బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కేసీఆర్‌ చేతులు కలపరని, ఆ పూచీ తనదంటూ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చెప్పిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. ఇప్పుడు ఈ విషయంపై సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

కేసీఆర్‌ నియంతృత్వ పోకడలు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి బీజేపీయే సరైన వేదిక అంటూ ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇప్పుడు ఏ రకంగా ఆయనపై పోరాడతారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

సహారా ప్రావిడెంట్‌ ఫండ్‌ కేసు ఎక్కడివరకు వచ్చిందో, చార్జిషీట్‌లో కేసీఆర్‌ పేరు ఉందో, లేదో కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు.

Image copyright Getty Images

అమలాపురంలో కార్డున్నా.. అమీర్‌పేటలో రేషన్..

తెలుగు రాష్ట్రాల్లోని రేషన్ కార్డుదారులు రెండు రాష్ర్టాల్లో ఎక్కడైనా రేషన్ పొందేందుకు అనుకూల విధానం అమల్లోకి వస్తున్నట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త రాసింది.

'ఒకే దేశం- ఒకే కార్డు' విధానం తెలంగాణలోనే తొలిసారిగా అమల్లోకి వస్తోంది.

ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన పేదలు రేషన్ పొందలేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం పోర్టబిలిటీ విధానాన్ని తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్‌లోగా దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఆగస్టు 1నుంచి ప్రయోగాత్మకంగా నాలుగు రాష్ర్టాల్లో దీన్ని మొదలుపెడుతున్నారు.

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ను ఒక క్లస్టర్‌గా, గుజరాత్-మహారాష్ట్రను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా గురువారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక రేషన్‌షాపులో దేశంలోనే మొదటిసారిగా నిర్వహించిన ట్రయల్ విజయవంతమైంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వర్‌రావు, విశాఖపట్నం జిల్లా యలమంచలికి చెందిన అప్పారావు పంజాగుట్టలోని రేషన్ దుకాణం నుంచి సరుకులు తీసుకున్నారు.

ఆహార భద్రతాచట్టం కింద కేంద్రప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు మాత్రమే ఈ పోర్టబిలిటీ విధానం ద్వారా సరుకులు తీసుకోవచ్చు.

బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలను కేంద్రప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో, నిర్ణయించిన ధరల ప్రకారం, లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. ఒక్కరికి కిలో బియ్యం రూ. 3 చొప్పున ఐదు కిలోలు, గోధుమలు కిలో రూ.2కు పంపిణీ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో 1,26,728 ప్రభుత్వ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

ఏపీ చరిత్రలో తొలిసారిగా ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు విడుదలైనట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

గ్రామ సచివాలయాల్లోని 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్‌ శాఖ, పట్టణ వార్డు సచివాలయాల్లోని 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ శుక్రవారం రాత్రి వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీచేశాయి.

శనివారం ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. gramasachivalayam.ap.gov.in, vsws.ap.gov.in, wardsachivalayam.ap.gov.in అనే మూడు ప్రత్యేక వెబ్‌సైట్లను ఇందుకోసం సిద్ధంచేశారు.

ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు 1వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.

సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏర్పాటుచేసి, ప్రతి సచివాలయంలో పనిచేసేందుకు 10 నుంచి 12 మంది చొప్పున నియమించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటవుతున్నాయి. వీటి కోసం వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్‌ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీచేస్తుంది.

ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది.

9,359 ఎనర్జీ అసిస్టెంట్‌ (లైన్‌మెన్‌) ఉద్యోగాల భర్తీకి కూడా వేరుగా నోటిఫికేషన్‌ రానుంది. విద్యుత్‌ డిస్కంలు దీనిని జారీచేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు 5,573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టులను, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 3,786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులను డిస్కంలు వేరుగా భర్తీచేస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)