జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 77 ఏళ్ళు.
నిమోనియాతో కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన జైపాల్ రెడ్డి చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణంతో భారత పార్లమెంటరీ రాజకీయాల్లో అయిదు దశాబ్దాలుగా మారుమోగిన ఒక తెలుగు గళం మూగబోయినట్లయింది.
తెలంగాణ పల్లె నుంచి దిల్లీ దాకా
సూదిని జైపాల్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు.
18 నెలల వయసులో ఉండగానే పోలియో కారణంగా వైకల్యానికి గురయ్యారు. కానీ, అది ఆయన రాజకీయ జీవన ఆరోహణకు ఎన్నడూ అవరోధం కాలేకపోయింది.
పలు మార్లు కేంద్ర మంత్రిగా, ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగించిన జైపాల్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్ పట్టా తీసుకున్నారు.
ఉస్మానియాలో విద్యార్థి నాయకుడిగా ఉండగానే జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది.
ఫొటో సోర్స్, Getty Images
మన్మోహన్ సింగ్, జైపాల్ రెడ్డి
ఉత్తమ పార్లమెంటేరియన్
కాంగ్రెస్ పార్టీలో చేరి, 1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో మూడు సార్లు కూడా ఇదే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు.
1975లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ జైపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
జనతా పార్టీలో చేరి, 1980లో ఇందిరా గాంధీపై మెదక్ ఎంపీ స్థానంలో పోటీకి దిగారు. అయితే, ఆయనకు విజయం దక్కలేదు.
1984లో జైపాల్ రెడ్డికి పార్లమెంటులో సభ్యుడిగా అడుగుపెట్టే అవకాశం తొలిసారి వచ్చింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు.
1985 నుంచి 1988 వరకు జైపాల్ రెడ్డి జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన జనతా దళ్‌లో చేరారు.
1990, 1996లో రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. 1991 నుంచి 1992 వరకూ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1998లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున మహబూబ్ నగర్ ఎంపీగా రెండో సారి ఎన్నికయ్యారు.
అదే ఏడాది ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి దక్షిణ భారత ఎంపీ ఆయనే.
ఫొటో సోర్స్, ANI
మళ్లీ కాంగ్రెస్‌లోకి..
1999లో జైపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. వరుసగా 1999, 2004ల్లో ఆ పార్టీ తరఫున మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2009లో చేవెళ్ల ఎంపీగా జైపాల్ రెడ్డి గెలుపొందారు.
జైపాల్ రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
ఐకే గుజ్రాల్ నేతృత్వంలో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల్లో జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి పదవులు చేపట్టారు.
కేంద్ర సమాచార ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహా మరికొన్ని శాఖలకు మంత్రిగా పనిచేశారు.
జైపాల్ రెడ్డికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
రాజకీయ వక్తగా చెరగని ముద్ర
భారత రాజకీయాల్లో అధ్యయనం, అవగాహన, వాక్పటిమల మేళవింపుగా రాణించిన అరుదైన రాజకీయవేత్త జైపాల్ రెడ్డి అని సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ కృష్ణారావు అన్నారు. గాంధేయవాద పరంపరకు, సోషలిస్ట్ భావజాలానికి ఆయన దాదాపు చివరి ప్రతినిధి అనుకోవచ్చని చెప్పిన కృష్ణారావు, "సాహిత్యాన్ని, తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి ఆ పునాదుల మీద రాజకీయవాదాన్ని నిర్మించుకున్న రాజకీయ నాయకుడు జైపాల్ రెడ్డి. ఆరిస్టాటిల్ నుంచి మార్క్స్ దాకా ఆయన దేని గురించైనా మాట్లాడేవారు. యునైటెడ్ ఫ్రంట్ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆయనే రూపొందించారు. భారతదేశ ప్రాధాన్యాల గురించిన ఆయన అవగాహన ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆ డాక్యుమెంట్ ఒక్కటి చాలు" అని చెప్పారు.
ఆ స్థాయి కలిగిన నేతలు ఇప్పుడు ఎవరున్నారో వెతకడం కూడా కష్టమేనని ఆయన అన్నారు.
జైపాల్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ జింకా నాగరాజు కూడా, "ఆయన రాజకీయ తత్వవేత్త లేదంటే తాత్విక రాజకీయవేత్త" అని వ్యాఖ్యానించారు.
"పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే, ఆయన ఏ అంశాన్నీ ఉపరితలంగా, ఆరోపణలే ప్రధానంగా చేసుకుని మాట్లాడరని తెలిసిపోతుంది. ప్రతి సమస్యకున్న తాత్విక పునాదులను అర్థం చేసుకుని లోతైన అవగాహనతో మాట్లాడడం ఆయన నైజం. అందుకే, ఆయన స్వరం వినిపిస్తే పార్లమెంటు నిశ్శబ్దంగా చెవులు రిక్కించేంది. లౌకిక స్ఫూర్తికి ఆయన నిఖార్సయిన నిదర్శనం. ఒక ఇంద్రజిత్ గుప్తా, ఒక జైపాల్ రెడ్డి.... ఇలా ఉత్తమ పార్లమెంటేరియన్లు ఒకరొకరే వెళ్ళిపోతుండడం బాధ కలిగిస్తోంది" నాగరాజు ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించారు.
యువతకు ఆదర్శం: ఉపరాష్ట్రపతి
పోలియో బారిన పడ్డా, మొక్కవోని దీక్షతో పనిచేసి జైపాల్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరారని, ఆయన జీవితం యువతకు ఆదర్శమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
జైపాల్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
జైపాల్ రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని వెంకయ్యనాయుడు అందులో పేర్కొన్నారు.
''నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్ళలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మా ఇద్దరిదీ ప్రత్యేకమైన పాత్ర. వ్యక్తి కన్నా ప్రజాస్వామ్య వ్యవస్థకు వారు అధిక ప్రాధాన్యతనిచ్చే వారు. విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసమే ముందుకు సాగింది'' అని వెంకయ్యనాయుడు అన్నారు.
''జైపాల్ రెడ్డి మంచి వక్త. అపారమైన మేధస్సుతో పాటు అందరినీ ఆకట్టుకునే విశ్లేషణలు ఆయన సొంతం. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఆయనుకున్న ప్రావీణ్యం అమోఘమైంది. వారి వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణం, మాట్లాడే విధానం మా ఇద్దరినీ మంచి మిత్రులుగా మార్చింది'' అని వివరించారు.
జైపాల్ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి, వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.
ఫొటో సోర్స్, JAIPALLREDDY/FACEBOOK
ప్రముఖుల సంతాపం
జైపాల్ రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది.
ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సంతాపం తెలియజేసింది.
జైపాల్ రెడ్డి మరణం వార్త బాధ కలిగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఆయన ఓ గొప్ప పార్లమెంటేరియన్ అని, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని ట్విటర్లో వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఓ గొప్ప పుత్రుడిని కోల్పోయిందంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకూ జైపాల్ రెడ్డి మరణం తీరనిలోటు అని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జైపాల్ రెడ్డి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి ఒక శిఖరం వంటి వారని, ఆయన మరణం భారతీయ మేధావి వర్గానికి తీరని లోటు అని బీజేపీ నేత, మాజీ ఎం.పి రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. "సవాళ్ళకే సవాలుగా నిలిచిన వ్యక్తి జైపాల్ రెడ్డి. సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొంటూ ఉన్నతంగా ఎదగాలనే దానికి ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితమే నిదర్శనం. ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపం" అని ఆనందభాస్కర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- హిమ దాస్ గోల్డ్ మెడల్స్ విలువెంత.. మెరిసేదంతా బంగారమేనా
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- 'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్’ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్లకు తలనొప్పి కాకూడదు - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)