డెరెక్ ఓబ్రెయిన్: ‘బాల్యంలో నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా’.. పార్లమెంటులో ప్రసంగం

  • 28 జూలై 2019
డెరెక్ ఓబ్రెయిన్ Image copyright Getty Images

బాల్యంలో తనపై జరిగిన లైంగిక దాడి గురించి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పార్లమెంటులో ప్రసంగించారు.

చాలా మంది మాట్లాడేందుకు వెనుకాడే ఈ అంశం గురించి రాజ్య సభలో ఆయన ప్రసంగించడాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. చిన్నారులపై లైంగిక వేధింపుల సమస్యపై అవగాహన పెంచేందుకు ఇలాంటి చర్యలు దోహదపడతాయని ప్రశంసిస్తున్నారు.

చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో చట్ట సవరణకు సంబంధించి సభలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగానే 58 ఏళ్ల డెరెక్ ఓబ్రెయిన్ బాల్యంలో తాను ఎదుర్కొన్న అనుభవవం గురించి వివరించారు.

Image copyright Getty Images

తాను 13 ఏళ్ల వయసున్నప్పుడు కోల్‌కతాలో ఓ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి తన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓబ్రెయిన్ చెప్పారు.

''టెన్నిస్ ప్రాక్టీస్ పూర్తి చేసుకుని నేను బస్సులో వస్తున్నప్పుడు ఆ ఘటన జరిగింది. అప్పుడు నిక్కర్, టీషర్ట్ వేసుకుని ఉన్నా. ఓ వ్యక్తి నా నిక్కర్‌పై స్ఖలనం చేశాడు. అతడు ఎవరో నాకు తెలియదు'' అని ఓబ్రెయిన్ అన్నారు.

ఆరేడేళ్ల వరకూ తాను ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదని, ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్పానని ఓబ్రెయిన్ వివరించారు.

లైంగిక వేధింపుల కేసుల్లో చట్టప్రకారం బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలి. అయితే బాధితులే కొన్నిసార్లు ముందుకువచ్చి, తాము ఎదుర్కొన్న అనుభవాలను బయటకు వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి.

Image copyright Getty Images

అయితే, ఓ ఎంపీ ఇలా తన అనుభవం గురించి ప్రసంగించడం, పైగా పార్లమెంటు వేదికగా బయటకు వెల్లడించడం మాత్రం బహుశా ఇదే మొదటి సారి అయ్యుండొచ్చు.

ఓబ్రెయిన్ 'ధైర్యాన్ని' మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. టీవీ ఛానెళ్లు, పత్రికల్లోనూ ఓబ్రెయిన్ ప్రసంగం ప్రధాన వార్తల్లో ఒకటిగా మారింది.

ఈ పరిణామాలతో భారత్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల సమస్య మరోసారి చర్చనీయమైంది.

2007లో భారత ప్రభుత్వం ఈ అంశంపై ఓ సర్వే నిర్వహించింది. అందులో పాల్గొన్న చిన్నారుల్లో 53% మంది తాము ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని చెప్పారు.

Image copyright PA

దేశంలో ఏటా వేల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. 2016లో ఉన్న నేర రికార్డుల సమాచారం ప్రకారం దేశంలో ప్రతి 15 నిమిషాలకూ ఓ చిన్నారి లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

అయితే, అసలు ఘటనల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని లైంగిక వేధింపుల సమస్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారు అంటున్నారు. లైంగిక వేధింపులకు గురైనా, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చాలా మంది బాధితులు ఉండిపోతారని చెబుతున్నారు.

2012లో భారత్ పోక్సో చట్టం తెచ్చింది. చిన్నారులపై తీవ్రమైన లైంగికదాడికి పాల్పడేవారికి మరణశిక్ష సహా నేరస్థులకు మరింత కఠినమైన శిక్షలు ప్రతిపాదిస్తూ చేపట్టిన సవరణను బుధవారం రాజ్యసభ ఆమోదించింది.

Image copyright EPA

పెండింగ్‌లో ఉన్న పోక్సో కేసులను త్వరగా పరిష్కరించేందుకు 1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర శిశు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చెప్పారు.

బుధవారం రాజ్యసభలో ఆ చట్టంలోని శిక్షల గురించే సభ్యులు ఎక్కువగా చర్చించారు. మరణ శిక్ష అమలు వల్ల చిన్నారులపై లైంగిక నేరాలు తగ్గుతాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా, దోషులను లైంగిక చర్యలకు పనికి రాకుండా చేయాలని ఒక ఎంపీ అభిప్రాయపడ్డారు.

అయితే, కేవలం శిక్షల మీద దృష్టి పెడితే లక్ష్యం నెరవేరదని ఓబ్రెయిన్ అన్నారు.

''కోర్టులు తమ పని తాము చేస్తాయి. శిక్షలు విధిస్తాయి. కానీ ఇలాంటి నేరాలు జరగకుండా మనం ఎలా నివారిస్తాం?'' అని ఓబ్రెయిన్ ప్రశ్నించారు.

Image copyright Getty Images

లైంగిక నేరాల వ్యతిరేక పోరాటంలో 'గోప్యత' ప్రధానమైన అడ్డుగోడగా ఉంటోందని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారు అంటున్నారు.

తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చిన్నారులు పెద్దగా బయటకు చెప్పరు. బిడియంతోనో, తప్పు తమదేననో భావించి వారు మౌనంగా ఉండిపోతుంటారు. కొన్ని సార్లు వాళ్లు బయటకు చెప్పినా తల్లిదండ్రులు వారిని నమ్మకపోవడమో, ఆ విషయాన్ని దాచిపెట్టడమో చేస్తుంటారు. వేధింపులకు పాల్పడ్డవారు కుటుంబ సభ్యులే అయితే, పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటోంది.

ఓబ్రెయిన్ విషయంలో వేధింపులకు పాల్పడ్డది గుర్తు తెలియని వ్యక్తి.

కానీ, చాలా కేసుల్లో చిన్నారులకు వారికి తెలిసినవారు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి.

Image copyright Getty Images

ఈ విషయం గురించి ఎంత ఎక్కువగా బయటకు మాట్లాడితే అంత మేలని ఓబ్రెయిన్ అన్నారు.

''క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకుల లాంటి ప్రముఖులు ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలి. మనం ఎంత ఎక్కువగా చర్చిస్తే, అంత మంది చిన్నారులను కాపాడిన వాళ్లమవుతాం. సమస్యను పరిష్కరించాలంటే, ముందు సమస్యను గుర్తించాలి'' అని ఓబ్రెయిన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం