'జగన్‌పై విచారణ ఆగదు... ఆంధ్రప్రదేశ్‌లో త్రిపుర ఫార్ములా అమలు చేస్తాం' -బీజేపీ ఏపీ కో-ఇంచార్జ్‌ :ప్రెస్ రివ్యూ

  • 28 జూలై 2019
మోదీ, జగన్ Image copyright YS Jagan Mohan Reddy/FACEBOOK

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సహా ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ తదితరులపై ఉన్న అవినీతి కేసుల్లో విచారణ ఆగదని బీజేపీ ఏపీ కో-ఇంచార్జ్ సునీల్‌ దేవదర్‌ స్పష్టం చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం బీజేపీలో చేరికలకు, అవినీతి కేసులపై విచారణకు ఎటువంటి సంబంధం ఉండబోదని దేవదర్ చెప్పారు. ''చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పటికే కొనసాగుతున్న విచారణలు యథావిధిగా ఉంటాయి'' అన్నారు.

అయితే, పార్టీ అధిష్ఠానం దృష్టి అంతా ఆంధ్రా పైనే పెట్టిందని పేర్కొన్నారు. ''ఆంధ్రాలో పార్టీని అధికారం దిశగా నడిపించడానికి ఏం చేయాలో నాయకత్వానికి పూర్తి అవగాహన ఉంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఇతర పార్టీల బలాన్ని తగ్గించడానికి కొంతమంది సీనియర్లను, ప్రముఖులను బీజేపీలో చేర్చుకోక తప్పదు. ఏపీలో త్రిపుర ఫార్ములా అమలు చేస్తాం. రాష్ట్రంలో కులతత్వం, అవినీతితో కూడిన రాజకీయం పోవాలి'' అని ఆయన చెప్పారు.

''ఇటీవల ఆంధ్రాలో చర్చిలకు పోలీస్‌ భద్రత, పాస్టర్లకు నెలవారీ జీతాల చెల్లింపు వంటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించాం. సెక్యులర్‌ దేశంలో ఒక మతాన్ని ప్రోత్సహించకూడదు. నమ్మి ప్రజలు గద్దెనెక్కిస్తే.. జగన్‌ క్రైస్తవులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు'' అని విమర్శించారు.

''ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ అండగా నిలుస్తుందని అనుకోవడం పొరపాటు. సీఎం జగన్‌ కూడా చంద్రబాబు బాటలోనే వెళ్తున్నారు. అమలు సాధ్యం కాని ప్రత్యేక హోదాను పట్టుకుని వేలాడుతున్నారు. లోక్‌సభలో ఆర్థికమంత్రి, హోంమంత్రి స్పష్టంగా చెప్పినా వైసీపీ ఎంపీలు అదే డిమాండ్‌ చేస్తున్నారు'' అని పేర్కొన్నారు.

కాపులకు 5% రిజర్వేషన్ సాధ్యం కాదు.. 10% కోటా అగ్రవర్ణ పేదలకే: ఏపీ సర్కారు ఉత్తర్వులు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. కేంద్రం చేసిన చట్టం ప్రకారం 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలోనూ అమలు చేయటానికి ఉత్తర్వులు జారీ చేసిందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం, సుప్రీం కోర్టు ఉత్తర్వులు మేరకు కాపులకు 5 శాతం కోటా సాధ్యపడదని ప్రభుత్వం ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.

మరోవైపు అగ్రవర్ణ పేదలకు ధ్రువపత్రాలిచ్చే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించింది. ఈ ఏడాది నుంచే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద పది శాతం రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే. గత తెదేపా ప్రభుత్వం అందులో అయిదు శాతం కాపులకు కేటాయించింది. దీనిపై శాసనసభలో కూడా తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఆ 5 శాతం రిజర్వేషన్లను కూడా అగ్రవర్ణ పేదలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

Image copyright kcr/FACEBOOK

జర్నలిస్టులతో జలభోజనాలు: హెలికాప్టర్లలో తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయం

గోదావరి మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాణధార ప్రాణహిత జలదృశ్యాన్ని మీడియా ప్రతినిధులకు చూపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సన్నాహాలు చేస్తున్నారని.. జలభోజనాలు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళిక సిద్ధంచేశారని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల నుంచి ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, సీనియర్ రిపోర్టర్లు, ముఖ్య ప్రతినిధులను హెలికాప్టర్లు, బస్సుల ద్వారా కాళేశ్వర ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఈ విషయమై శనివారం ప్రగతిభవన్‌లో ప్రజాసంబంధాల అధికారులతో చర్చించారు. ఎడిటర్లు, ఇతర మీడియా ప్రముఖులను మూడు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా, మిగతా ప్రతినిధులను ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

బస్సులో వెళ్లే ప్రతినిధుల పర్యటన రెండు రోజులు, హెలికాప్టర్‌లో వెళ్లే ప్రతినిధుల పర్యటన ఒక రోజు ఉండే అవకాశం ఉన్నది. వాతావరణ పరిస్థితులనుబట్టి నెలాఖరునకానీ, ఆగస్టు తొలివారంలోగానీ ఈ పర్యటన ఉండనున్నదని సమాచారం.

ట్విటర్‌లో హైదరాబాద్ టాప్‌: జీహెచ్‌ఎంసీకి లక్ష దాటిన ఫాలోవర్లు

వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి హైదరాబాద్ నగరవాసులు ట్విట్టర్‌ను ప్రధాన వేదికగా చేసుకుంటున్నారని.. దేశంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న సంస్థల్లో జీహెచ్‌ఎంసీ తొలి స్థానంలో నిలిచిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఈ-ఆఫీస్‌ను అమల్లోకి తెచ్చింది. అలాగే భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, బర్త్‌ సర్టిఫికెట్లనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తోంది.

ఇక ఫిర్యాదుల కోసం 'మైజీహెచ్‌ఎంసీ' యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. ట్విట్టర్‌ అకౌంట్‌ను ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీతో పాటు మేయర్, కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఆయా విభాగాధిపతులకు సైతం ట్విట్టర్‌ ఖాతాలున్నాయి. జీహెచ్‌ఎంసీకి వివిధ మాధ్యమాలతోపాటు ట్విట్టర్‌ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి.

జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నవారు లక్ష మంది కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. తమ ఈ ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ అకౌంట్‌తోపాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మేయర్‌ రామ్మోహన్, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ల ఖాతాలకు కూడా పోస్ట్‌ చేస్తున్నారు.

ఫిర్యాదు ఎప్పుడు పోస్ట్‌ చేసిన తేదీ, సమయంతో సహా తెలుస్తుండటంతో అధికారులు వీలైనంత త్వరగా స్పందించి.. పరిష్కరిస్తున్నారు. దేశంలోని మిగతా నగరాల కంటే జీహెచ్‌ఎంసీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారే ఎక్కువ. నగరంలోని ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చిచూసినా, జీహెచ్‌ఎంసీనే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)