భారతదేశంలోని ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా?

  • 28 జూలై 2019
బాలిక Image copyright Getty Images

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 132 గ్రామాల్లో గత మూడు నెలల్లో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదని గత వారంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ప్రభుత్వం ఈ అంశంపై దర్యాప్తు చేపట్టింది.

ఈ 'ఆడపిల్లలు పుట్టని గ్రామాలు' ఉత్తరకాశి జిల్లాలో ఉన్నాయి. ఆ జిల్లాలో 550 గ్రామాలు, పట్టణాలు ఉంటే.. సుమారు నాలుగు లక్షల మంది జనాభా నివసిస్తున్నారు.

ఈ ప్రాంతం చాలా వరకూ పర్వత భూభాగం. సుదూరంగా మారుమూలల్లో ఉంటుంది. చట్టవ్యతిరేక లింగ నిర్ధారణ, అబార్షన్ల కారణంగా.. లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతున్న ఈ దేశంలో.. ఈ వార్తలు ఆక్రోశం రేకెత్తించాయి.

అయితే.. ఇదంతా పూర్తిగా నిజం కాకపోవచ్చు.

ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్య ఈ 132 గ్రామాల్లో 216 మంది బాలురు పుట్టారని.. ఒక్క బాలిక కూడా జన్మించలేదని ఆ నివేదికలు చెప్తున్నాయి. అయితే.. ఇదే కాలంలో వేరే 129 గ్రామాల్లో 180 మంది బాలికలు పుట్టారని.. ఒక్క బాలుడు కూడా జన్మించలేదని అధికారులు గుర్తించారు. ఇక మరో 166 గ్రామాల్లో ఇదే మూడు నెలల కాలంలో 88 మంది బాలికలు, 78 మంది బాలురు జన్మించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తరకాశిలో ఇంటి పనులు, పొలం పనులు మహిళలే ఎక్కువగా చేస్తారు

మొత్తంగా చూస్తే.. ఏప్రిల్ - జూన్ నెలల మధ్య ఉత్తరకాశి జిల్లాల్లో 961 మంది సజీవంగా జన్మించారు. వారిలో 479 మంది బాలికలు, 468 మంది బాలురు ఉన్నారు. (మిగతా పిల్లు పుట్టిన వెంటనే మరణించి ఉండవచ్చు.) ఈ గణాంకాలు చూస్తే.. జిల్లాలో 1,000 మంది పురుషులకు 1,024 మంది మహిళలుగా ఉన్న మెరుగైన లింగ నిష్పత్తికి అనుగుణంగానే ఉందని అధికారులు అంటున్నారు. జాతీయంగా 1,000 మంది పురుషులకు 933 మంది మహిళలుగా ఉన్న సగటు లింగ నిష్పత్తి కన్నా ఇది అధికం.

జనన గణాంకాల సేకరణ కార్యక్రమాన్ని స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలకు అప్పగించామని.. వారి నుంచి ఆ సమాచారాన్ని సేకరించిన మీడియా.. అందులో బాలికల జననాలు లేవన్న కొన్ని గ్రామాలను మాత్రమే వెలికి తీసి చూపించి ఉండవచ్చునని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

జిల్లాలో గర్భధారణలు, జననాల గణాంకాలను నమోదు చేయటంతో పాటు, కుటుంబ నియంత్రణ, వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాలను అమలుచేసే విధులను సుమారు 600 మంది ఆరోగ్య కార్యకర్తలకు అప్పగించారు.

''ఆడపిల్లలు పుట్టని గ్రామాల గురించిన మీడియా కథనాలు తప్పుగా విశ్లేషించారని నేను అనుకుంటున్నాను. అదీగాక.. ఈ నేపథ్యం గురించి తగినంత అవగాహన కూడా లేదు. ఏదేమైనా ఈ అంశం మీద దర్యాప్తు జరపాలని మేం ఆదేశించాం'' అని జిల్లా సీనియర్ అధికారి అశిష్ చౌహాన్ బీబీసీకి చెప్పారు.

దీంతో మీడియా కథనాల్లో సమాచారాన్ని తనిఖీచేసి, ఏదైనా పొరపాటు జరిగిందేమో తెలుసుకోవటానికి 26 మంది అధికారులు 82 గ్రామాల్లో పర్యటనకు వెళ్లారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తరకాశి జిల్లాలో చాలా గ్రామాలు పర్వత ప్రాంతాల్లో సుదూరంగా ఉంటాయి

ఎక్కడ పొరపాటు జరిగి ఉండవచ్చు?

మీడియా కథనాల్లో సమాచారం తప్పు కావచ్చు లేదా అసంపూర్తిగా ఉండొచ్చు. ఆరోగ్య కార్యకర్తలు పొరపాటు చేసి ఉండే అవకాశమూ ఉంది. కొన్ని గ్రామాలకు బాలుర జననాల సంఖ్యను, మరికొన్ని గ్రామాలకు బాలిక జననాల సంఖ్యను కేటాయించి ఉంటారా?

రెండో విషయం.. ఉత్తరకాశిలో జనాభా తక్కువ. ఒక గ్రామంలో సగటు జనాభా కేవలం 500 మాత్రమే. ఇక మారుమూల ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో జనాభా 100 మంది లోపే ఉంటుంది. అతి చిన్న గ్రామాల్లో సాధారణంగా 10 నుంచి 15 ఇళ్లు మాత్రమే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఇటువంటి గ్రామాల్లో ఏక లింగ జననాల సంఖ్య పెద్ద విషయం కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

''ఇన్ని ఎక్కువ గ్రామాల్లో బాలికల జననాలు లేకపోయినట్లయితే.. జిల్లా మొత్తం లింగ నిష్పత్తిని అది దెబ్బతీసి ఉండేది'' అని చౌహాన్ పేర్కొన్నారు.

అయితే.. ఈ జిల్లాలో బాలికలు, బాలుర మధ్య వివక్ష చూపించిన చరిత్ర లేదని స్థానికులు చెప్తున్నారు. అందుకు మెరుగైన లింగ నిష్పత్తిని ఆధారంగా చూపుతున్నారు. ''బాలికైనా, బాలుడైనా.. ఆ చిన్నారి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే మేం ప్రార్థిస్తాం'' అని రోష్నీ రావత్ అనే స్థానిక మహిళ హిందుస్తాన్ టైమ్స్ వార్తాపత్రికతో పేర్కొన్నారు.

అంతేకాదు.. ఇక్కడ పురుషులకన్నా మహిళలే ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంటారు. పొలాల్లో శ్రమించటం, గడ్డి కోయటం, పాలు పితకటం, వంట చేయటం, ఇంటి పనులు చేయటం వంటివన్నీ మహిళలే చేస్తారు. ఇక పురుషుల్లో మద్యపాన వ్యసనం చాలా అధికంగా ఉంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక భారతదేశంలో స్త్రీ-పురుష లింగ నిష్పత్తిలో అసమతుల్యత ఉంది

ఈ జిల్లాలో గత కొన్నేళ్లుగా బాలికా శిశుహత్యల ఫిర్యాదులేవీ తమకు అందలేదని అధికారులు చెప్పారు. జిల్లాలో రిజిస్టరయిన అల్ట్రాసౌండ్ మెషీన్లు మూడు ఉన్నాయి. అవి మూడూ ప్రభుత్వ క్లినిక్‌లలోనే ఉన్నాయి.

''బాలికల జననాలను నిరోధించటం కోసం అక్రమ గర్భస్రావాలు లేదా పరీక్షలు చేయించేంత భారీ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ లేదు'' అని చౌహాన్ పేర్కొన్నారు.

అయితే.. ఆసక్తికరమైన అంశం ఒకటుంది.

ఏప్రిల్ - జూన్ నెలల మధ్య జరిగిన 961 జననాల్లో 207 జననాలు ఇంటి వద్దే జరిగాయని నమోదైంది. (మిగతా జననాలు ఆస్పత్రుల వంటి సంస్థల్లో జరిగాయి.) వాటిలో 109 మంది బాలురు కాగా.. 93 మంది బాలికలు. ఇది జిల్లా మొత్తానికి సంబంధించిన లింగ నిష్పత్తికి వ్యతిరేకంగా ఉంది.

''ఇది ఓ పజిల్. దీనిపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇలా ఇళ్లలో జననాలు సాధారణంగా అంబులెన్సులు, క్లినిక్‌లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతుంటాయి'' అని జిల్లా సీనియర్ వైద్యాధికారి డాక్టర్ చందన్ సింగ్ రావత్ బీబీసీకి చెప్పారు.

ఉత్తరాఖండ్‌లో ఈ 'బాలికల అదృశ్యం' గురించి మరో వారం రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)