కార్గిల్ యుద్ధం: "భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"

  • 29 జూలై 2019
కార్గిల్ యుద్ధం Image copyright Getty Images

కార్గిల్ యుద్ధంపై భారత్, పాకిస్తాన్ నుంచి అనేక పుస్తకాలు వెలువడ్డాయి. ఈ సంఘర్షణ వెనక తెలియని ఎన్నో వివరాలను కొన్ని పుస్తకాలు బహిర్గతం చేశాయి.

ఇలాంటి పుస్తకాల్లో పాక్ జర్నలిస్టు నసీమ్ జహ్రా రాసిన ''ఫ్రం కార్గిల్ టూ ది కూప్-ఈవెంట్స్ దట్ షుక్ పాకిస్తాన్'' ఒకటి.

కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ, ఈ పుసక్తం గురించి రచయిత నసీమ్ జహ్రాతో చర్చించారు.

కశ్మీర్‌లోని కొన్ని పర్వత శిఖరాలను ఆక్రమించాలన్నది మొదట్లో కార్గిల్ ప్లాన్ అని జహ్రా చెప్పారు. ఇలా ఆక్రమించుకున్న పర్వత ప్రాంతాల పైనుంచి భారత ఆర్మీపై దాడి చేసి శ్రీనగర్, లేహ్ రహదారిని దిగ్భంధం చేయాలని వ్యూహం రచించారని తెలిపారు.

ఈ రహదారి అత్యంత కీలకమైనది. కశ్మీర్‌లో ఉన్న భారత దళాలకు సామగ్రిని అందచేసే ఏకైక మార్గం.

నసీమ్ అభిప్రాయం ప్రకారం ఆ సమయంలో కార్గిల్ దాడిని ప్లాన్ చేసిన పాకిస్తాన్ జనరల్స్ పరిస్థితి మరింత దిగజారిపోతుందని, కశ్మీర్ వివాదంపై చర్చలు జరపడానికి భారత్ ఒత్తిడి చేస్తుందని భావించారు.

పాక్ సైనికులు యుద్ధంలో పోరాడిన విధానం, చూపిన తెగువ ప్రపంచంలోని ఎనిమిదో వింతగా ఆమె అభివర్ణించారు.

Image copyright Pti
చిత్రం శీర్షిక టైగర్ హిల్

''ఆసక్తిరమైన అంశమేంటంటే, కార్గిల్ యుద్ధంపై పాక్ గర్వంగా ఉంటుంది అదే సమయంలో బాధతోనూ ఉంటుంది. గడ్డకట్టే చలిలో అత్యంత ధైర్యంగా 17వేలు, 18 వేల అడుగుల ఎత్తైన పర్వతాలను తమ సైన్యం అధిగమించడం పాక్‌ గర్వంగా భావించింది. కానీ, సైన్యాన్ని అక్కడికి ఎందుకు పంపారనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి?''

''పాక్ దళాలు యుద్ధం మొదట్లో భారత సైన్యానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అసలు ఏం జరుగుతోందో భారత ఆర్మీకి కొన్ని రోజుల వరకు తెలియలేదు. కొన్ని గంటలు లేదా రోజుల్లోనే భారత భూభాగం నుంచి పాక్ సైన్యాన్ని తరిమికొడతామని అక్కడి ఆర్మీ పెద్దలు ప్రకటించారు'' అని నసీమ్ నాటి ఘటనలను వివరించారు.

నసీమ్ జహ్రా కథనం ప్రకారం, పర్వతాలపైన ఉండటం మొదట్లో పాకిస్తాన్ సైన్యానికి ప్రయోజనం కలిగించింది. పైనుంచి వారు భారత జవాన్లపై సులభంగా దాడి చేశారు. కానీ, తర్వాత పరిస్థితి మారింది.

అయితే, నసీమ్ వాదనలపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్ సైనిక అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు.

Image copyright PIB

బోఫోర్స్ శతఘ్నలు, వాయుసేన - భారత్ పైచేయి సాధించింది వీటితోనే

''ఏం జరుగుతోందో భారత ఆర్మీ నెమ్మదిగా తెలుసుకొని అప్రమత్తమైంది. వెంటనే బోఫోర్స్ శతఘ్నులతో రంగంలోకి దిగింది. కానీ, ఇలాంటి ఆపరేషన్లలో అలాంటి పెద్ద ఆయుధాలను ఉపయోగించరు'' అని నసీమ్ తెలిపారు.

''కార్గిల్ ఆపరేషన్‌లో పరిస్థితిని మలుపుతిప్పిన ఒక అంశం భారత్ ఆర్మీ బోఫోర్స్ శతఘ్నులు వాడటం. శ్రీనగర్, లేహ్ రహదారిపై వారు బోఫోర్స్ గన్‌లను అమర్చారు. వాస్తవానికి ఆ రోడ్డునే పాక్ దిగ్బంధించాలనుకుంది. బోఫోర్స్ శతఘ్నులు పర్వత శిఖరాలను చిన్నచిన్న ముక్కలుగా పేల్చివేసినట్లు భారత్, పాక్ అధికారులు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. అంతేకాక, భారత వాయుసేన నిరంతరాయంగా పర్వతాలపై బాంబు దాడులు చేసింది'' అని ఆమె పేర్కొన్నారు.

పాక్ సైన్యం కార్గిల్ కొండల నుంచి దిగుతున్నప్పుడు భారీ ప్రాణనష్టానికి గురైందని నసీమ్ జహ్రా తెలిపారు.

''వారు తిరిగి రావడానికి దారి లేదు. వాహనాలూ లేవు. 16వేల నుంచి 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల మధ్యలో గుంతలు ఉండటం, గడ్డకట్టే చలి, మరోవైపు కాచుకొని ఉన్న భారత ఆర్మీని తప్పించుకొని రావడం కష్టసాధ్యం అయింది. కార్గిల్‌లో భారత ప్రభుత్వం వాయుసేనను సమర్థంగా వినియోగించుకుంది. ఈ యుద్ధం తర్వాతే పాక్ వాయుసేన పాఠాలు నేర్చుకుంది. ఈ యుద్ధంలో ఎంతమంది పాక్ సైనికులు మరణించారనేది సరిగ్గా తెలియదు'' అని ఆమె వెల్లడించారు.

''కొందరు 300 అంటారు. కొందరు రెండు వేలు అంటారు. కానీ, రెండు వేల మంది అసలు కార్గిల్ వైపు వెళ్లి ఉండకపోవచ్చు. నేను సైన్యంతో మాట్లాడినప్పుడు, 1965 యుద్ధంలో కార్గిల్‌ ప్రాంతంలో చనిపోయిన వారికంటే తక్కువ మందే చనిపోయారు అని వారు చెప్పారు'' అని నసీమ్ తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1999లో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ప్రధాని వాజ్‌పేయి కశ్మీర్ సమస్యపై చర్చించారు.

కశ్మీర్, సియాచిన్, కార్గిల్

కార్గిల్ ప్లాన్ చాలా ఏళ్లుగా పాక్ పరిశీలనలో ఉందని, కానీ దానిని 1999లోనే అమలు చేశారని నసీమ్ జహ్రా చెప్పారు.

''ఈ ప్రణాళికను జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ మిలటరీ ఆపరేషన్‌ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని బెనజీర్ భుట్టోకు అందించారు. కానీ, ఆమె దీనిని పట్టించుకోలేదు. జనరల్ జియా ఉల్ హక్ సమయంలోనూ దీనిపై చర్చ జరిగింది'' అని నసీమ్ తెలిపారు.

నసీమ్ జహ్రా కథనం ప్రకారం, కార్గిల్ ఆపరేషన్‌కు కశ్మీర్ సమస్య ప్రధాన కారణం.

''ఈ సమస్య పాక్, ఇండియా మధ్య ఇప్పటికీ సజీవంగానే ఉంది. కొన్నిసార్లు దీనిపై ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. కొన్నిసార్లు ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సంఘర్షణలో కశ్మీరీలు కూడా పాలుపంచుకుంటున్నారు. పుల్వామా, బాలాకోట్ సంఘటనలు ఇంకా కశ్మీరే ప్రధాన సమస్య అని చెబుతున్నాయి.''

కార్గిల్ ప్లాన్ అమలు చేయడానికి పాకిస్తాన్ మిలిటరీకి ప్రేరణ కలిగించే అంశంగా మారిన మరో సమస్యను కూడా ఆమె వివరించారు.

''మరో సమస్య ఏంటంటే, సియాచిన్. ఇరు దేశాలు దీన్ని పరిష్కరించుకోవాల్సింది. కాన్నీ 1984లో భారత్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది'' అని ఆమె గుర్తు చేశారు.

నలగురు జనరల్స్‌ ప్రణాళిక

నలుగురు జనరల్స్ బృందం కార్గిల్ ప్రణాళికను ఆచరణలో పెట్టిందని నసీమ్ జహ్రా చెప్పారు.

ఆమె కథనం ప్రకారం, ఈ నలుగురు జనరల్స్‌లో అప్పటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్, ఫోర్స్ కమాండర్ ఆఫ్ నార్తర్న్ ఏరియా మేజర్ జనరల్ జావేద్ హసన్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్, కమాండర్ 10 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ మహమూద్ అహ్మద్ ఉన్నారు. సైన్యంలోని మిగిలిన అగ్రనాయకత్వానికి ఈ ఆపరేషన్ గురించి తెలియదు.

''నలుగురు జనరల్స్ కూడా నియంత్రణ రేఖ వద్ద పని చేసినవారే. వారికి కశ్మీర్ సమస్యపై మక్కువ ఎక్కువ. పాక్‌లో ప్రజలు, సైనికులకు మధ్య మంచి సమతుల్యం ఉన్నందున వారు తమకు మద్దతు ఇస్తారని జనరల్స్ భావించారు'' అని నసీమ్ తెలిపారు.

అయితే, ఈ నలుగురు జనరల్స్ ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లేకుండా కార్గిల్ ఆపరేషన్ నిర్వహించి ఎన్నికైన ప్రధానమంత్రి మాటలను ఉల్లంఘించారని నసీమ్ జహ్రా అభిప్రాయపడ్డారు.

అభ్యంతరం చెప్పిన జనరల్స్

జహ్రా కథనం ప్రకారం, 1999 మే 16న జనరల్ పర్వేజ్ ముషార్రఫ్... కార్గిల్ గురించి కమాండర్లకు వివరించారు.

''ఆ సమయంలో, మేం (పాకిస్తాన్ సైన్యం) (కార్గిల్‌లో) ఏం చేయాలని పలువురు జనరల్స్ ప్రశ్నలు సంధించారు. ఆ సమయంలో వాతావరణం భిన్నంగా ఉంది. అయితే, కార్గిల్ ఆపరేషన్ ప్రారంభించిన వారు సైన్యం తమ అదుపులో ఉందని, తప్పక గెలుస్తామని భావించారు. పాక్‌ను ఎవరూ కదిలించలేరని ప్రతీకారేచ్ఛతో చెప్పారు. అయినప్పటికీ కొంతమంది జనరల్స్ దీనిని (కార్గిల్ ఆపరేషన్) స్పష్టంగా ప్రశ్నించారు'' అని ఆమె వెల్లడించారు.

Image copyright AFP

కశ్మీర్ ఆక్రమణ

పాక్ ఆర్మీ నియంత్రణ రేఖ దాటిన తర్వాత 1999 మే 17న అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కార్గిల్ ఆపరేషన్‌కు సంబంధించి సమాచారం అందిందని నసీమ్ తెలిపారు.

''పరిస్థితిని అర్ధం చేసుకున్న సర్తాజ్ అజీజ్ (విదేశాంగ మంత్రి).. మన సైన్యానికి చెందిన కొందరు నియంత్రణ రేఖ దాటారని ప్రధానికి వివరించారు. దీనిపై భారత్‌తో మాట్లాడుతున్నామని చెప్పారు'' అని నసీమ్ వివరించారు.

నసీమ్ కథనం ప్రకారం, ఈ ఆపరేషన్‌తో కశ్మీర్ సమస్యను పాక్ సైన్యం పరిష్కరించగలదని నవాజ్ షరీఫ్ నిజంగా నమ్మారు.

''అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఎప్పుడూ ఇండియాకే వత్తాసు పలికే అమెరికా ఈ ఆపరేషన్‌ను ఆమోదించదని సర్తాజ్ అజీజ్ ప్రధాని షరీఫ్‌కు వివరించారు. అయితే, చర్చలు, ఫైల్స్‌ మార్చుకోవడం వల్ల కశ్మీర్ సమస్యను ఎప్పటికీ పరిష్కరించలేమని ఫరీప్, అజీజ్‌తో చెప్పారు'' అని నసీమ్ తెలిపారు.

''కార్గిల్ ప్రణాళిక సూత్రధారుల్లో ఒకరైన జనరల్ అజీజ్ ఖాన్ ప్రధాని షరీఫ్‌తో మాట్లాడుతూ, మహ్మద్ అలీ జిన్నా భారత్ నుంచి విడదీసి పాక్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కశ్మీర్‌ను వేరు చేసే అవకాశం మీకు వచ్చిందని పేర్కొన్నారు'' అని ఆమె వివరించారు.

Image copyright Getty Images

ధ్వంసమైన కశ్మీర్ ప్రణాళిక

కార్గిల్ ప్రణాళికకు ముందు పాక్, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని జహ్రా చెప్పారు.

''వాజ్‌పేయి పాకిస్తాన్‌కు వచ్చారు. ఆయనకు పాక్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఆయన ఇక్కడికొచ్చి మాట్లాడారు. తర్వాత చర్చలు కొనసాగించడానికి రావాలని జనరల్ ముషార్రఫ్ భారత్‌ను అభ్యర్థించారు. పాక్‌తో చర్చల కోసం ఆయన భారత్‌కు వెళ్లారు."

ఈ చర్చల వల్ల కశ్మీర్ సమస్యపై పాక్‌కు మేలు జరిగిందని అంటుంటారు. కానీ, అది తప్పు అని నసీమ్ చెప్పారు.

''వాస్తవం వేరుగా ఉంది. నిజానికి తిరిగి చర్చలు ప్రారంభించడానికి పాక్ ప్రయత్నించడం తప్పుడు చర్య. 1971లో సియాచిన్ విషయంలో ఇండియా ఇలానే చేసింది. కార్గిల్ ప్రణాళికను సరిగ్గా అమలుపర్చకపోవడం చాలా బాధ్యతారాహిత్యం. అది పాక్ ప్రతిష్టను నాశనం చేసింది'' అని ఆమె తెలిపారు.

ఏదిఏమైనప్పటికీ, నష్టాలు, లాభాలు శాశ్వతం కాదని, దేశాలు తమ విధానాలను సమీక్షించుకోడానికి, పునఃపరిశీలించడానికి అవకాశాలుంటాయని నసీమ్ జహ్రా నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)