కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన యడ్యూరప్ప

  • 29 జూలై 2019
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప Image copyright Getty Images
చిత్రం శీర్షిక కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత యడ్యూరప్ప సోమవారం నాడు అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గారు.

కొన్నివారాలుగా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన కర్నాటక రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరింది.

సోమవారం కర్నాటక అసెంబ్లీలో బలపరీక్షలో యడ్యూరప్ప విజయం సాధించారు. 105 మంది బీజేపీ సభ్యులతోపాటు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో బీజేపీ బలం 106కు చేరింది.

225 మంది సభ్యులున్న సభలో 17మందిపై అనర్హత వేటు పడటంతో మొత్తం సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. ప్రస్తుత శాసనసభ కాల వ్యవధి ముగిసేవరకూ వీరిపై అనర్హత కొనసాగుతుందని స్పీకర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

బలపరీక్ష ముగిసిన అనంతరం అసెంబ్లీ స్పీకర్ పదవికి రమేశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సభలో చదివి వినిపించారు.

గతవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఓటమి పాలైన జేడీఎస్-కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ముఖ్యమంత్రి కుమార స్వామి తన పదవికి రాజీనామా చేశారు.

ఆదివారం నాడు స్పీకర్ రమేశ్ కుమార్ 14 మంది ఎమ్మేల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వీరిలో 11మంది కాంగ్రెస్ సభ్యులు కాగా, ముగ్గురు జేడీఎస్ సభ్యులు. దీంతో మొత్తం అనర్హ ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరింది.

ప్రస్తుతం బీజేపీకి 105మంది సభ్యుల బలం ఉండగా, ప్రతిపక్ష కూటమికి 99మంది మద్దతు ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ సంఖ్య 104.

అధికారం శాశ్వతం కాదు: కుమారస్వామి

అంతకు ముందు జరిగిన చర్చలో భాగంగా కుమారస్వామి ప్రసంగించారు.

"నరేంద్రమోదీకైనా, జేపీ నడ్డాకైనా అధికారం శాశ్వతం కాదు. మేం మీ బలాన్ని 105 నుంచి 100 దగ్గరికో, ఇంకా కిందకో తీసుకురావడానికి ప్రయత్నించం. ఇప్పటికైనా మీరు కరవు గురించి ప్రస్తావించారు. దీన్ని ఎదుర్కోవడానికి మీరెలా పనిచేస్తారో చూస్తాం. ప్రజల శ్రేయస్సు కోసం మేం మీకు అవసరమైన సహకారం అందిస్తాం" అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)