అమిత్ షా: యోగి ఆదిత్యనాథ్‌ని యూపీ సీఎం చేస్తామంటే అంతా వద్దన్నారు, కానీ...

  • 29 జూలై 2019
అమిత్ షా యోగీ Image copyright FACEBOOK ADITYANATH

యూపీ సీఎం పదవిని యోగి ఆదిత్యనాథ్‌కు ఎందుకు అప్పగించామో లఖ్‌నవూలో జరుగుతున్న రెండో గ్రౌండ్ బ్రేకింగ్ సెరెమనీ (పెట్టుబడుల సదస్సు)లో ఆదివారం మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా బయటపెట్టారు.

"విధేయత, సామర్ధ్యం ఆధారంగానే పార్టీ, మా నాయకుడు నరేంద్ర మోదీ... యోగి ఆదిత్యనాథ్‌కు ఉత్తర్ ప్రదేశ్ పగ్గాలు అప్పగించారు. యోగి మా అంచనాలను నిజం చేశారు" అని అమిత్ షా అన్నారు.

ఇందిరాగాంధీ ఫౌండేషన్‌లో జరిగిన రెండు రోజుల గ్రౌండ్ బ్రేకింగ్ సెరెమనీని ప్రారంభించడానికి అమిత్ షా లఖ్‌నవూ వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. యోగిని ముఖ్యమంత్రిగా నియమించడాన్ని చాలామంది ప్రశ్నించినా, పార్టీ మాత్రం ఆయనపై నమ్మకం ఉంచిందని తెలిపారు.

"చాలా మంది నాకు ఫోన్ చేశారు. ఎప్పుడూ మంత్రిగా చేయనివాడు, కనీసం మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా ఏ బాధ్యతలు నిర్వహించనివాడు, సన్యాసి, మఠాధిపతి అయిన యోగికి మీరు ఇంత పెద్ద రాష్ట్రం బాధ్యతలు అప్పగించబోతున్నారు అని వారిలో కొందరు అన్నారు. కానీ పార్టీ ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించింది. మా నియామకం సరైనదే అని యోగి నిరూపించారు" అన్నారు.

నిజానికి, గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌ధామ్ మందిర ప్రధాన పూజారిగా ఉన్న యోగిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

Image copyright YOGIADITYANATH.IN

యోగి, యోగ్యత

అయితే, వరసగా గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చిన యోగి ఆదిత్యనాథ్ బీజేపీ స్టార్ ప్రచారకులు కూడా. కానీ ఏ సంస్థలో, ఏ ప్రభుత్వంలోనూ ఆయన ఎప్పుడూ ఎలాంటి బాధ్యతలూ నిర్వహించలేదు. అందుకే ముఖ్యమంత్రి పదవికి ఆయన పేరును ప్రకటించగానే అందరిలో కాస్త కలకలం రేగింది.

2017లో అసెంబ్లీ ఎన్నిక్లలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించకుండానే పోటీ చేసింది. కానీ అప్పట్లో సీఎం పదవికి రేసులో ఉన్నారని భావించిన పేర్లలో యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఆ పదవిలో ఆయన్ను నియమించాలని అంత స్పష్టతతో ఉన్నట్టు అప్పట్లో కనిపించలేదు.

అంతే కాదు, ఒక సమయంలో అప్పటి కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా పేరు కూడా యూపీ ముఖ్యమంత్రి పదవికి దాదాపు ఫైనల్ అయ్యిందనే అనుకున్నారు. కానీ ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రకటించారు. వివాదాలకు తావివ్వకూడదనుకుని పార్టీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను కూడా నియమించింది.

యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ ముఖ్యమంత్రిగా చేయడం వెనుక ఆయన విధేయత, సమర్థతే కారణం అని అమిత్ షా చెబుతున్నా, రాజకీయ నిపుణులు మాత్రం దానికి వేరే కారణాలు ఉన్నాయని అంటున్నారు.

అదానీ కూడా హాజరు

"ఆ మాట చెప్పిన అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్‌ను ఎవరు ముఖ్యమంత్రిగా చేశారనే దానిపై స్పష్టత ఇచ్చారు. ఆయన హావభావాల్లో ఎవరివల్ల యోగి ఈ పదవిలో ఉంటాడు అనే హెచ్చరికలు కూడా ఉన్నాయి" అని సీనియర్ జర్నలిస్ట్ శరద్ ప్రధాన్ చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం లఖ్‌నవూలో నిర్వహించిన గ్రౌండ్ బ్రేకింగ్ సెరెమనీ-2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి గవర్నర్ రామ్ నాయక్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, డాక్టర్ దినేశ్ శర్మ కూడా హాజరయ్యారు.

హోంమంత్రిగా అమిత్ షా 65 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే సుమారు 250 పారిశ్రామిక ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ సదస్సుకు హెచ్‌సీఎల్ ఛైర్మన్ శివనాడార్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సహా చాలా మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పదవీకాలంలో ఇది రెండో గ్రౌండ్ బ్రేకింగ్ సెరెమనీ. ఇంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 60 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)