Man vs Wild: డిస్కవరీ చానల్ షోలో బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ అరణ్యయాత్ర

  • 29 జూలై 2019
ప్రధాని మోదీ, బియర్ గ్రిల్స్ Image copyright DISCOVERY
చిత్రం శీర్షిక ప్రధాని మోదీ, బియర్ గ్రిల్స్

డిస్కవరీ చానల్ వారి 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షో గురించి మీకు తెలుసా? ఈ కార్యక్రమంలో ఈసారి భారత ప్రధాని నరేందర్ మోదీ ప్రముఖ ప్రజెంటర్ బియర్ గ్రిల్స్‌‌తో కలసి సాహసాలు చేయబోతున్నారు.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో షూట్ చేసిన ఈ కార్యక్రమం ఆగస్ట్ 12న రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని 180 దేశాల ప్రేక్షకులు వీక్షించబోతున్నారు.

ఈ షోలో పాల్గొనడం చాలా ఆసక్తికరంగా, ఉత్తేజంగా ఉందని మోదీ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

"నేను ఎన్నో ఏళ్ళు కొండల్లో, అడవుల్లో జీవించాను. రాజకీయాలకు అతీతమైన జీవితం మీద దృష్టి కేంద్రీకరించే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను కోరినప్పుడు నేను నిజంగా ఎంతో సంతోషించాను. ఎంతో ఆసక్తిగా, ఉద్వేగంగా ఈ షోలో పాల్గొనేందుకు అంగీకరించాను" అని మోదీ చెప్పారు.

వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ అంశాల మీద ప్రేక్షకులు దృష్టి సారించేలా చేసే ఈ కార్యక్రమం ఒక సాహస అరణ్యయాత్రలా సాగుతుంది.

ఈ సందర్భంగా మోదీ, షో ప్రజెంటర్ బియర్ గురించి చెబుతూ, ఆయన అలుపెరుగని పరిశోధకుడని కితాబిచ్చారు. స్వచ్ఛమైన, సహజం సౌందర్యంతో తొణికిసలాడే ప్రకృతిని అనుభవంలోకి తెచ్చుకునేందుకు ఆయన నిరంతరం శోధన చేస్తూనే ఉన్నాడని ప్రశంసించారు.

Image copyright DISCOVERY

ఈ కార్యక్రమంలో మోదీ, బియర్స్ అడవిలో నది మీద చిన్న వంతెన కడుతూ కనిపిస్తారు. ఈ ఎపిసోడ్ మీద బియర్స్ గ్రిల్స్ 45 సెకండ్ల ప్రోమోను ట్విటర్‌లో విడుదల చేశారు. ఆ ప్రోమోలో మోదీ బియర్స్ తో కలసి అడవిలో ప్రయాణిస్తూ, తన అనుభూతులు ఆయనతో పంచుకుంటూ కనిపిస్తారు.

"మీరు భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మీకు రక్షణగా ఉండడం నా బాధ్యత" అంటూ బియర్స్ ప్రధాని మోదీ మీద జాకెట్ కప్పుతూ కనిపిస్తారు.

భారతదేశంలోని అటవీ ప్రాంతంలో మోదీతో కలసి సాహసం చేయడం తనకు దక్కిన అరుదైన అవకాశం అన్న బియర్, "ప్రపంచ నాయకుడితో కలసి కార్యక్రమం చిత్రీకరించే అవకాశం రావడం నాకు లభించిన అరుదైన గౌరవం" అని చెప్పారు.

'మ్యాన్ వర్సెస్ వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ' కార్యక్రమం ఒకేసారి అయిదు భాషల్లో - ఇంగ్లిష్, తెలుగు, బెంగాలీ, హిందీ, తమిళం - 12 డిస్కవరీ చానల్స్‌లో ప్రసారమవుతుంది.

సోషల్ మీడియాలో చర్చ

మోదీ తన ట్వీట్‌లో, 'భారతదేశంలో పచ్చని అడవులు, అందమైన పర్వతాలు, నదులు ఉన్నాయి. ఈ కార్యక్రమం చూసినవారు ఈ దేశాన్ని దర్శించాలని కోరుకుంటారు. భారదేశం వచ్చినందుకు బియర్ గ్రిల్స్‌కు ధన్యవాదాలు' అని రాశారు.

ఈ ట్వీట్ మీద నెటిజన్లలో చర్చ మొదలైంది. మోదీ ట్వీట్ మీద స్పందిస్తూ 'దళిత్ కాంగ్రెస్', "ఇప్పుడు ప్రపంచానికి అసలు నిజం ఏమిటో తెలుస్తుంది. పుల్వామా దాడులు జరుగుతున్నప్పుడు, మన సైనికులు దేశం కోసం చనిపోతున్నప్పుడు ప్రధానమంత్రి మోదీ డిస్కవరీ ప్రోగ్రాం షూటింగ్‌లో ఉన్నారు. బియర్ గ్రిల్స్‌తో కలసి అడవుల్లో విహరిస్తున్నారు. ఇది మోదీ సిగ్గు పడాల్సిన విషయం" అని ట్వీట్ చేసింది.

దళిత్ కాంగ్రెస్ అనే ట్విటర్ హ్యాండిల్ ప్రతిపక్షకాంగ్రెస్‌కు చెందినదే. నిజానికి పుల్వామా దాడులు జరిగినప్పుడు ప్రధాని మోదీ జిమ్ కార్బెట్ అడవిలో ఉన్నట్లు కొన్ని ఫోటోలు వెలుగు చూశాయి.

కాంగ్రెస్ పార్టీ 2019 ఫిబ్రవరిలో, "సీఆర్పీఎఫ్ జవాన్ల మీద దాడి తరువాత ప్రధాని మోదీ జిమ్ కార్బెట్‌కు వెళ్ళి ఒక షూటింగ్‌లో పాల్గొన్నారు" అని ప్రకటన చేసింది. అప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, "దాడుల పట్ల మోదీ విచారం కూడా వ్యక్తం చేయకపోగా, జిమ్ కార్బెట్ అడవిలో విహరిస్తూ షూటింగ్‌లో పాల్గొన్నారు. చనిపోయిన సైనికుల మృతదేహాలను దెశ ప్రజలంతా లెక్కగడుతూ విషాదంలో మునిగిపోతే, పీఎం మాత్రం తన పనిలో నిమగ్నమయ్యారు. ఇది నేను చెబుతున్న మాట కాదు. పత్రికలు ఫోటోలతో సహా రాసిన కథనాలే అందుకు నిదర్శనం" అని అన్నారు.

దీని మీద సోషల్ మీడియాలో చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమం షూటింగ్ కనుక పుల్వామా దాడుల సమయంలో జరిగినట్లయితే అది సిగ్గుపడాల్సిన విషయమేనని కొందరు అన్నారు. మరికొందరు ఈ షో రికార్డులు బ్రేక్ చేస్తుందని అన్నారు. ఇంకొందరు సరదా కామెంట్స్ పోస్ట్ చేశారు.

సమీర్ మిశ్రా అనే వ్యక్తి, "దీని తరువాత మోదీ బిగ్‌బాస్ షోలో కనిపిస్తారు" అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం