బీజేపీ ఎంపీ రమాదేవి: ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన శ్రమంతా ఎవరికీ పట్టదా? - అభిప్రాయం

  • 30 జూలై 2019
రమాదేవి Image copyright Getty Images

పార్లమెంటులోని మహిళా సభ్యులందరికీ అభినందనలు.. మహిళల హక్కుల కోసం పోరాడే సంస్థలు, సాధారణ మహిళలు, మీకూనాకూ అందరికీ అభినందనలు.. సమాజ్‌వాది పార్టీ ఎంపీ ఆజంఖాన్ పార్లమెంటులో క్షమాపణలు చెప్పారు.

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న సాటి ఎంపీ రమాదేవిపై అశ్లీల వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ ఆ వెంటనే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఆ సమయంలో సభలో ఉండి.. ఆజంఖాన్ ప్రవర్తనను ఖండించి, వ్యతిరేకించి, నిరసన తెలిపిన మహిళా సభ్యులకు ధన్యవాదాలు. వారి కారణంగానే కనీసం పది సెకండ్ల క్షమాపణ అయినా చెప్పారు ఆజంఖాన్.

లేదంటే ఆయన చేసిన అశ్లీల వ్యాఖ్యలు కేవలం వికటంగా చెలామణీ అయిపోయేవి. ఆ వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. ఆమె అధికారాన్ని చూసి కాదు ఆమె అందం, ముఖం చూసి గౌరవిస్తాను అని చెప్పి నవ్వుతూ వెళ్లిపోయేవాడు.

అంతేకానీ, రాజ్యాంగబద్ధమైన ఆమె పదవి వల్ల ఎలాంటి ఫలితం లేనట్లే. ప్రతిదీ ఆమె ఒక మహిళ అనే అంశానికి పరిమితమైపోతుంది. ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన శ్రమంతా ఎవరికీ పట్టదు.

నేనేమీ జోక్ చేయడం లేదు. ఇదంతా పురుషాహంకారం.. మహిళల విషయంలో పురుషులు హక్కుగా భావించే అమర్యాదకర ప్రవర్తనల ఫలితం.

వాళ్లని కిందకు లాగడానికి.. వారి ప్రగతికి కారణం వారి రూపమని.. మహిళలు కావడం వల్ల ప్రత్యేక ప్రాధాన్యం దక్కించుకుంటారని.. వారి అధికారం వల్ల కాకుండా వారి భౌతిక రూపం వల్ల వారి మాటకు గౌరవం ఉంటుందని.

Image copyright Getty Images

రాజకీయాల్లో ఉన్న మగవారితో ఎవరైనా ఇలా మాట్లాడడాన్ని ఎప్పుడైనా చూశారా?

ప్రధాని పదవిలోనో, హోంమంత్రిగానో, స్పీకరుగానో ఒక పురుషుడు ఉన్నప్పుడు ఎవరైనా ఎంపీ వెళ్లి మీ ముఖమంటే నాకు చాలా ఇష్టం.. మిమ్మల్ని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది అని చెప్పడాన్ని కనీసం ఊహించగలరా?

ఇది చాలా అసహ్యంగా ఉంటుంది.. కానీ, మహిళల విషయంలో ఇలాంటి అసహ్యాన్ని అనుమతిస్తున్నారు.. ఒకసారి కాదు, పదేపదే అనుమతిస్తున్నారు.

కొన్నిసార్లు పార్లమెంటులో.. మరి కొన్నిసార్లు పార్లమెంటు బయట ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. దీనిపై నిరసనలు జరుగుతాయి.. అంతా ఖండిస్తారు.. టీవీ చానళ్లు చర్చలు నిర్వహిస్తాయి... పత్రికల ఎడిటోరియల్ పేజీల్లో వ్యాసాలు రాస్తారు.. కాలక్రమేణా విమర్శలు తగ్గుతాయి. అదృష్టం బాగుంటే ఓ పది సెకన్ల క్షమాపణతో సరిపెడతారు.

ఈ క్షమాపణలు ఎలా ఉంటాయంటే.. ''స్పీకరు స్థానాన్ని సభ్యులెవరూ అలాంటి దృష్టితో చూడరు. అయినా, మీకు అలా అనిపిస్తే క్షమించండి''

అంటే దీనర్థం.. ఆ మహిళ తప్పుగా అర్థం చేసుకుంది కానీ తన తప్పేమీ లేదని.

ఆజంఖాన్ క్షమాపణలు చెప్పిన తరువాత రమాదేవి మాట్లాడడానికి లేచి నిల్చుని.. ''క్షమాపణ కాదు కావాల్సింది. ప్రవర్తనల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు కావాలి'' అన్నారు.

Image copyright Getty Images

కానీ, ఆమె కోరుకున్నట్లు ప్రవర్తనల్లో మార్పు కోసం ప్రయత్నాలేమీ జరగలేదు. ఆజంఖాన్ క్షమాపణలను సభ ఆమోదించింది. చర్యలు తీసుకోవాలన్న రమాదేవి డిమాండును గాలికొదిలేసి అంతా తరువాత బిల్లుపై చర్చలోకి వెళ్లిపోయారు.

మహిళలకు సమాన హక్కుల అసలు ఉద్దేశాన్ని పార్లమెంటు ఈ సందర్భంగా తన చర్యల ద్వారా నిరూపించలేకపోయింది. కారణం.. అంతా ఆయన క్షమాపణ చెబితే చాలు అనుకోవడమే. ఇలాంటి తీరు ఏ ఒక్క పార్టీకో, వ్యక్తికో పరిమితం కాదు.. ఇది అందరికీ రివాజుగా మారిపోయింది.

మహిళల దేహాల గురించి మాట్లాడుకోవడం.. అబ్బాయిలు వేధింపులకు పాల్పడితే దాన్ని పొరపాటుగా నిర్ధారించడం.. మహిళలు చేసే పనులను ప్రదర్శనగా ముద్ర వేయడం.. మహిళల సామర్థ్యాలు, విజయాలను చిన్నవిగా చూస్తూ అవి వారి అందం ద్వారా సాధించుకున్నవని చెప్పడం వంటివన్నీ పదేపదే జరుగుతున్నవే.

ఇలాంటి ప్రవర్తనల పట్ల పురుష రాజకీయ నాయకులకు అంగీకారం ఉంది. ఇలాంటివన్నీ మామూలే అన్నట్లుగా ఆ ప్రవర్తన ఏ స్థాయి నేరం, దానివల్ల ఏమాత్రం నష్టం కలుగుతుంది.. ఏమాత్రం శిక్ష వేస్తే సరిపోతుందనే అంచనాలు వేస్తారు. సాధారణ ప్రజలదీ ఇదే పద్ధతి.

Image copyright Getty Images

ఆడవాళ్లపై ఎలాంటి జోకులేస్తే ఫరవాలేదు. వారి అభివృద్ధిలో వారి అందం పాత్ర ఎంత? ఏ స్థాయి వరకు మహిళలు భరించవచ్చు.. వారు ఎంతవరకు గొంతెత్తి మాట్లాడగలరు.. వారిని అగౌరవపరిచేవారినేం చేయొచ్చు.. అనేది పురుషులే నిర్ణయించేస్తారు.

ఇదంతా ఖండనల రొద, ఆమోదాల నిశ్శబ్దంతో కూడిన రాజకీయం. దీన్ని మహిళలు భరిస్తున్నారు.

కొన్నాళ్లకు ఈ రొదను నిశ్శబ్ధం ఛేదిస్తుంది.. పది సెకన్ల క్షమాపణే అయినా అది రొదలను దాటుకుంటూ వేసిన కొత్త అడుగు అవుతుంది.

అంతేకాదు.. మనం ఎవరికి ఓటు వేయాలా అని నిర్ణయించుకునే క్రమంలో ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకునే రేపటి రోజు వైపు వేసే అడుగు అవుతుంది.

లేదంటే మళ్లీ ఇలాంటిది చోటుచేసుకున్నప్పుడు పార్లమెంటు లోపల క్షమాపణతో సరిపెట్టకుండా చర్యల వరకు వెళ్లేందుకు మార్గమవుతుంది.

అంతేకాదు.. కఠిన చర్యలు కోరే ప్రతి మహిళా ఎంపీ డిమాండు నిర్లక్ష్యానికి గురికాదన్న విశ్వాసం కలుగుతుంది. ఆమెకు మద్దతు దొరుకుతుంది. తీసుకున్న ఆ చర్యలు దృష్టాంతంగా నిలుస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు