కశ్మీర్ లోయలో అదనపు బలగాల మోహరింపు దేనికి సంకేతం

  • 30 జూలై 2019
కశ్మీర్ కలకలం

అసలే అస్థిరతలో కొట్టుమిట్టాడుతున్న కశ్మీర్ లోయలో 10 వేల మంది అదనపు భద్రతా బలగాలను మోహరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ శ్రీనగర్ పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే ఈ ప్రకటన చేయడంతో కశ్మీర్‌లో ఇబ్బందికర వాతావరణం నెలకొంది.

ఆగస్టు 15 వరకూ జరగనున్న అమర్‌నాథ్ యాత్ర కోసం, అదే రోజు స్వతంత్ర దినోత్సవం కూడా ఉండడంతో ఇక్కడ అదనంగా 40 వేల పారామిలిటరీ బలగాలను మోహరించారు.

లోయలో సాధారణంగా ఎంత సంఖ్యలో భద్రతా బలగాలు ఉంటాయో, ప్రస్తుతం దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మానవ హక్కుల సంస్థల అంచనా ప్రకారం సరిహద్దుల దగ్గర ఉన్నవారితో కలిపి ప్రస్తుతం జమ్ము-కశ్మీర్‌లో 7 లక్షల మంది జవాన్లు ఉన్నారు.

కశ్మీర్ లోయలో 15 నుంచి 25 మంది పౌరులకు ఒక జవానును మోహరించినట్లు కనిపిస్తోంది. అధికారులు మాత్రం ఈ గణాంకాలను అతిశయోక్తిగా చెబుతున్నారు.

Image copyright BBC/MOHIT KANDHARI

భారీగా భద్రతా బలగాల మోహరింపు

ఇక్కడ సైనికుల సంఖ్య ఎంతైనా, సైనిక దళాల్లో ఎక్కువ మంది లోయలోనే ఉంటారు.

కశ్మీర్ లోయలో చాలా ఎక్కువ సైన్యం కనిపిస్తోంది. చాలా తక్కువ దూరాల్లోనే జవాన్లు, బంకర్లు, బ్యారికేడ్లు, పోస్టులు కనిపించడం ఇక్కడ ఈ మోహరింపు ఎంత అసాధారణ స్థాయిలో ఉందో చెబుతోంది.


ఆర్టికల్ 35-ఏ అంటే ఏంటి?


సైన్యాన్ని భారీగా మోహరించడం వల్ల ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్న స్థానికుల్లో కోపం, వేర్పాటువాద భావనలు మరింత పెరగవచ్చు.

అదనంగా సైనికులను మోహరించడం వల్ల లోయలో తిరుగుబాటు భావన మరింత పెరుగుతుంది. ఈ తొందరపాటు చర్యల వల్ల కశ్మీరీల మనసులో కేంద్ర ప్రభుత్వంపై ఉన్న సందేహాలు మరింత తీవ్రం అవుతాయి.

ప్రభుత్వం అదనపు భద్రతా దళాలను విమానాల్లో, రోడ్డు మార్గంలో వారి స్థావరాల దగ్గరకు చేర్చింది. వీరిలో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ జవాన్లు ఉన్నారు.

Image copyright BBC/MOHIT KANDHAR

వదంతుల జోరు

సైనికుల మోహరింపుతోపాటు స్థానిక మీడియాలో కొన్ని అస్పష్ట వార్తలు వెలుగు చూశాయి. రెండు విషయాలపై వదంతులు వ్యాపిస్తున్నాయి.

వీటిలో మొదటిది... ప్రభుత్వం జమ్ము-కశ్మీర్ స్థానికుల కోసం నిర్వచించిన ఆర్టికల్ 35-ఏను తొలగించాలని అనుకుంటోందని చెబుతున్నారు.

ఇక రెండోది... ప్రభుత్వ మార్గనిర్దేశాలకు సంబంధించినది. ప్రభుత్వం వివిధ విభాగాల తరఫున విడుదల చేసిన కొన్ని పత్రాల్లో నిత్యావసర వస్తువులను సేకరించాలని సూచించింది. దీంతో సామాన్యుల జీవితాలపై ఈ ప్రభావం సుదీర్ఘంగా ఉండవచ్చని చెబుతున్నారు.

ఈ వదంతులు అదనపు సైన్యాన్ని మోహరించక ముందే వ్యాపించాయి.

Image copyright EPA

ప్రజల మనసుల్లో అశాంతి

కానీ, ఆర్టికల్ 35-ఏ సవరణ, కేంద్రం మార్గనిర్దేశాలు, సైన్యం మోహరింపు గురించి ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి వివరణా రాలేదు.

భద్రతా దళాల మోహరింపు సర్వసాధారణం అని చెబుతున్న కొంతమంది స్థానిక పోలీసులు ఈ సందేహాలను దూరం చేయడానికి ప్రయత్నించారు. అదనపు జవాన్లు దశలవారీగా అంతకు ముందు ఉన్న భద్రతా దళాల స్థానంలోకి వస్తారని చెప్పారు.

అయితే, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కశ్మీర్ లోయలో భారీ దాడి గురించి నిఘా వర్గాలకు సమాచారం అందిందని, అందుకే అదనపు బలగాలను మోహరించారని జాతీయ మీడియా చెబుతోంది.

కానీ ఈ విషయంలో స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వ మౌనంతో ప్రజల్లో అశాంతి పెరుగుతోంది. ఇదే కారణంతో అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర స్పందనలు వస్తున్నాయి.

Image copyright EPA

విరుద్ధ వాదనలు

"లోయలో పరిస్థితి మెరుగుపడుతోంది", "తీవ్రవాదం వెన్ను విరిచాం" అని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ-కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మలిక్ చెబుతున్నారు. కానీ అదనపు భద్రతా బలగాల మోహరింపు ఆ వాదనలను కొట్టిపారేస్తోంది.

అధికారిక గణాంకాలు ఈ వాదన తప్పని చెబుతున్నాయి. 2018లో గత పదేళ్లలో లోయలో అత్యధిక రక్తపాతం జరిగిన ఏడాదిగా నిలిచింది. ఇదే ఏడాదిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక యువకులు ఆయుధం పట్టడం కూడా కనిపించింది.

2017లో వీరి సంఖ్య 135గా ఉంటే, అది 2018లో 201కి పెరిగింది. అధికారులు మాత్రం 2019 మార్చి నుంచి జూన్ వరకూ లోయలో 50 మంది యువకులు తీవ్రవాదం బాట పట్టారని చెబుతున్నారు.

ముఖ్యంగా చనిపోయిన మిలిటెంట్ల సంఖ్య ఆధారంగా తీవ్రవాద వ్యతిరేక ప్రచారంలో ఎంత విజయం సాధించామో ప్రభుత్వం చెబుతుంటుంది.

2019లో మొదటి ఆరు నెలల్లో కశ్మీర్లో పోలీసులు, భద్రతా దళాల వేర్వేరు ఆపరేషన్లలో 126 మంది మిలిటెంట్లు మృతి చెందారు. 2017లో 206, 2018లో 246 మంది చనిపోయారు.

Image copyright Getty Images

ఇద్దరు మిలిటెంట్లకు ఒక జవాను మృతి

ఎంత మంది ఆయుధాలు పడుతున్నారు, అల్-ఖైదా, ఐఎస్ఐఎస్ వైపు ఎంతమంది యువకులు ఆకర్షితులయ్యారు, పౌరులు, భద్రతా దళాలు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనే లెక్కలను ఇందులో చేర్చరు.

జమ్మూ-కశ్మీర్‌లో 2014 నుంచి 2019 వరకూ 963 మంది మిలిటెంట్లు హతమయ్యారని ఇదే నెలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటుకు సమాచారం ఇచ్చారు.

అదే సమయంలో 413 మంది జవాన్లు మృతి చెందారని కూడా ఆయన చెప్పారు. అంటే మిలిటెంట్లు, భద్రతా దళాల మరణాల నిష్పత్తి 2:1గా ఉంది. అంటే ఇద్దరు మిలిటెంట్లకు ఒక భారత జవాను తన ప్రాణాలు కోల్పోయారు. సైనిక వ్యూహాల ప్రకారం దీనిని మంచి గణాంకాలుగా చెప్పలేం.

కశ్మీర్లో సైనిక వ్యూహం ఎందుకు పనిచేయలేదంటే.. కశ్మీర్ ఒక రాజకీయ వివాదం. మిలిటెంట్లను అంతం చేయడానికి రాజకీయ విధానాన్ని పాటించడం లేదు. కశ్మీర్లోని స్థానికులతో రాజకీయ సంప్రదింపుల ప్రయత్నం కూడా చేయలేదు.

Image copyright TWITTER / RAMMADHAVBJP

రాజకీయ అస్థిరత తీసుకొచ్చే ప్రయత్నం

దీనికి విరుద్ధంగా అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ కశ్మీర్‌లో రాజకీయ అస్థిరతను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఇటీవల కశ్మీర్‌లో పర్యటించిన బీజేపీ నేత రాం మాధవ్ ఆర్టికల్ 370ని తొలగిస్తామనే మాట చెప్పారు. కశ్మీర్ రాజకీయ పార్టీలపై ప్రభుత్వం అవినీతి, పన్ను ఎగవేతలు లాంటి ఆరోపణలు చేయడం కనిపిస్తూనే ఉంది. వీటిలో ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి.

తాజా పరిస్థితి లోయలో ఉన్న వారిలో 35-ఏను తొలగిస్తారేమోననే అశాంతి కలిగించవచ్చు. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు పెరిగి, పౌరులకు లభించే స్వేచ్ఛ తగ్గుతుందేమోననే సందేహాలు ఏర్పడవచ్చు.

ఈ ఆందోళనను పట్టించుకోకుండా ప్రభుత్వం మౌనంగా ఉండడం చూస్తుంటే, ఇక్కడ అస్థిరత, భయం పెరగడానికి ఇది ముందే నిర్ణయించిన ప్రణాళిక అని ధ్రువీకరించవచ్చు. రాజకీయ లబ్ధి పొందడానికే ఈ మౌనం కొనసాగిస్తూ ఉండవచ్చని అనిపిస్తోంది.

Image copyright Reuters

ఎంత అయోమయం ఏర్పడితే, అంత తక్కువ ఓటింగ్ జరుగుతుంది. దానివల్ల దక్షిణ కశ్మీర్, ఉత్తర కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో తమకు ప్రయోజనం లభిస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది.

ఆదివారం వచ్చిన తాజా వార్తల ప్రకారం పార్టీ హైకమాండ్ జమ్ము-కశ్మీర్ బీజేపీ ప్రధాన సభ్యులను మంగళవారం దిల్లీ రావాలని ఆదేశించింది.

వీరితో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ సన్నాహాలపై చర్చిస్తుంది.

"అంటే ఏదో వంట వండుతున్నారు, కానీ అదేంటి అనేది మాత్రం తెలీడం లేదు."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)