అజీమ్ ప్రేమ్‌జీ: విప్రో బాధ్యతలు చేపట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నా

  • 31 జూలై 2019
ప్రేమ్ జీ Image copyright Getty Images

ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ ఒకరు. ఇండియన్ బిల్‌గేట్స్‌గా పేరున్న ఆయన.. సంపదను సృష్టించడంలోనే కాదు, దాతృత్వంలోనూ అగ్రభాగాన నిలిచారు.

ఇన్నాళ్లూ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించిన ప్రేమ్‌జీ, దాతృత్వ కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో పదవీ విరమణ చేస్తున్నట్లు గతం నెలలో ప్రకటించారు. జులై 30న ఆయన తన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి రిటైర్ అయ్యారు.

ప్రస్తుతం కంపెనీలో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా, బోర్డు మెంబర్‌గా ఉన్న ప్రేమ్‌జీ కుమారుడు రిషద్‌ ప్రేమ్‌జీ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెంగళూరులోని విప్రో ప్రధాన కార్యాలయం

వంటనూనెల కంపెనీ నుంచి వేల కోట్ల సామ్రాజ్యంగా..

ముంబైలో పుట్టిన ప్రేమ్‌జీ పూర్వీకులది గుజరాత్‌లోని కచ్ తీరప్రాంతం. తండ్రి ఎంహెచ్ హషీం ప్రేమ్‌జీ... వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ సంస్థ యజమాని. ఈ కంపెనీ వంటనూనెలను ఉత్పత్తి చేసేది.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసిన ప్రేమ్‌జీ.. తండ్రి మరణంతో అనుకోని పరిస్థితుల్లో 21 ఏళ్లకే కంపెనీ పగ్గాలు చేపట్టారు.

వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్‌ను విప్రోగా పేరుమార్చి 53 ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నడిపించారు. విప్రోను అనేక రంగాల్లో విస్తరించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉన్న అవకాశాలను ముందుగానే గ్రహించి ఆ రంగంలోనూ అడుగుపెట్టారు. దేశంలోని తొలి ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో దాదాపు 175 దేశాల్లో ఇప్పుడు తన సేవలు అందిస్తోంది. 1,60,000 మంది ఉద్యోగులతో దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.

74 ఏళ్ల ప్రేమ్ జీ అనేక రంగాల్లో కంపెనీని విస్తరించి 53 ఏళ్లుగా విజయవంతంగా నడిపించారు. 22.6 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా విప్రోను తీర్చిదిద్దారని ఫోర్బ్స్ కథనం పేర్కొంది. 2019లో ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల్లో ఆయన 36వ స్థానంలో నిలిచినట్లు ప్రకటించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక దాతృత్వ కార్యక్రమాల కోసం ప్రపంచ కుబేరులు బిల్ గేట్స్, వారెన్ బఫెట్ స్థాపించిన 'గివింగ్ ప్లెడ్జ్' సంస్థతో భాగస్వామి అయిన తొలి భారతీయుడు ప్రేమ్ జీ.

దాతృత్వంలోనూ సంపన్నుడు

ఫోర్బ్స్ పత్రిక ప్రకారం దేశంలో అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ తర్వాత ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉన్నారు. దాతృత్వంలో మాత్రం ఆసియాలోనే ఐదో వ్యక్తిగా నిలిచారు.

2000 సంవత్సరానికి ఏషియా వీక్ మీడియా సంస్థ ప్రేమ్‌జీని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 20 మంది గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా అభివర్ణించింది.

2001లో ఆయన ప్రేమ్‌జీ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. భారత్‌లోని ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరిచేందుకు భారీ విరాళాన్ని ప్రకటించారు.

2019లో దాదాపు 1.45 లక్షల కోట్లను వితరణ కింద ప్రకటించారు. విప్రోలోని 34 శాతం షేర్లను తన స్వచ్చంధ సంస్థ అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు కేటాయించారు.

దాతృత్వ కార్యక్రమాల కోసం ప్రపంచ కుబేరులు బిల్ గేట్స్, వారెన్ బఫెట్ స్థాపించిన 'గివింగ్ ప్లెడ్జ్' సంస్థతో భాగస్వామి అయిన తొలి భారతీయుడు ప్రేమ్‌జీ.

2005లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2011లో పద్మవిభూషణ్ ఆయనను వరించింది.

Image copyright Getty Images

నిరాడంబరంగా ఉండే ధనవంతుడు

దేశంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ప్రేమ్‌జీ చాలా నిరాడంబరంగా జీవిస్తుంటారు.

ఇప్పటికీ తన టయోటా కొరిలా కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్తారు. బెంగళూరులోని విప్రో ప్రధాన కార్యాలయం క్వార్టర్స్‌లోనే నివసిస్తుంటారు. విమానంలో కూడా ఎకానమీ క్లాస్‌లోనే వెళ్తారు.

''సంపదతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి. నువ్వు సంపదను సృష్టించావంటే దానికి ధర్మకర్తగా ఉండటమే'' అని గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ్‌జీ తెలపారు.

‘చైనాతోనే భయం’

చైనాలో కూడా విజయవంతంగా ఐటీ కార్యకలాపాలు చేపట్టిన ప్రేమ్‌జీ భవిష్యత్తులో ఆ దేశంతోనే పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

''చైనీయులు ఇంగ్లిష్ నేర్చుకున్నారంటే ఆ దేశం మనకు వ్యాపారంలో ప్రధాన పోటీదారు అవుతుంది'' అని ఆయన చెప్పారు.

Image copyright Getty Images

''అతని మాటలే పట్టుదల పెంచాయి''

విప్రో బాధ్యతలు చేపట్టడం వెనకున్న కారణాన్ని ఆయన ఒకసారి చెప్పారు.

''అప్పుడు నాకు 21 ఏళ్లు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. నాన్న ఆకస్మిక మరణంతో చదువు పూర్తికాకుండా మధ్యలోనే ఇండియాకు తిరిగి వచ్చేశాను. అప్పుడే కంపెనీ తొలి వార్షిక సమావేశానికి హాజరయ్యాను. ఒక షేర్‌హోల్డర్ నాతో మాట్లాడుతూ, నీ షేర్లన్నీ మాకు అమ్మేయ్, ఎలాంటి అనుభవం లేకుండా ఈ వయసు వాళ్లు కంపెనీని నడపలేరు, ఇదే నీకిచ్చే సలహా అంటూ భయపెట్టాడు. అతని మాటలు నాలో పట్టుదలను పెంచాయి. విప్రోను విజయవంతమైన కంపెనీగా తీర్చిదిద్దడానికి అప్పుడే నిర్ణయం తీసుకునేలా చేశాయి'' అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

''జనాలు నీ లక్ష్యాలను చూసి నవ్వట్లేదంటే... ఆ లక్ష్యాలు చాలా చిన్నవిగా ఉన్నాయి అర్థం'' అని తన ప్రసంగాలలో తరచూ చెప్పే ప్రేమ్‌జీ యువతలో స్ఫూర్తి నింపేందుకు అప్పుడప్పుడూ వర్క్‌షాప్‌లకు కూడా హాజరవుతుంటారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)