ఏపీ రాజధానిలోని పొనుగుపాడు గోడ వివాదం వెనక నిజాలు ఏమిటి? - గ్రౌండ్ రిపోర్ట్

  • 31 జూలై 2019
గోడ వద్ద నిలిచిపోయిన నీరు
చిత్రం శీర్షిక వివాదానికి దారితీసిన గోడ

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గంలో ఓ తగాదా తీవ్ర దుమారం రేపింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో నిర్మించిన గోడ చుట్టూ రాజకీయ వివాదం అలముకుంది.

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గోడ నిర్మించారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించడం, మీడియాలో పతాక శీర్షికలతో కథనాలు రావడం వెరసి వివాదం అసెంబ్లీకి కూడా చేరింది.

దీనిపై ప్రభుత్వ సమాధానం నచ్చని టీడీపీ నేతలు ‘నిజనిర్ధరణ కమిటీ’ ఏర్పాటు చేసి, పొనుగుపాడు వెళ్లేందుకు ప్రయత్నించడం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది.

పొనుగుపాడు గోడ వెనుక వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

ఎప్పుడు కట్టారు?

పొనుగుపాడు గ్రామంలో చర్చి, మసీదుకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో రెండు నెలల క్రితం ఓ గోడ నిర్మించారు. అది కూడా సంపూర్ణంగా లేదు. గ్రామ పంచాయతీ స్థలంలో దీనిని కట్టినట్టు ఓ వర్గం ఆరోపిస్తుండగా, తమకు పట్టా ఇచ్చిన స్థలంలోనే చర్చి కోసం గోడ నిర్మించుకున్నామని మరో వర్గం వాదిస్తోంది.

తొలుత కొందరు నేరుగా అధికారులను ఆశ్రయించినప్పటికీ స్పందన రాలేదు. తర్వాత విషయం విపక్ష నేతల దగ్గరకు చేరింది. గోడ నిర్మాణానికి ఎన్నికల ఫలితాల తర్వాత పూనుకున్నందున ఇది రాజకీయ కారణాలతోనే జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు.

వివాదం ఎందుకు వచ్చింది?

గోడ నిర్మించిన స్థలం వివాదం ఈనాటిది కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పొనుగుపాడు గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌వో) భానుప్రియ బీబీసీతో మాట్లాడుతూ- చాలా కాలంగా స్థల వివాదం నడుస్తోందని, జూన్‌లో తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు.

"పొలాలను కొనుక్కుని, ఇళ్లు కట్టుకున్న ప్రాంతంలో రాకపోకలకు అడ్డంగా గోడ కట్టేశారని ఫిర్యాదులో చెప్పారు. చర్చికి ప్రహరీ కోసం గోడ కట్టుకున్నామని, తమకు గ్రామకంఠం స్థలంపై పట్టా కూడా ఇచ్చారని అవతలి వర్గం చెప్పింది. విషయాన్ని పరిశీలించేందుకు ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలను అడిగినా ఇవ్వలేకపోయారు. సమస్యను పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు తెలియజేశాం" అని ఆమె వివరించారు.

ఈలోగా సమస్య రాజకీయంగా మారిందని, న్యాయస్థానంలో కేసు వేసినట్టు సమాచారం అందిందని, తమకు కోర్ట్ నుంచి నోటీసులు అందలేదని, అయినా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని భానుప్రియ చెప్పారు.

"30 ఏళ్లుగా తిరిగిన దారి ఇది"

ముప్పై ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న దారిలో తమకు అడ్డుకట్ట వేశారని స్థానికుడు గొట్టిపల్లి కోటేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

చిత్రం శీర్షిక గ్రామస్థుడు కోటేశ్వరరావు

"ఎన్నికల ఫలితాల తర్వాత ఈ గోడ కట్టారు. మాకు దారి లేదంటున్నారు. ఇప్పుడు రెండు నెలలుగా మేం చుట్టూ తిరిగి వెళ్తున్నాం. 30 ఏళ్ల క్రితం పొలాలు కొనుక్కుని ఇల్లు నిర్మించుకున్న చోట ఇప్పుడు మాకు అడ్డంకులు అంటే ఎలా, అందుకే కోర్టుకు వెళ్లాం. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం" అని ఆయన చెప్పుకొచ్చారు.

"వర్షపు నీరు నిలిచి, దోమల బెడద పెరిగింది"

గోడ కట్టిన తర్వాత రెండు నెలలుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని గోడను ఆనుకుని ఉన్న ఇంట్లో నివసిస్తున్న దాసరి వెంకటరత్నం తెలిపారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ- "గోడ ఎందుకు కట్టారో తెలియడం లేదు. చాలా కాలంగా అవసరమైనప్పుడు అటూ ఇటూ తిరిగే వాళ్లం. ఇప్పుడు హఠాత్తుగా గోడ కట్టడంతో నీరు నిలిచిపోతోంది. వర్షపు నీరు నిలవ ఉండడంతో దోమల బెడద పెరిగింది. తక్షణం గోడ తొలగించి మా సమస్య తీరుస్తారని చూస్తున్నాం" అన్నారు.

"రాజకీయం చేస్తున్నారు"

చాలా కాలంగా సామరస్యంగా ఉన్న ఊళ్లో రాజకీయ కారణాలతో చిచ్చు పెడుతున్నారని గ్రామస్థుడు వి.రమేష్ ఆరోపించారు.

"గోడ కట్టాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాం. అడ్డుకుంటున్నారు. ఇప్పుడు మొదలుపెట్టాం. దానిని ఎన్నికలతో ముడిపెట్టి ప్రచారం చేయడం విచిత్రంగా ఉంది. పట్టా స్థలంలో చర్చి కోసం కట్టిన గోడ మీద వివాదం చేయడం మంచి పనికాదు. గ్రామంలో కలిసి ఉండాల్సిన ప్రజల మధ్య ప్రతిపక్ష నేతల కారణంగా అపోహలు పెరగడం తప్ప ప్రయోజనం లేదు. చట్టం ప్రకారం పరిష్కారం చూడాలి" అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఆధిపత్యం కోసమేనా?

బీబీసీ పరిశీలన ప్రకారం గోడ నిర్మించిన వీధిలో కేవలం ఎనిమిది కుటుంబాల వారు నివసిస్తున్నారు. వారికి చర్చి, మసీదు మధ్యలో మార్గం అంత సౌకర్యవంతంగా కనిపించడం లేదు. పైగా గడిచిన కొన్నేళ్లుగా దానిని వినియోగిస్తున్నట్టుగా కూడా కనిపించడం లేదు. వారి రాకపోకలకు ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయంగా సిమెంట్ రోడ్డు కూడా ఉంది. అదే సమయంలో- ఈ గోడ చర్చి ప్రహరీలా కూడా కనిపించడం లేదు.

ఇరు వర్గాల మధ్య ఏర్పడిన మనస్పర్థలతో ఆధిపత్యం కోసం ఇలాంటి ప్రయత్నం చేసినట్టుగా అనేక మంది గ్రామస్థులు భావిస్తున్నారు. అధికార యంత్రాంగం తాత్సారం చేయడంతో సమస్య ముదిరినట్టుగా చెబుతున్నారు. రాజకీయ నేతల ప్రమేయం తోడు కావడంతో పొనుగుపాడు ఇప్పుడు పోలీస్ పహారా మధ్య కనిపిస్తోంది.

సామాజిక నేపథ్యాలు కూడా సమస్యకు కారణమైనట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఊళ్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశించగానే అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడింది.

రికార్డుల ఆధారంగా సామరస్యపూర్వక పరిష్కారం అత్యవసరమనే అభిప్రాయం గ్రామస్థుల్లో వ్యక్తమవుతోంది.

రెండు పార్టీలూ కారణమే

గ్రామంలో తగాదా పెద్ద వివాదంగా మారడంలో రెండు ప్రధాన పార్టీల నేతల పాత్ర ఉందని పేరు ప్రస్తావించడానికి అంగీకరించని స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు అభిప్రాయపడ్డారు.

"ఎన్నడూ లేని రీతిలో చిన్న గోడను ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో రచ్చ చేయడం విడ్డూరమనిపించింది. ఇరు వర్గాలను సంయమనపరిచి, సకాలంలో సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. అలా జరగకపోవడంతో గ్రామంలో పరిస్థితి 144 సెక్షన్ విధించే వరకూ వెళ్లింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అలాంటి ప్రయత్నం చేస్తే అందరికీ ప్రయోజనం" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)