‘అమర్‌నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ఉగ్రవాదుల కుట్ర.. యాత్రికులంతా తక్షణం వెనక్కు వెళ్లిపోండి’.. భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల ఆదేశాలు

  • 2 ఆగస్టు 2019
అమర్‌నాథ్ యాత్ర Image copyright Getty Images

పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భారత సైన్యం ప్రకటించింది. అమర్‌నాథ్ యాత్ర మార్గంలో పేలుడు పదార్థాలు లభించాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్ లోయలో ఉన్న యాత్రికులంతా తక్షణం వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు.

‘‘ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించి అందిన తాజా నిఘా సమాచారం మేరకు అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్నారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలోను, అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకుల సురక్షత, భద్రతల నేపథ్యంలోనూ.. లోయలో వారు తమ బసను తక్షణం తగ్గించుకుని, వీలైనంత త్వరగా వెనక్కు వెళ్లిపోయేందుకు అవసరమైన ఏర్పాట్లు తీసుకోవాలని సూచిస్తున్నాం'' అని జమ్మూ, కశ్మీర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి షలీన్ కబ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Image copyright Govt of J&K

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని భారత ఆర్మీ తెలిపింది. యాత్ర మార్గంలో ఒక ల్యాండ్‌మైన్, స్నిపర్ రైఫిల్ లభించాయని వెల్లడించింది.

''గత మూడు, నాలుగు రోజుల్లో నిఘా వర్గాల నుంచి లభించిన నివేదికల మేరకు అమర్‌నాథ్ యాత్రను విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. దీంతో సోదాలను ముమ్మరం చేశాం. ఈ సోదాల్లో మాకు సానుకూల ఫలితాలు వచ్చాయి'' అని చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ చెప్పారు.

భారత ఆర్మీకి లభించిన ల్యాండ్‌మైన్‌పై పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు ఉన్నాయని, అలాగే ఎం 24 ఎ అమెరికన్ స్నిపర్ రైఫిల్‌కు టెలిస్కోపిక్ విధానంలో గురి చూడగల ఏర్పాట్లు ఉన్నాయని ధిల్లాన్ వెల్లడించారు.

గత మూడు రోజులుగా యాత్ర వెళ్లే దారిలో అణువణువూ గాలిస్తున్నట్లు ఆయన వివరించారు.

Image copyright BILAL BAHADUR/BBC

జమ్మూ, కశ్మీర్‌లో సాయుధ బలగాల మొహరింపును పెంచిన నేపథ్యంలో ఆర్మీ, పోలీసు అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.

''పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు మా సోదాల్లో తేలింది, ఈ మేరకు పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం'' అని ధిల్లాన్ చెప్పారు.

ఐఈడీలు, క్రూడ్ బాంబుల రూపంలో కూడా పెను ముప్పు పొంచి ఉందని, వాటిని కూడా ఈ సోదాల్లో రికవరీ చేశామని తెలిపారు.

''ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. శాంతిని భగ్నం చేయాలని పాకిస్తాన్ సైన్యం ఎదురు చూస్తోంది. కానీ, వారు కోరుకున్నదేమీ జరగదు. శాంతిని భగ్నం చేసేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వం'' అని ఆయన తెలిపారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో భద్రతా బలగాలను భారీగా మొహరిస్తున్నారు. ఈ మేరకు పారా మిలటరీ సిబ్బందిని విమానాలు, హెలీకాఫ్టర్లలో తరలిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై అనామానాలు కలుగుతున్నాయి.

అదనంగా 100 కంపెనీల (10 వేల మంది) భద్రతా బలగాలను గత వారం రోజులుగా రాష్ట్రంలోకి దించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఈ బలగాల మొహరింపు ఇంకా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)