కశ్మీర్ లోయ ఉద్రిక్తం: భారతదేశం క్లస్టర్ బాంబు ప్రయోగించిందన్న ఆరోపించిన పాకిస్తాన్

  • 3 ఆగస్టు 2019
ప్రతీకాత్మక చిత్రం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

కశ్మీర్‌కు వచ్చిన పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్రికులు వీలైనంత త్వరగా వెనక్కివెళ్లిపోవాలన్న ప్రభుత్వ ఆదేశంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అమర్‌నాథ్ యాత్రకు మిలిటెంట్‌ల నుంచి ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు అందించిన సమాచారం, కశ్మీర్‌ లోయలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సూచన చేస్తన్నట్లు ప్రభుత్వం ఆ ఆదేశంలో పేర్కొంది.

ఇదిలా ఉంటే, భారతదేశం నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడిందని, కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని, 11 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆరోపించింది. భారత సైన్యం క్లస్టర్ బాంబులు ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీలు ట్వీట్ చేశారు.

అయితే, పాకిస్తాన్ చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలని భారత సైన్యం ప్రకటించింది. సైనిక లక్ష్యాలు, పాకిస్తాన్ సైన్యం ప్రోద్బలంతో చొరబాట్లకు పాల్పడే తీవ్రవాదుల మీద మాత్రమే భారత్ ఆ విధంగా స్పందిస్తుంది. పాకిస్తాన్ అసత్య ఆరోపణలతో మరోసారి వంచనకు పాల్పడుతోందని భారత సైన్యం ట్వీట్ చేసింది.

నియంత్రణ రేఖకు అయిదు కిలోమీటర్ల లోపున ఉండే డిఫెన్స్ కమిటీలకు ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని పాకిస్తాన్ నియంత్రిత కశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగింది.

ఖురేషీ మరో ట్వీట్ చేస్తూ, భారతదేశం కశ్మీర్ లోయలో శాంతికి విఘాతం కలిగిస్తోందని, అంతేకాకుండా నియంత్రణ రేఖ వద్ద సైనిక ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు.

భారత సైన్యం మాత్రం పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది. చొరబాటుదారులకు ఆయుధాలను సరఫరా చేస్తూ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించింది.

Image copyright Getty Images

క్లస్టర్ బాంబ్ అంటే..

జెనీవా ఒప్పందం ప్రకారం క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. కానీ, చాలా దేశాల్లో యుద్ధాల్లో, సాయుధ ఘర్షణల్లో వీటి వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.

క్లస్టర్ బాంబును చాలా ప్రమాదకారిగా భావిస్తుంటారు. ఇందులోని ప్రధాన బాంబు నుంచి అనేక చిన్న చిన్న విస్ఫోటకాలు వెలువడతాయి. వీటి వల్ల లక్ష్యానికి చుట్టపక్కలా ప్రమాదం కలుగుతుంది. కొన్ని విస్ఫోటకాలు ప్రయోగించిన చాలా సమయం తర్వాత పేలుతుంటాయి. ఫలితంగా సామాన్య పౌరులు కూడా గాయపడుతుంటారు.

క్లస్టర్ బాంబులను యుధ్ద విమానాల నుంచి ప్రయోగిస్తారు. శత్రు సైనికులను చంపేందుకు, వారి వాహనాలను దెబ్బతీసేందుకు వీటిని వినియోగిస్తుంటారు.

‘పర్యాటకంపై ప్రతికూల ప్రభావం’

ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పర్యాటకులంతా హోటళ్లు ఖాళీ చేసి, తమ తమ ప్రాంతాలకు తిరుగుప్రయాణమవుతున్నారు.

స్థానికులు నిత్యావసర వస్తువులను కొనేసి పెట్టుకుంటున్నారు. ఏటీఎంలు, పెట్రోల్ స్టేషన్ల వద్ద జనాలు బారులు తీరి కనిపిస్తున్నారు.

బెల్జియం నుంచి వచ్చిన వెనోటిన్ అనే మహిళ ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాను వచ్చిన రోజే ప్రభుత్వం వెనక్కివెళ్లాలన్న ఆదేశం జారీ చేసిందని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

''ఆ ఆదేశాన్ని మొదట ఇంటర్నెట్‌లో చూశా. అమర్‌నాథ్‌కు వచ్చిన హిందూ యాత్రికులకే వర్తిస్తుంది కావొచ్చు అనుకున్నా. కానీ అందరినీ పంపించేస్తున్నారు'' అని ఆమె అన్నారు.

ఇలాంటి పరిస్థితుల వల్ల కశ్మీర్ పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, స్థానికులు నష్టపోతారని కూడా వెనోటిన్ అభిప్రాయపడ్డారు.

కశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానిది చాలా ముఖ్యమైన పాత్ర.

కానీ రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న అనిశ్చితి కారణంగా సందర్శకుల తాకిడి క్రమక్రమంగా పడిపోతోంది.

2018లో కశ్మీర్‌కు 8 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. గత ఏడేళ్లలో ఇదే అత్యల్పం. 2017లో పోలిస్తే సందర్శకుల తాకిడి 20 శాతం పడిపోయింది.

‘ఒక్కసారిగా కల్లోలం‘

అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశంతో ఒక్కసారి కల్లోలం రేగిందని శ్రీనగర్‌లో ఓ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న ఆజాద్ బేగ్ అన్నారు.

''మాకు ఇది పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్. లాభసాటిగా ఉంటుందనుకున్నా. ఇప్పుడు అంతా చీకటిమయం అయిపోయింది. గుల్‌మార్గ్, సోన్‌మార్గ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులు హోటళ్లు ఖాళీ చేసి, వారి వారి రాష్ట్రాలకు వెళ్తున్నారు'' అని ఆయన వాపోయారు.

గతవారం నుంచి సైన్యం మోహరింపు భారీగా పెరగడంతో కశ్మీర్ అంతటా భయాలు అలుముకున్నాయి. దాదాపు 25,000 మంది అదనపు బలగాలను కశ్మీర్ లోయకు రప్పించారు. దీంతో, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఆర్టికల్ 35-ఏను రద్దు చేయబోతోందనే వదంతులు వ్యాపించాయి. అంతేకాకుండా, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తారని, జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి లదాఖ్, కశ్మీర్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాల నుంచి ఆగస్ట్ 15 వరకు బయలుదేరే అన్ని విమానాలను రీషెడ్యూల్ చేశారు. ప్రయాణికులకు టికెట్లను ఉచితంగా క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించారు.

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, షా ఫైజల్, సజ్జద్ లోనె, ఇమ్రాన్ అన్సారీ వంటి కశ్మీర్ రాజకీయ నేతలందరూ శుక్రవారం నాడు జమ్మూకశ్మీర్ గవర్నర్‌తో సమావేశమై లోయలో నెలకొన్న ఆందోళనల గురించి చర్చించారు. "వదంతులను నమ్మవద్దు. ఆందోళన చెందకండి" అని గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆ నేతల బృందానికి చెప్పారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు