కశ్మీర్: ఆర్టికల్ 370 రూపొందించిన గోపాలస్వామి అయ్యంగార్ ఎవరు? కశ్మీర్ ప్రధానమంత్రి ఎలా అయ్యారు?

  • 9 ఆగస్టు 2019
గోపాలస్వామి అయ్యంగార్ Image copyright Government of India

జమ్మూ-కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి గోపాలస్వామి అయ్యంగార్. ఆయన కశ్మీర్ ప్రధానమంత్రిగా పనిచేశారు.

ఈ ఆర్టికల్‌ను రచించడానికి అంబేడ్కర్ నిరాకరించడంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ.. ఈ బాధ్యతను గోపాలస్వామి అయ్యంగార్‌కు ఇచ్చారని ఇండియా టుడే ఒక కథనంలో పేర్కొంది.

కశ్మీర్ ప్రధాన మంత్రిగా..

భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కశ్మీర్ డోగ్రా వంశీయుల పాలనలో ఉంది. ఈ వంశానికే చెందిన రాజా హరి సింగ్ అప్పుడు కశ్మీర్ మహారాజు.

బ్రిటన్ నుంచి ఒత్తిడి కారణంగా కశ్మీర్‌కు ప్రధానమంత్రిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రధానిని సదర్ ఎ రియాసత్ అని పిలిచేవారు.

1927లో ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్, కలకత్తాకు చెందిన సర్ అల్బియాన్ బెనర్జీ కశ్మీర్ రాజ్యానికి తొలి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రధానిగా పనిచేశారు.

ఈ ప్రధాని పదవి అధికారాలు.. రాజ్యంలో దివాన్, రాష్ట్రంలో గవర్నర్ అధికారాలతో సమానంగా ఉండేవి. అంటే.. చాలా కార్యనిర్వాహక నిర్ణయాల్లో ప్రధానికి పెద్దగా ప్రమేయం ఉండేది కాదు. పైగా ప్రధాని అధికారాలు, బాధ్యతలు కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉండేవి.

దీంతో.. ‘‘కశ్మీర్ ప్రజల అవసరాలు, ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు’’ అంటూ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలోనే గోపాలస్వామి అయ్యంగార్ 1937లో కశ్మీర్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. 1943 వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగారు.

Image copyright KEYSTONE-FRANCE

కేంద్ర మంత్రి, రాజ్యాంగ రచన కమిటీ సభ్యుడిగా..

1946లో స్వంతంత్ర భారత తొలి మంత్రివర్గంలోనూ ఆయన పనిచేశారు. పోర్టుఫోలియో లేని మంత్రిగా ఒక ఏడాదిపాటు ఉన్నారు. అప్పుడు భారత్ తరఫున కశ్మీర్ వ్యవహారాలను చూసుకునేవారు.

అదే సమయంలో రాజ్యాంగ అసెంబ్లీలో భాగమయ్యారు. 1947 ఆగస్టు 29వ తేదీన బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల భారత రాజ్యాంగ రచన కమిటీలో చేరారు.

1948 నుంచి 1952 వరకు రైల్వే, రవాణా శాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్‌లో పనిచేశారు.

ఇంతకీ ఎవరీయన?

మద్రాసు ప్రెసిడెన్సీలోని తంజావూరు జిల్లాలో 1882 మార్చి 31వ తేదీన గోపాలస్వామి అయ్యంగార్ జన్మించారు. ప్రెసిడెన్సీ కాలేజీ, మద్రాస్ లా కాలేజీల్లో చదువుకున్నారు. భార్యపేరు కోమలం. గోపాలస్వామి కొడుకు జి పార్థసారథి జర్నలిస్టు.

గోపాలస్వామి అయ్యంగార్ 1904వ సంవత్సరంలో కొద్దికాలం పాటు చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

1905లో మద్రాస్ సివిల్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. 1919 వరకు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. 1920లో జిల్లా కలెక్టర్ అయ్యారు.

1932లో పబ్లిక్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శిగా ప్రమోషన్ పొందారు. 1937లో రెవెన్యూ బోర్డు సభ్యుడిగా పనిచేశారు.

Image copyright UNO
చిత్రం శీర్షిక ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధిగా ఉన్న పద్మనాభ పిళ్లైతో గోపాలస్వామి అయ్యంగార్ (కుడివైపు)

ఆర్టికల్ 370లో పాత్ర..

ప్రధానమంత్రి బాధ్యతలు ముగిసిన తర్వాత కూడా గోపాలస్వామి అయ్యంగార్ కశ్మీర్ తరపున పనిచేశారు.

కశ్మీర్ భారతదేశంలో విలీనం అయిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కశ్మీర్ వ్యవహారాలను కూడా చూసుకునేవారు. అయితే, పరోక్షంగా ఈ అధికారాలను ఆయన గోపాలస్వామికి అప్పగించారు. ఈ కారణంగానే గోపాలస్వామి నెహ్రూ మంత్రివర్గంలో పోర్ట్‌ఫోలియో లేని మంత్రి అయ్యారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేలా ఆర్టికల్ 370ని రూపొందించినప్పుడు.. ఈ అధికరణను రాజ్యాంగ అసెంబ్లీలో ఆమోదించుకు వచ్చే బాధ్యతను గోపాలస్వామికి అప్పగించారు.

అయితే, నెహ్రూ తీసుకున్న ఈ నిర్ణయం అప్పటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నచ్చలేదు. దీనిపై నెహ్రూను ఆయన ప్రశ్నించారు.

నెహ్రూ సమాధానం ఇస్తూ.. ‘‘కశ్మీర్ విషయంలో గోపాలస్వామికి ఉన్న అనుభవం, పరిజ్ఞానం కారణంగా.. కశ్మీర్ వ్యవహారాల్లో సహకారం చేయాలని ఆయన్ను అడిగాం. కాబట్టి ఆయనకు ఆమేరకు గౌరవం ఇవ్వాలి. ఇందులో హోం శాఖ ఎందుకు జోక్యం చేసుకుంటోందో నాకు అర్థం కావట్లేదు. మేం తీసుకునే చర్యలను హోం శాఖకు తెలియజేయాలి.. హోం శాఖ పాత్ర అంతే. నా ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి నా బాధ్యతలను నేను వదులుకోవాలనుకోవటం లేదు. ఆయన మన సహచరుడు, ఆయనతో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు’’ అని చెప్పారు.

గోపాలస్వామిపై నెహ్రూకు ఉన్న నమ్మకాన్ని ఈ సమాధానం తెలియజేస్తోంది.

Image copyright Getty Images

ఐక్యరాజ్య సమితిలో భారత బృందానికి నేతృత్వం

తదనంతర కాలంలో కశ్మీర్ వివాదంలో ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి బృందానికి గోపాలస్వామి ప్రాతినిధ్యం వహించారు.

కశ్మీర్ ప్రజలను రక్షించేందుకే భారత సైన్యం లోయలోకి ప్రవేశించిందని, అక్కడ శాంతి నెలకొనగానే రిఫరెండం జరుగుతుందని ఆయన ఐక్యరాజ్య సమితికి తెలిపారు.

ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రతినిధి జఫరుల్లా ఖాన్‌కు, గోపాలస్వామి అయ్యంగార్‌కు మధ్య మాటల యుద్ధం నడిచింది.

‘‘పాకిస్తాన్ వైపు నుంచి కశ్మీర్‌పై దండెత్తిన గిరిజనులు తమంతట తాముగా రాలేదు. వారి చేతుల్లో పాకిస్తాన్ సైన్యం ఆయుధాలు ఉన్నాయి’’ అని గోపాలస్వామి వాదించారు.

1953 ఫిబ్రవరిలో గోపాలస్వామి చెన్నైలో మృతి చెందారు. అప్పుడు ఆయన వయసు 71 సంవత్సరాలు.

గోపాలస్వామి మృతిపై నెహ్రూ పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘‘గోపాలస్వామి జమ్మూ కశ్మీర్ ప్రధానమంత్రిగా ఐదారేళ్లు పనిచేశారు. అవి చాలా కఠినమైన రోజులు. ఆ సమయంలో కశ్మీర్ లోయలో యుద్ధం జరుగుతోంది’’ అన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ఉప్పల‌పాడు వలస పక్షుల కేంద్రం: ఖండాలు దాటి రకరకాల పక్షులు ఇక్కడికే ఎందుకు వస్తాయి...

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీకి మరో ఎదురుదెబ్బ

'ఏడేళ్ల వయసులో జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్లకు ఎందుకు చెప్పానంటే...'

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు? మరణ శిక్ష విధించారా...

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు