కశ్మీరీ పండితులు: ‘ఏదో భూకంపం వచ్చిన్నట్టు రాత్రికి రాత్రే అన్నీ వదిలేసి పారిపోయాం’

  • 6 ఆగస్టు 2019
కశ్మీరీ పండితులు Image copyright EPA

ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడున్నాయి. గ్యాస్ స్టవ్‌ మీద వంట గిన్నెలు, సింకులో పాత్రలు, తాడుపైన బట్టలు అలానే ఉన్నాయి. కానీ, ఏదో భూకంపం వచ్చినట్లు అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి తలుపులు కూడా వేయకుండానే ఇంటి నుంచి బయటకు పరుగెత్తాల్సి వచ్చింది. చుట్టుపక్కల అందరి ఇళ్లలోనూ ఇదే పరిస్థితి.

ప్రకృతి విపత్తు రాలేదన్న మాటే కానీ, అక్కడ ఉద్రిక్తత మాత్రం అదే స్థాయిలో ఉంది. 29 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది.

1990 జనవరి 19న శ్రీనగర్‌లోని రేనావాడీ ప్రాంతంలో ఉండే వేలాది కశ్మీరీ పండితులు రాత్రికి రాత్రి సర్వస్వాన్నీ వదిలేసి కశ్మీర్ లోయ నుంచి పారిపోవాల్సి వచ్చింది.

వందల ఏళ్లుగా అక్కడ హిందువులకు ముస్లింలకు మధ్య నెలకొన్న మత సామరస్యానికి ఆ సమయంలో తెరపడింది. ముస్లిం మిలిటెంట్ గ్రూపులు హిందువులనే లక్ష్యంగా చేసుకున్నాయి. సాయుధులైన ముస్లిం మిలిటెంట్ గ్రూప్ సభ్యులు.. హిందువుల ఇళ్లను తగలబెట్టారు. వాళ్ల ప్రాణాలు తీశారు. వాళ్ల ఆలయాలను ధ్వంసం చేశారు.

అది జరిగిన ఏడాది తరువాత నేనక్కిడికి రిపోర్టింగ్ చేయడానికి వెళ్లా. అప్పటికి కూడా ఆ ఇళ్లలో సామాన్లు అలానే చిందరవందరగా ఉన్నాయి. నిజానికి కొన్నేళ్ల పాటు అక్కడ పరిస్థితి అలానే కొనసాగింది.

రాహుల్ పండిత అనే రచయిత వయసు అప్పుడు 14 ఏళ్లు. వాళ్లింటి బయట పరిస్థితి అస్సలు బాలేదు. మసీదుల్లో వాళ్ల కుటుంబాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 'స్వేచ్ఛ కోసం చేసే పోరాటంలో మీరూ భాగం అవ్వండి లేదా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి' అని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు.

అప్పటికే కశ్మీరీ పండితులు హింస, హత్యలు, మిలిటెంట్ దాడుల మధ్య జీవిస్తున్నారు. వారికి పూర్తిగా రక్షణ కల్పించే స్థాయిలో భద్రతా బలగాలు లేవు.

Image copyright Majid Jahangir

నెమ్మదిగా పరిస్థితులు అవే సర్దుకుంటాయనే ఆశతో రాహుల్ పండిత కుటుంబం మూడు నెలల పాటు అక్కడే గడిపింది. కానీ, చివరికి వాళ్లు అన్నీ వదిలి వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది.

'1990 ఏప్రిల్ 3.. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఎక్కడ మమ్మల్ని గుర్తించి దాడి చేస్తారోనన్న భయంతో మేం ఇంట్లో లైట్లు కూడా వేసుకోలేదు. అంతకుముందు దాకా మాతో క్రికెట్ ఆడిన కొందరు ముస్లిం కుర్రాళ్లు మా ఇంటి బయట కూర్చొని, ఖాళీ అయిన కశ్మీరీ పండితుల ఇళ్లను తమలో తాము ఎలా పంచుకోవాలో చర్చించుకుంటున్నారు.

మా ఆడవాళ్ల గురించి కూడా వాళ్లు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయి' అని రాహుల్ గుర్తుచేసుకున్నారు.

ఇక కశ్మీర్‌లో బతకడం అసాధ్యమని అదే రాత్రి రాహుల్ తండ్రి నిశ్చయించుకున్నారు. మరుసటి రోజే ఓ ట్యాక్సీ మాట్లాడుకొని కుటుంబమంతా కశ్మీర్ వదిలి జమ్మూ వెళ్లిపోయింది.

జమ్మూ వెళ్లిన మొదట్లో వాళ్లు నిత్యం భయం గుప్పిట జీవించాల్సి వచ్చింది. 'ఇల్లూ, సామాన్లు అన్నీ వదిలేసి వచ్చేశాం. జమ్మూ వెళ్లాక కొన్నాళ్లు చౌక హోటళ్లలో ఉన్నాం. తరువాత చిన్న చిన్న బస్తీల్లో గడిపాం. ఆ తరువాత ఒక సత్రానికి వెళ్లాం. అక్కడ మా అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆ రోజు గడిస్తే చాలు అన్నట్లుగా ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితే లేదు' అని రాహుల్ వివరించారు.

ఆ గొడవల కారణంగా అఖిల భారత కశ్మీరీ సమాజం అధ్యక్షుడు విజయ్ ఎమా కూడా తన ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది.

'ఆ విషాదం ఏ ఒక్క కుటుంబానికో పరిమితం కాలేదు. మొత్తం కశ్మీరీ పండితుల సమూహాన్ని దీనావస్థలోకి నెట్టేసిన విషాదం అది. కశ్మీరీ పండితులు కేవలం తమ ఇళ్లను కాదు, మొత్తంగా తమ మూలాలనే కోల్పోయారు.

ఎన్నో తరాల నుంచి మేం అక్కడే ఉన్నాం. అలాంటి ప్రాంతానికి అంత దారుణమైన పరిస్థితి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో, మా ఆడవాళ్ల మానాలను ఎలా రక్షించుకోవాలో అర్థం కాని పరిస్థితి. మాటల్లో చెప్పలేని బాధ అది' అని విజయ్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ శాతం కశ్మీరీ పండితులు అప్పుడు జమ్మూలోనే కొన్ని శరణార్థి శిబిరాల్లో తల దాచుకున్నారు. ఆ ఏడాది జూన్ ఎండలను తట్టుకోలేక ఆ శిబిరాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారని చెబుతారు విజయ్.

దిల్లీకి, జమ్మూకి శరణార్థులుగా వెళ్లిన కశ్మీరి పండితులు, తమ బాధను అక్కడి వారు అర్థం చేసుకుంటారని భావించారు. కానీ, తమ గురించి పట్టించుకునేవారు ఎవరూ లేరని తెలుసుకోవడానికి వాళ్లకు ఎక్కువ సమయం పట్టలేదు.

'మేం కశ్మీర్ నుంచి పారిపోయి హిందువులు ఎక్కువుగా ఉన్న దిల్లీ, లఖ్‌నవూ, జమ్మూ లాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడివారు మమ్మల్ని ఆదరిస్తారని అనుకున్నాం. కానీ, తరువాత అర్థమైంది ఏంటంటే.. ఇంటిని అద్దెకిచ్చే ఓనర్‌కు కులమతాలు ఉండవు. అతడు హిందువూ కాదు, ముస్లిమూ కాదు. అతడు కేవలం ఇంటి ఓనర్ మాత్రమే. అతడి మతం కేవలం డబ్బే' అంటారు విజయ్.

ఆ రోజుల్లో కశ్మీరీ పండితుల సమస్య అందరికీ తెలుసనీ, కానీ, సమాజం, మీడియా, నాయకులు, అధికారులు తమ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతారు విజయ్.

ఒక అంచనా ప్రకారం 1990 నుంచి 2016 మధ్య దాదాపు మూడు లక్షల మంది కశ్మీరీ పండితులు కశ్మీర్‌ను వదిలి వచ్చేశారు. వాళ్లలో ఎక్కువ శాతం మంది 1990లో పారిపోయి వచ్చినవారే.

కొందరు మాత్రం ఏం జరిగినా ఫర్వాలేదనుకొని తమ ఇళ్లను వదిలిపెట్టకుండా కశ్మీర్‌లోనే ఉండిపోయారు.

అలాంటి వాళ్లలో సంజయ్ టీకూ ఒకరు. అన్ని గొడవల మధ్య కూడా ఆయన తన ఇంటిని వదిలి వెళ్లలేదు.

'మా బంధువులను వెతకడానికి జమ్మూ వెళ్లినప్పుడు అక్కడ శరణార్థి శిబిరాల్లో వారిని చూసి చాలా బాధేసింది. ఆ పరిస్థితుల్లో బతకడం కంటే కశ్మీర్‌లో ఉండటమే మేలని అప్పుడే నిర్ణయించుకున్నాం. ప్రాణం పోవాలని రాసుంటే అది కశ్మీర్‌లో జరగాలని భావించాం' అంటారాయన. కశ్మీర్‌లో తాను తలెత్తుకొని జీవించగలనని ఆయన చెబుతారు.

కశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 3000 మంది దాకా కశ్మీరీ పండితులు ఉన్నారని సంజయ్ చెబుతారు. కానీ, వాళ్లంతా అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతారని కశ్మీర్‌ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండితులు అంటారు.

కశ్మీరీ పండితుల కోసం అక్కడ ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తే బయటకు వెళ్లిన వారంతా తిరిగి రావొచ్చని సంజయ్ టీకూ ఆశాభవం వ్యక్తం చేస్తారు.

'కశ్మీర్‌లో ఓ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేసి అక్కడ 60 శాతం కశ్మీరీ పండితులను, 40 శాతం ముస్లింలను ఉంచితే అక్కడకు వెళ్లడానికి మేం సిద్ధమే. మా వాళ్ల మధ్యలో ఉండాలని నాకూ ఉంటుంది' అని చెబుతారు సంజయ్.

Image copyright Sanjay Tikoo

వీటితో పాటు తమకు న్యాయం కావాలని కూడా రాహుల్ పండిత కోరుతున్నారు. న్యాయం అంటే ఆయన దృష్టిలో.. కశ్మీరీ పండితుల ఇళ్లను లూటీ చేసిన వారికి, వాళ్లను హత్య చేసిన వారికి, వాళ్ల ఆలయాలను ధ్వంసం చేసిన వారికి శిక్ష పడటం.

మరోపక్క నాటి విధ్వంసంలో భాగమైన సైఫుల్లా అనే మాజీ మిలిటెంట్ ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, ఆ రోజు కశ్మీరీ హిందువులను తరిమేయడంలో భాగమైనందుకు తాను చాలా బాధపడతున్నానని చెప్పారు. 'వాళ్లు వెనక్కు రావాలి. వాళ్లంతా కశ్మీర్‌లో ప్రశాంతంగా జీవించాలని మేం కోరుకుంటున్నాం. కశ్మీర్ వాళ్లది కూడా' అని సైఫుల్లా పేర్కొన్నారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై కశ్మీరీ పండితులు చాలా సంతోషంగా ఉన్నారు.

"నేను కశ్మీర్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నా. నేను కశ్మీర్ వదిలి వచ్చేనాటికి నా వయసు 27ఏళ్లు. ఇప్పుడు 60కి చేరువయ్యాను. ఇప్పటికీ మా ఇల్లు కశ్మీర్‌లోనే ఉంది. కశ్మీర్ నా మాతృభూమి. ఏదో రోజు మేం కశ్మీర్‌కు తిరిగివెళ్తాం అనుకుంటూనే 30 ఏళ్లు గడిచిపోయాయి. ఈ రోజు మాకు ఈద్ లాంటిది. మా కల ఇన్నాళ్లకు నెరవేరింది" అని అశోక్ భాన్ అన్నారు. 1990లో కశ్మీర్‌ నుంచి పారిపోయిన కశ్మీరీ పండితుల్లో ఆయన కూడా ఒకరు.

Image copyright MAJID JAHANGIR

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంపై 30 ఏళ్లుగా దిల్లీలో వస్త్రాల దుకాణం నడుపుకుంటున్న అశోక్ కుమార్ మట్టూ సంతోషం వ్యక్తం చేశారు.

"మా నాన్న బతికి ఉండుంటే ఈ రోజు ఎంతో బాగుండేది. కొద్ది కాలం క్రితమే ఆయన మరణించారు. ఆయన ఉంటే ఇప్పుడు చాలా సంతోషించేవారు. ఎక్కడెక్కడో ఉన్న కశ్మీరీ పండితులంతా ఈరోజు పండగ చేసుకుంటున్నారు. ఇది వారందరికీ ఎంతో ముఖ్యమైన రోజు" అని తన తండ్రిని గుర్తుచేసుకుంటూ మట్టూ చెప్పారు.

"మేం కశ్మీర్‌ను వదిలి వచ్చినప్పుడు ఇక అది మా ఇల్లు కాదు అనే అనుకున్నాం. కానీ, ఈరోజు దేశం మొత్తం చెబుతోంది, కశ్మీర్ మనది అని" అని మట్టూ తెలిపారు.

"కశ్మీరీ పండిట్లను కశ్మీర్ నుంచి వెళ్లగొట్టాలని ఓరోజు రాత్రి మసీదులో ప్రకటించారు. ఆ సమయంలో కశ్మీరీ పండిట్ల ముందు మూడు మార్గాలున్నాయి. అందులో మొదటిది ఇస్లాంను స్వీకరిచడం, రెండోది ప్రాణాలు అర్పించడం, మూడోది కశ్మీర్‌న వదిలివెళ్లిపోవడం. మాకు ఇల్లు వదిలి వచ్చేయడం మినహా మరో అవకాశం లేదు. అయితే ఇది కేవలం రెండు, మూడు నెలలపాటే అనుకున్నాం. ఖాళీ చేతులతో ఇల్లు వదిలి వచ్చేశాం. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇన్నాళ్లకు మేం సంతోషించే రోజు వచ్చింది" అని 1990కి పూర్వం శ్రీనగర్‌లో పనిచేసిన డాక్టర్ ఎల్ఎన్.ధర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)