కశ్మీర్ విభజన: 'ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి దమ్ము, ధైర్యమే కాదు కృతనిశ్చయం కావాలి'

  • 6 ఆగస్టు 2019
Image copyright EPA

'మాకు అయిదేళ్లు ఇవ్వండి. కశ్మీర్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేసి చూపుతాం'

రాజ్యసభలో తన చరిత్రాత్మక ప్రసంగం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలివి.

కొద్దిరోజులుగా కశ్మీర్‌ మీద మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ఊహాగానాలతో ఏర్పడిన గందరగోళానికి తన నిశ్చిత వాదనలతో ఆయన తెరదించారు.

కశ్మీర్ ప్రజలు ఈ దేశం విషయంలో సంపూర్ణ భావోద్వేగాలు, జాతీయ సమైక్యతను అనుభవించకుండా ఆర్టికల్ 370 అడ్డుకుందన్న బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఈ అధికరణాన్ని రద్దు చేయాలన్న విషయంలో మొదటి నుంచి స్పష్టత కనబరుస్తూ వచ్చింది.

కశ్మీర్‌ ప్రజల మనసుల్లో వేర్పాటువాద ఆలోచనలు రగిలించిన ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న బలమైన భావన దేశ ప్రజల్లో పెద్దఎత్తున కనిపించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 72 ఏళ్ల తరువాత ఇప్పుడిది పూర్తిస్థాయిలో కనిపించింది.

Image copyright EPA

ఆర్టికల్ 370 రద్దు అంశం దేశంలో భావ వైరుధ్య పార్టీలను సైతం ఒకే తాటిపైకి తెచ్చింది. సామ్రాజ్య వ్యతిరేక భావజాలం కనబరిచే పార్టీలూ తమ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి మరీ ఈ విషయంలో ఒక్కటొక్కటిగా ప్రభుత్వానికి మద్దతిచ్చాయి.

లెఫ్టినెంట్ గవర్నర్ల వ్యవస్థ రద్దు, దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం నిత్యం డిమాండ్ చేసే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికింది. ఉగ్రవాద నిరోధానికి, దేశ భౌగోళిక సమగ్రత కోసం ఈ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

పార్లమెంటులో ఈ బిల్లులపై చర్చ సందర్భంగా ఏ పార్టీ ఎటు ఉందనేది సగటు భారతీయులు సులభంగా అర్థం చేసుకున్నారు.

ఈ బిల్లుపై ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా ఏకంగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జాతీయ ప్రయోజనాలు, ప్రజల సెంటిమెంటుకు విరుద్ధంగా దీన్ని వ్యతిరేకించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఆత్మహత్యా సదృశమని.. దీనికి వ్యతిరేకంగా ఓటు వేయమంటూ తాను విప్ జారీ చేయలేనని చెబుతూ ఆయన రాజీనామా చేశారు.

Image copyright Empics

సుదీర్ఘకాలంగా కశ్మీర్‌ను ఒక సమస్యగా, వివాదంగానే చూపిస్తున్నారు. 7 శాతం భూభాగానికి సంబంధించిన సమస్యను ఏకంగా రాష్ట్రవ్యాప్త సంక్షోభంగా మార్చేశారు. వివాదాస్పద పరిభాష, పిక్కటిల్లే గొంతులతో దీన్ని మరింత సంక్లిష్టంగా మార్చేశారు.

1947 నాటి భారత స్వాతంత్ర్య చట్టం భారత్, పాకిస్తాన్‌ల ఏర్పాటుకు సంబంధించిందే కానీ, బ్రిటిష్ ఇండియాలోని ఏ ఒక్క ప్రాంత స్వాతంత్ర్యం, విమోచన గురించి చెప్పలేదు.

స్వాతంత్ర్యానికి ముందు జరిగిన అన్ని చర్చల్లో కీలకంగా వ్యవహరించి మహరాజా హరిసింగ్ ఎన్నడూ కశ్మీర్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడలేదు. రాజ్యాంగ సభ ప్రకటన సందర్భంలో జమ్ముకశ్మీర్ నుంచి నలుగురు సభ్యులు పాల్గొన్నారు. మిగతా అందరిలానే మహరాజా హరిసింగ్ కూడా భారత రాజ్యాంగానికి కట్టుబడి రాజీనామా చేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇంతవరకు జమ్ముకశ్మీర్‌లో అల్లరి మూకల రాళ్లదాడులు.. పోలీసుల కర్ప్యూలు, 144 సెక్షన్లు నిత్యకృత్యంగా ఉండేవి

సమైక్యతా మార్గంలో ఇదో ముళ్లకంప... జమ్ముకశ్మీర్ అభివృద్ధికి పట్టిన గ్రహణం

కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిస్థాయిలో కలిపే మార్గంలో ఎంతోకాలంగా ఉన్న ముళ్ల కంప ఆర్టికల్ 370. కశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తి లోయలో శాంతి స్థాపనకు ఎంతోకొంత సహకరించి ఉండొచ్చు. కానీ, అదే సమయంలో జమ్ముకశ్మీర్‌లోని మిగతా ప్రాంతాలను వెనుకబాటుతనంలోకి నెట్టేసింది.

జమ్ముకశ్మీర్ అభివృద్ధి, ఆ రాష్ట్ర హక్కులకు సంబంధించి జరిగే చర్చలకూ ఈ సంక్షోభం గ్రహణంలా పట్టకుంది. అంతేకాదు, తమ డిమాండ్లు సాధించుకునే క్రమంలో కేంద్రాన్ని తమ దారికి తెచ్చుకోవడానికీ శ్రీనగర్ పాలకులు ఈ సంక్షోభాన్నే ఉపయోగించుకుంటుండేవారు.

పార్లమెంటులో అమిత్ షా చెప్పినట్లు కశ్మీర్ లోయలోని ప్రజల భవిత మూడు కుటుంబాల చేతిలో చిక్కుకుపోయింది. ఈ మూడు కుటుంబాలూ అభవృద్ధి చెందాయి. కానీ, కశ్మీర్ ప్రజలు మాత్రం తరతరాలుగా మోసపోతూ ఏ ప్రయోజనమూ దక్కక అన్నిటికీ దూరంగా మిగిలిపోయారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కార్యాలయం

ఎన్ని నిధులిచ్చినా మింగేస్తున్న జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం: కాగ్

మూడేళ్ల కిందట నిర్వహించిన ఓ ఆర్థిక విశ్లేషణ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు చేసే సహాయంలో 10 శాతం ఒక్క జమ్ముకశ్మీర్‌కే దక్కింది. అదేసమయంలో 2000 - 2016 మధ్య ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే సహాయంలో కేవలం 8.6 శాతమే దక్కింది.

ఈ కేంద్ర సహాయాన్ని రూపాయల్లో చూస్తే కశ్మీర్‌కు ఇది తలసరి రూ.91,300 లెక్కన దక్కగా ఉత్తర‌ప్రదేశ్‌లో ఈ తలసరి సహాయం రూ.4,300 మాత్రమే.

ప్రత్యేక పరిస్థితులను కారణంగా చూపుతూ ఈ అసమతౌల్యాన్ని విశ్లేషించలేం. ఈ నిధులు, సహాయం అంతా ఏమయ్యాయన్న తమ ప్రశ్నలకు ఆడిట్ సమయంలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం సమాధానమే చెప్పలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) చెప్పిన విషయం మర్చిపోరాదు.

చిత్రం శీర్షిక కశ్మీరీ పండిట్లు

కశ్మీరీ మహిళల, కశ్మీరీ పండిట్ల కష్టాలు మానవహక్కుల ఉద్యమకారులకు పట్టవా?

ఆర్థిక అవకతవకలే కాదు వివక్ష కూడా కశ్మీర్‌లో ఉంది. కశ్మీరీ మహిళలు ఆ రాష్ట్రంలో శాశ్వత నివాస హోదా లేని ఇతర రాష్ట్రాల పురుషులను పెళ్లాడితే తమ వారసత్వ ఆస్తి హక్కును కోల్పోతారు.

దీనిపై కోర్టుల్లో ఎన్నో కేసులున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ములోని వాల్మీకి సమాజం దీనిపై కోర్టుకెళ్లింది. కానీ, కశ్మీర్ సమస్య అంటే ఎప్పుడూ సెంటిమెంట్లే తప్ప ఇలాంటి అసమానతలు ప్రస్తావనలోకి వచ్చేవి కావు.

కశ్మీరీ పండిట్లను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.. కానీ, ఈ సమస్య ఎన్నడూ మానవహక్కుల ఉద్యమాలలో ప్రతిధ్వనించిన దాఖలాలు లేవు.

Image copyright EPA

కోర్టుకెక్కితే పోయే బిల్లు కాదిది

ఆర్టికల్ 370ని రద్దు కోరుకుంటున్న ప్రజల నాడిని బీజేపీ సరైన సమయంలో పట్టుకుంది. గత కొన్నేళ్లుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ప్రాబల్యమూ తగ్గుతూ వచ్చింది. గులాం నబీ అజాద్ వంటివారే ఈ విషయాన్ని అంగీకరించారు. కానీ, ఇప్పుడు అదే గులాం నబీ అజాద్ కశ్మీర్‌లో బలగాల మోహరింపును తప్పుపడుతున్నారు.

నిజానికి ఆర్టికల్ 370 ఉగ్రవాద నిరోధానికి ఏ రకంగానూ తోడ్పడలేదు. పైగా ఇది లోయలో అసంతృప్తి భావనలను రగిలించింది.

తాము అధికారంలో ఉన్నా, లేకున్నా ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కంకణం కట్టుకున్న జనసంఘ్.. దాని నుంచి ఆవిర్భవించిన బీజేపీల చిరకాల వాంఛను అనుసరించే ఇప్పుడీ ప్రజాకర్షక అడుగు వేశారన్న వాదనలు పూర్తిగా అసంబద్ధం.

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి చెబుతున్న ప్రకారం ఈ అధికరణం రద్దుపై రాజకీయ పార్టీలు కొన్ని దీనిపై కోర్టును ఆశ్రయించడానికి అవకాశాలూ ఉన్నట్లే, ఈ నిర్ణయం తీసుకునేముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్తృత స్థాయిలో అంతర్గతంగా చర్చించి, న్యాయ నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నందున సర్వోన్నత న్యాయస్థానంలోనూ దీనికి ఆమోదం దక్కే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల చిరకాల వాంఛ ఫలితం. ఇలాంటి సమస్య పరిష్కారానికి రాజకీయ సంకల్పం, తెగువ ఉంటే చాలదు అసమాన కృత నిశ్చయమూ కావాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, సీఎం జగన్‌కు లేఖ, ప్రొఫెస‌ర్ సస్పెన్షన్

‘టార్జాన్’ భార్యను పొడిచి చంపిన కొడుకు.. అతడిని కాల్చిచంపిన పోలీసులు

యుద్ధభూమిలో అమ్మానాన్న మృతి.. చిక్కుకుపోయిన విదేశీ చిన్నారులు.. వీళ్లు ఇళ్లకు చేరేదెలా

ఎరిత్రియా: ఇక్కడ సిమ్‌ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించే వారికి తెలియదు

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా

‘ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్’ - ప్రెస్ రివ్యూ

సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్‌షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్‌'

ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్