కశ్మీర్ విభజన: 'నా ఛాతీ చూపిస్తున్నా... వెన్నులో కాదు, గుండెల్లో కాల్చండి': ఫారూక్ అబ్దుల్లా

  • 6 ఆగస్టు 2019
ఫారూక్ అబ్దుల్లా Image copyright Ani
చిత్రం శీర్షిక ఫారూక్ అబ్దుల్లా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అవాస్తవాలు చెప్పారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా ఆరోపించారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ అమిత్ షా అందుకు భిన్నంగా 'ఫారూక్ అబ్దుల్లా ఆయన ఇష్టప్రకారమే ఇంట్లో ఉండిపోయార'ని అవాస్తవాలు చెప్పారని ఆయన అన్నారు.

తన కుమారుడు, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను కూడా జైలులో పెట్టారని, ఇంకా ఎంతమందిని జైలులో పెడతారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు.

తమను చంపాలనుకుంటున్నారని.. అయితే, వెన్నుపోటు పొడిచి చంపొద్దు, ఛాతీలో కాల్చి చంపేయండంటూ ఆవేశంగా మాట్లాడారు.

'ఫారూక్ తనకు తానే ఇంట్లో ఉండిపోయారే కానీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేయలేదు' అని పార్లమెంటులో అమిత్ షా చెప్పిన తరువాత విలేకరులు ఫారూక్ అబ్దుల్లాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు.

''నా రాష్ట్రం ఎందుకు తగలబడుతోంది.. నా ప్రజలను ఎందుకు జైలులో పెడుతున్నారు. ఇది నా భారతదేశమేనా... కాదు కాదు, భారతదేశమైంతే నీ మతమేంటి? నీదే ప్రాంతం అని అడగదు, అందరికీ అక్కడ స్థానం ఉంటుంది. కానీ, ఇది పూర్తి అప్రజాస్వామికంగా కనిపిస్తోందం'టూ ఆయన మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తాము కోర్టునాశ్రయిస్తామని ఫారూక్ స్పష్టం చేశారు.

తాము తుపాకులు వాడడం లేదని, గ్రనేడ్లు విసరడం లేదని, రాళ్లు కూడా విసరడం లేదని.. కేవలం శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నామని.. అయినా, తమను చంపాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనై.. ''నా ఛాతీ చూపిస్తున్నా... ఇక్కడ కాల్చండి. నా వెన్నులో కాదు.. గుండెల్లో కాల్చండి'' అంటూ ఆగ్రహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు