'కశ్మీర్‌లో యథాతథ స్థితిని కొనసాగించాలి... లద్దాఖ్‌ను యూటీ చేయడాన్ని మేం ఆమోదించం' - చైనా స్పందన

  • 6 ఆగస్టు 2019
జిన్ పింగ్, మోదీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ , ప్రధాని నరేంద్ర మోదీ (పాతచిత్రం)

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 సవరణ, జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ, ఇతర అంశాలపై చైనా మంగళవారం తొలిసారిగా స్పందించింది.

చైనా-భారత్ సరిహద్దు పశ్చిమ సెక్టార్లోని లద్దాఖ్‌ను ఏకపక్షంగా కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ప్రకటించడం ద్వారా చైనా సార్వభౌమాధికారాన్ని భారత్ విస్మరిస్తోందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని చైనా చెప్పింది. కశ్మీర్ విషయంలో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే చర్యలను చేపట్టకూడదని వ్యాఖ్యానించింది.

ఈ అంశాలపై ప్రశ్నలు, సమాధానాల రూపంలో చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హువా చుయింగ్ తమ స్పందనను తెలియజేశారు.

Image copyright Getty Images

ప్రశ్న: చైనా-భారత్ సరిహద్దు పశ్చిమ సెక్టార్లోని లద్దాఖ్‌ ప్రాంతాన్ని భారత ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. దీనిపై మీ స్పందన ఏమిటి?

సమాధానం: చైనా-భారత్ సరిహద్దు పశ్చిమ సెక్టార్లోని చైనా భూభాగాన్ని భారత్ తన పరిపాలనా పరిధిలో చూపించడాన్ని చైనా ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ విషయంలో చైనా వైఖరి స్థిరంగా, దృఢంగా ఉంది. చైనా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు.

భారత్ తన చట్టంలో ఏకపక్ష మార్పుల ద్వారా చైనా భౌగోళిక సార్వభౌమాధికారాన్ని విస్మరించే పనిని కొనసాగిస్తోంది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. ఇవి అమల్లోకి రావు.

సరిహద్దు అంశాల్లో మాటల్లో, చేతల్లో వివేకంతో వ్యవహరించాలని, భారత్, చైనా మధ్య ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని, సరిహద్దు అంశాన్ని మరింత జటిలం చేసే చర్యలేవీ చేపట్టవద్దని భారత్‌కు చైనా పిలుపునిస్తోంది.

Image copyright Getty Images

ప్రశ్న: జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్తాన్ సైనిక బలగాలు పరస్పరం అనేకసార్లు కాల్పులు జరుపుకొన్నాయి. కశ్మీర్‌లోకి భారత్ పెద్దయెత్తున అదనపు పారామిలటరీ దళాలను తరలించింది. అక్కడ భద్రతా చర్యలను పెంచింది. కశ్మీర్ ప్రాంతంలో ఉద్రిక్తత పెరుగుతోంది. మరోవైపు కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ తొలగించింది. ఈ పరిణామాలపై చైనా స్పందన ఏమిటి?

సమాధానం: జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై చైనా తీవ్ర ఆందోళనతో ఉంది.

కశ్మీర్‌పై చైనా వైఖరి స్పష్టంగా, నిలకడగా ఉంది. కశ్మీర్ సమస్య భారత్, పాకిస్తాన్ మధ్య గతం నుంచి ఉన్న సమస్య అనేది అంతర్జాతీయ ఏకాభిప్రాయంగా ఉంది.

సంబంధిత పక్షాలు సంయమనంతో, వివేకంతో వ్యవహరించాల్సి ఉంది. కశ్మీర్ విషయంలో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే, ఉద్రిక్తతలను పెంచే చర్యలు చేపట్టకూడదు.

వివాదాలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను పరిరక్షించాలని భారత్, పాకిస్తాన్‌లకు పిలుపు ఇస్తున్నాం.

Image copyright Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)