ఆర్టికల్ 370 సవరణపై జమ్మూలోని హిందువులు ఏమంటున్నారు

  • 8 ఆగస్టు 2019
జమ్ములోని హిందువులు Image copyright MOHIT KANDHARI/BBC

ముళ్ల కంచెలతో నిండి ఉన్న జమ్మూ నగరంలో గత మూడు రోజలుగా నిశ్శబ్దం అలుముకుంది. నగరం అంతా కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉంది.

కశ్మీర్ లాగే జమ్మూలో కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నిచోట్లా భద్రతాదళాలను మోహరించారు.

సోమవారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ఆర్టికల్ 370ని సవరించాలనే నిర్ణయం గురించి చెబుతున్నప్పుడు, అదే సమయంలో జమ్మూలో చాలామంది తమ ఇళ్లలో బందీల్లా ఉన్నారు.

బుధవారం ఉదయం సామాన్యులకు ఉపశమనం కోసం దానిని కొంచెం సడలించారు. కానీ పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన పర్యటకులు, యాత్రిక్తులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు.

వార్తాపత్రికలు, టీవీల్లో కనిపించడం కోసం కొందరు బీజేపీ నేతలు కార్యకర్తలతో కలసి మువ్వన్నెల జెండాను పట్టుకుని ఫొటోలు దిగుతున్నారు. ఢోల్ వాయిస్తూ స్వీట్లు కూడా పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

జమ్మూలోని కొన్ని ఇతర సంస్థల కార్యకర్తలు కడా నగరం బయట ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు.

Image copyright MOHIT KANDHARI/BBC
చిత్రం శీర్షిక వాహనానికి కశ్మీర్ జెండా తీసేస్తున్న డాక్టర్ నిర్మల్ సింగ్

జమ్మూకు తన హక్కు లభిస్తుంది

ఆర్టికల్ 370 సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో మంగళవారం సాయంత్రం జమ్ము, కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ నిర్మల్ సింగ్ తన ప్రభుత్వ వాహనానికి ఉన్న జమ్ము-కశ్మీర్ జెండాను తీసేశారు.

"ఒకే చట్టం, ఒకే గుర్తు కల నెరవేరింది. ఇది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ ప్రేమ్‌నాథ్ డోగ్రా, ప్రజా పరిషత్ అమరులకు అసలైన నివాళి. 1953 నుంచి దీనికోసం రాష్ట్రంలో పోరాటాలు జరుగుతున్నాయి" అని నిర్మల్ సింగ్ బీబీసీతో అన్నారు.

"ఆర్టికల్ 370ని తొలగించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్తుంది. ఇది ఇక్కడి ప్రజల భావాలను గౌరవించడమే" అన్నారు.

హిందువులు మెజారిటీగా ఉన్న జమ్మూ ప్రాంతంలో కొంతమంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ "ఆర్టికల్ 370ని సవరించడం వల్ల జమ్ముకు ఇప్పుడు తన హక్కులు లభిస్తాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పెట్టుబడులు రావడం వల్ల ఇక్కడ పరిశ్రమలు తెరుస్తారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి సహకారం లభిస్తుంది" అన్నారు.

అయితే కొంతమంది మాత్రం "ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని చాలా పెద్ద తప్పు చేసింది. ఈ నిర్ణయంతో కశ్మీర్ లోయలో ఉన్న వారి ఆగ్రహం మరింత పెరుగుతుంది. బహుశా రాబోవు రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చు" అన్నారు.

Image copyright MOHIT KANDHARI/BBC

జమ్ము-కశ్మీర్‌లో అంతరం తరుగుతుంది

బీబీసీతో మాట్లాడిన జమ్ము-కశ్మీర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది షేక్ షకీల్ దీనిని రాజ్యాంగవిరుద్ధ నిర్ణయమని వ్యాఖ్యానించారు.

"ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, కశ్మీర్ ప్రజల ప్రయోజనాల కోసమే అయితే.. దీనికి సంబరాలు చేసుకోవడానికి రోడ్లపైకి ఎందుకు అనుమతించలేదు? భారీ సంఖ్యలో సైన్యాన్ని ఎందుకు మోహరించారు" అని ఆయన ప్రశ్నించారు.

"ఈ చారిత్రక నిర్ణయంతో మా 70 ఏళ్ల బానిసత్వం ముగిసిపోతుంది" అని వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీ యాక్షన్ సమితి చీఫ్ లాభా రాం గాంధీ బీబీసీతో అన్నారు.

"మేం హక్కులు, పౌరసత్వం సాధించడం కోసం ఒక యుద్ధం చేస్తున్నాం. ఈ నిర్ణయంతో ఇప్పుడు మాకు మా హక్కులు లభిస్తాయి. మేం కూడా తలెత్తుకుని జీవించవచ్చు" అని గాంధీ భావించారు.

"ఈ నిర్ణయం వల్ల జమ్ము, కశ్మీర్ మధ్య అంతరం తుడిచిపెట్టుకుపోతుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత రెండింటికీ సమాన హక్కులు లభిస్తాయి, పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది" అని జమ్ము వ్యాపారి సంజీవ్ గుప్తా అన్నారు.

"జమ్ము ప్రజలు 70 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేశారు. దాని పరిణామాలను వాళ్లు ఇప్పుడు చూస్తున్నారు" అని రాజకీయ విశ్లేషకులు, జమ్మూ యూనివర్సిటీలో చరిత్ర రిటైర్డ్ ప్రొఫెసర్ హరిఓం అన్నారు.

"ఆర్టికల్ 370, 35ఎ ముసుగులో కొంతమంది రాజకీయ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేవారు. ఆర్టికల్ 370 సవరణ తర్వాత ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమవుతుంది" అన్నారు.

ఈ నిర్ణయంతో జమ్మూలో ఉండే మహిళలకు కూడా ఉపశమనం లభించింది. ఇప్పటివరకూ ఆర్టికల్ 370, 35ఎ వల్ల రాష్ట్రంలోని అమ్మాయిలు బయట రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుంటే, వారికి పూర్వీకుల ఆస్తులపై హక్కు లేకుండా పోయేది.

Image copyright MOHIT KANDHARI/BBC
చిత్రం శీర్షిక పూజా గుప్తా

పెట్టుబడులపై ఆశలు పెరిగాయి

"పెళ్లి చేసుకున్న తర్వాత జమ్ము-కశ్మీర్ బయట ఉండే అమ్మాయిలకు కూడా ఈ నిర్ణయంతో పూర్వీకుల ఆస్తిలో హక్కు లభిస్తుంది" అని మోనిగా గుప్తా బీబీసీతో అన్నారు.

"పెట్టుబడులు పెరగడం వల్ల ఇక్కడ పరిశ్రమలు పెరుగుతాయి. వాటి కోసం భూమి కూడా అవసరం అవుతుంది. రైతులు వ్యవసాయానికి అనూకూలమైన భూములు ఇవ్వరు. కానీ ఎవరి దగ్గరైనా వేరే భూమి ఉండి, ప్రభుత్వం మంచి ధర ఇస్తే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు" అని వృతిరీత్యా కళాకారులైన పూజా గుప్తా అన్నారు.

ఈ నిర్ణయంతో పెట్టుబడులు పెరుగుతాయనే వాదనలు వస్తున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

"ఇదో మంచి అడుగు. నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడానికి చాలా ప్రయోజనకరం. అయితే జమ్ము-కశ్మీర్‌లో పెట్టుబడుల అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదు. కశ్మీర్ లోయలో సామాన్యులు ఈ నిర్ణయం తర్వాత ఎలా ఉంటారు? వాళ్లు తమ భూమి అమ్ముకోడానికి సిద్ధంగా ఉంటారా లేదా అనేది చూడాలి" అని జమ్ములో సొంత పరిశ్రమ నడుపుతున్న పవన్ దీప్ సింగ్ మెహతా అన్నారు.

పెట్టుబడులు రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని రైతు యశ్‌పాల్ సింగ్ అన్నారు. నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన "జమ్ము-కశ్మీర్ ఇప్పటికీ ఒక కల్లోలిత ప్రాంతమే. అందుకే ఎంతమంది పెట్టుబడిదారులు ఇక్కడకు వచ్చి తమ డబ్బు పెడతారు అనేది అప్పుడే చెప్పడం కష్టం" అన్నారు.

Image copyright MOHIT KANDHARI/BBC

అవినీతికి కళ్లెం పడుతుంది

జమ్ములోని గ్రేటర్ కైలాశ్‌ ప్రాంతంలో మెడికల్ షాపు నడిపే మోహిత్ రైనా "పెట్టుబడుల కోసం ముఖ్యమైనది భూమి. పెట్టుబడిదారులకు ఎంత భూమి ఇప్పించడంలో ప్రభుత్వం విజయం సాధిస్తుంది? ఎంతమంది తమ ఇష్టప్రకారం భూమిని ఇస్తారు? అనేది చాలా కీలకమైన విషయం" అన్నారు.

"మేం కూడా మా రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని, ముందు తరాలకు ఉపాధి అవకాశాలు రావాలని, వారికి బయట రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని అనుకుంటున్నాం" అంటారు మోహిత్.

"ఏ పెట్టుబడిదారులు సొంతంగా జమ్ము-కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారో, వాళ్ల వల్ల ఉపాధి సమస్య పరిష్కారం అవుతుంది. యువత భవిష్యత్తు మెరుగుపడుతుంది" అని దేవ్ యోగరాజ్ గోస్వామి అన్నారు.

చాంబరాఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జమ్ము చీఫ్ రాకేష్ గుప్తా ఒక ప్రకటన జారీ చేస్తూ "పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఇక్కడ జమ్ము-కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టగలరు. ఉపాధి అవకాశాలు అందించగలరు" అని చెప్పారు.

"ఈ చారిత్రక నిర్ణయంతో అవినీతికి కూడా కళ్లెం పడుతుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో దారుణ వాస్తవాలు

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల ప్రభావం భారత్ మీద పడుతుందా?

యూట్యూబ్: నకిలీ క్యాన్సర్ చికిత్స వీడియోలతో యూట్యూబ్ సొమ్ము చేసుకుంటోందా?

టీవీ చానల్స్ నిలిపివేత ఎమ్మెస్వోల ఇష్టమా.. ట్రాయ్ పాత్ర ఏంటి