జమ్ము కశ్మీర్: ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ల కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రమా.. అభివృద్ధి సూచీలు ఏం చెబుతున్నాయి?

  • 9 ఆగస్టు 2019
అమిత్ షా Image copyright RSTV

ఆర్టికల్ 370 రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ జమ్ము కశ్మీర్‌ ఇంతకాలం అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందని, దానికి కారణం ఆర్టికల్ 370 అని చెప్పుకొంటూ వచ్చారు.

ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న నిర్ణయం జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో కూడా వివరించారు. అక్కడ విద్య, వైద్య రంగాల్లో ప్రగతికి ఇది ఎలా పనికొస్తుందని కూడా అన్నారు.

ఇంతవరకు జమ్ముకశ్మీర్‌లో విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి లేదా...

అయితే, 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) వెల్లడి చేసిన వాస్తవాలు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్ రాష్ట్రాలనే ఉదాహరణలుగా తీసుకుని జమ్ము కశ్మీర్‌‌తో వాటిని పోల్చి చూస్తే.జమ్ము కశ్మీర్‌లో అభివృద్ధి కొంతవరకు అర్థముతుంది.

ఆంధ్రప్రదేశ్‌తో పోల్చిచూస్తే...

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2015-16) ప్రకారం జమ్ము కశ్మీర్ కంటే ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ-పురుష నిష్పత్తి మెరుగ్గా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు జమ్ము కశ్మీర్‌లో 972 మంది మహిళలుంటే ఏపీలో వారి సంఖ్య 1020.

ఆరేళ్లు దాటిన స్త్రీ జనాభా(స్కూలుకి వెళ్లి చదువుకున్నవారు) ఆంధ్రప్రదేశ్‌లో 62 శాతం కాగా జమ్ము కశ్మీర్‌లో వారి శాతం 65.5.

వైద్య, ఇతర సూచీలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ కంటే జమ్ము కశ్మీర్ మరీ అంత వెనుకబడి ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సదుపాయం ఉన్న కుటుంబాలు 98.8 శాతం ఉండగా జమ్ము కశ్మీర్‌లో 97.4 శాతం ఉన్నాయి.

రోగ నిరోధక టీకాల విషయంలో జమ్ము కశ్మీర్ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. ఆంధ్రప్రదేశ్‌లో 12 నుంచి 23 నెలల పిల్లల్లో అన్ని రోగ నిరోధక టీకాలు వేయించుకున్నవారి శాతం 65.3 కాగా.. జమ్ము కశ్మీర్‌లో అది 75.1 శాతం.

ఏపీలో శిశుమరణాల రేటు 35 కాగా జమ్ము కశ్మీర్‌లో అది 32.

మెరుగైన పారిశుద్ధ్య సదుపాయం ఉన్న కుటుంబాలు, ఆసుపత్రి ప్రసవాలు వంటి విషయాల్లో జమ్ము కశ్మీర్ కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది.

గుజరాత్‌తో పోల్చి చూస్తే...

జమ్ము కశ్మీర్, గుజరాత్ రాష్ట్రాలను కొన్ని అభివృద్ధి సూచీల ప్రాతిపదికన పోల్చి చూస్తే.. శిశుమరణాల రేటు విషయంలో గుజరాత్‌లో పరిస్థితి జమ్ము కశ్మీర్ కంటే వెనుకబడి ఉంది. విద్యుత్ సదుపాయం గల కుటుంబాలు కూడా జమ్ము కశ్మీర్ కంటే గుజరాత్‌లో తక్కువని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(2015-16) గణాంకాలు చెబుతున్నాయి.

12 నుంచి 23 నెలల మధ్య చిన్నారుల్లో అన్ని రోగ నిరోధక టీకాలు వేయించుకున్నవారి సంఖ్య గుజరాత్‌లో చాలా తక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)