మోదీ చెప్పిన లద్దాఖ్‌లోని 'సోలో' మొక్క విశేషాలేంటి?

  • 9 ఆగస్టు 2019
మోదీ, సోలో మొక్క Image copyright Getty Images

జమ్ము కశ్మీర్ విభజన నిర్ణయం తరువాత జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ... లద్దాఖ్‌లోని ఒక మొక్క గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

జమ్మూ కశ్మీర్ కుంకుమ పువ్వు, కశ్మీరీ శాల్ సహా అక్కడి కళాకృతులన్నీ ప్రపంచమంతా చేరేలా చేస్తామంటూ... లద్దాఖ్ ప్రాంతంలో దొరికే ఒక అరుదైన మొక్క గురించి మీకు తెలుసా? అని ప్రశ్నించారు.

లద్దాఖ్‌లో 'సోలో' అనే అరుదైన మొక్క దొరుకుతుందని, అది ఎత్తైన పర్వతాలపై నివసించే వారికి, మంచులో సరిహద్దు వద్ద విధులు నిర్వహించే సైనికులకు 'సంజీవని'లా పనిచేస్తుందని చెప్పారు.

ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండేవారిలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ఔషధ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

'సోలో' లాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే మొక్కలు జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లో పనికిరాకుండా ఉన్నాయని ప్రధాని చెప్పారు.

అలాంటి మొక్కలను మార్కెట్ చేయడం వల్ల వచ్చే లాభాలతో జమ్మూకశ్మీర్, లద్దాఖ్ రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి అందించేందుకు జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సోలో (రోడియోలా)

'సోలో' విశేషాలేంటి?

అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు ఉండే హిమాలయ పర్వతాల్లాంటి ఎత్తైన ప్రదేశాలలో గడపడం అత్యంత సవాలుతో కూడిన విషయం.

అయితే, అలాంటి పరిస్థితులను తట్టుకునేందుకు ఉపయోగపడే ఒక 'అద్భుతమైన మొక్క'ను లద్దాఖ్ పర్వత శ్రేణుల్లో కనుగొన్నామని 2014లో భారత శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఆ మొక్క పేరు రోడియోలా రోసియా. స్థానికులు 'సోలో' అని పిలుస్తారు.

అది మనిషిలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచగల "అద్భుత మొక్క" అని శాస్త్రవేత్తలు అభివర్ణించారు.

ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉండే వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు ఉపయోగపడటంతో పాటు, అన్నింటికంటే ముఖ్యంగా రేడియోధార్మికత నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని వివరించారు.

తీవ్రమైన చలి ఉండే, ఎత్తైన ప్రదేశాల్లో ఈ మొక్కలు కనిపిస్తాయి. వీటి ఆకులను స్థానికులు కూర వండుకుని తింటారు. కానీ, వాటిలోని ఔషధ గుణాల గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు.

Image copyright DAVE STAMBOULIS
చిత్రం శీర్షిక లద్దాఖ్‌లోని లోయ

లేహ్ ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (దిహార్)కు చెందిన పరిశోధకులు ఈ మొక్కలోని ఔషధ గుణాలపై కొన్ని దశాబ్దాలపాటు అధ్యయనం చేశారు.

సముద్ర మట్టానికి 5,400 మీటర్ల ఎత్తులో ఉండే సియాచిన్ లాంటి అత్యంత కఠినమైన, ఎత్తైన ప్రదేశాలలో విధులు నిర్వహించే సైనికులకు ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

జీవ రసాయన యుద్ధాలలో వాడే బాంబుల నుంచి వెలువడే గామా కిరణాల ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా ఈ ఔషధం పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

Image copyright Getty Images

క్షయ, క్యాన్సర్‌ రుగ్మతలకు

ఈ మొక్క ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది. అమెరికా, చైనాల్లోనూ ఈ మొక్కలోని ఔషధ గుణాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

చైనాలో ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు ఈ ఔషధాన్ని వాడుతున్నారు. మంగోలియాలో క్షయ, క్యాన్సర్‌ రోగులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తుంటారని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ తెలిపింది.

క్రీడాకారులు, వ్యోమగాముల మీద ఈ మొక్క ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై రష్యా పరిశోధకులు అధ్యయనం చేశారు.

అలసట, ఒత్తిడి నుంచి త్వరగా కోలుకునేందుకు, జ్ఞాపకశక్తిని పెంచేందుకు, గుండె సంబంధిత సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడే ఔషధగుణాలు కూడా ఈ మొక్కలో ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం రోడియోలా ఔషధంతో కూడిన కొన్ని మందులు వేర్వేరు పేర్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు