అరుణ్ జైట్లీ (1952 - 2019): విద్యార్థి నాయకుడు, న్యాయవాది నుంచి రాజకీయ సమున్నత శిఖరాలకు...

ఫొటో సోర్స్, Getty Images
భారత మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. 1952 డిసెంబర్ 28న జన్మించిన జైట్లీ వయసు 66 ఏళ్ళు.
ఆయన తండ్రి మహరాజ్ కిషన్ జైట్లీ కూడా లాయరే. ఆయన తల్లి రత్న ప్రభ గృహిణి, సామాజిక కార్యకర్త. ఒక అన్న, ఇద్దరు సోదరీమణులతో పాటు జైట్లీ బాల్యమంతా దిల్లీలోని నారాయణ విహార్‌లో గడిచింది. వారి కుటుంబం లాహోర్ నుంచి వచ్చి దిల్లీలో స్థిరపడింది.
అరుణ్ జైట్లీ దిల్లీలోని సెయింట్ జేవియర్స్, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లలో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది.
దిల్లీలో చదువుకుంటున్న కాలంలోనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న అరుణ్ జైట్లీ అనంతర కాలంలో జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగారు.
ఫొటో సోర్స్, FB @ArunJaitley
2000 సంవత్సరం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ 1999 నుంచి పలు మార్లు భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహించారు.
ప్రస్తుతం ఆయన ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు 2000 నుంచి 2018 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
నరేంద్ర మోదీ గత ప్రభుత్వంలో ఆయన వేర్వేరు మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు. 2014 నుంచి 2016 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా.. 2014 - 17 మధ్య మోదీ ప్రభుత్వంలోనే రక్షణ మంత్రిగా, 2014 - 19 కాలంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల మంత్రిగానూ పనిచేశారు.
ఫొటో సోర్స్, FB @ArunJaitley
అంతకుముందు అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంలోనూ పనిచేసిన ఆయన అప్పట్లో సమాచార ప్రసార (స్వతంత్ర), వాణిజ్య, న్యాయ శాఖల మంత్రిగా వ్యవహరించారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు. అలాంటి శాఖ ఏర్పాటుచేయడం అదే తొలిసారి. ఆ శాఖకు తొలిమంత్రి జైట్లీనే.
రాజ్యసభలో బీజేపీ సభాపక్ష నేతగానూ పనిచేసిన ఆయన 2002 నుంచి మరింత క్రియాశీలంగా మారి భారతీయ జనతా పార్టీకి వ్యూహకర్తగానూ సేవలందించారు.
హిందుత్వ భావజాలం ఉండే బీజేపీలో లిబరల్ ఫేస్ ఉన్న అతికొద్ది మంది నేతల్లో ఆయన ఒకరు అని రాజకీయవర్గాల్లో అనుకుంటూ ఉంటారు.
ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకే ఒక్కసారి పోటీ.. ఓటమి
సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న అరుణ్ జైట్లీ ఒకే ఒక్కసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన అమృత్సర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నేత, ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేతిలో సుమారు లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2004 నుంచి అమృత్‌సర్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్థానంలో 2014లో జైట్లీకి టికెట్ ఇచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ కాంగ్రెస్ తరఫున అక్కడ బరిలో దిగడంతో గట్టి పోటీ ఎదురై జైట్లీ ఓటమి పాలయ్యారు.
ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యాభ్యాసం
1952 డిసెంబరు 28న జన్మించిన జైట్లీ దిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ జేవియర్స్ స్కూల్లో చదువుకున్నారు.
శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. దిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో ఉండగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నాయకుడిగా చురుగ్గా పనిచేశారు.
1974లో ఆయన దిల్లీ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఫొటో సోర్స్, facebook/Arun Jaitley
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా..
1977లో దిల్లీ యూనివర్సిటీ న్యాయ విద్యలో డిగ్రీ పట్టా అందుకున్న తరువాత అదే ఏడాది ప్రాక్టీస్ ప్రారంభించారు. సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఆయన న్యాయవాదిగా సేవలందించారు.
1989లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1998లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు భారత ప్రతినిధిగా వెళ్లారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, మనీ లాండరింగ్‌కు సంబంధించిన చట్టాలు ఆ సమావేశాల్లో ఆమోదం పొందాయి.
సమస్యల పరిష్కారంలో ఆయన శైలి చాలామందికి బీజేపీ నేతల కంటే భిన్నంగా ఉంటుందని... సామరస్యంగా పరిష్కారాలు చూపించగలిగే సత్తా ఆయన సొంతమని, తెగే వరకు లాగే తత్వం కాదని సీనియర్ పాత్రికేయుడు చెప్పారు. న్యాయ సంబంధిత అంశాల్లోనూ ఆయన సమతూకం పాటిస్తారని చెప్పారు.
ఫొటో సోర్స్, facebook/arunjaitley
ఎమర్జెన్సీ కాలంలో 19 నెలలు జైలులోనే
1977లో ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి నేతగా ఉన్న అరుణ్ జైట్లీని అదుపులోకి తీసుకుని తొలుత హరియాణాలోని అంబాలా జైలులో ఉంచారు. అనంతరం ఆయన్ను దిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ఆ కాలంలో ఆయన 19 నెలలు జైలులో ఉన్నారు.
ఆ తరువాత ఆయన దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడయ్యారు. అనంతరం కొద్దికాలానికే ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగానూ జైట్లీ నియమితులయ్యారు.
ఏపీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటనలో..
అరుణ్ జైట్లీ 1982లో సంగీతా డోగ్రాను వివాహమాడారు. సంగీత జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గిరిధారీ డోగ్రా కుమార్తె.
జైట్లీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. ఇద్దరూ న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు.
పుస్తక పఠనం ఆయన వ్యాపకాల్లో ఒకటి. అలాగే.. న్యాయపరమైన అంశాలు, వర్తమాన వ్యవహారాలపై తాను రాసిన వ్యాసాలు.. వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలను సంకలనంగా చేసి పుస్తకం వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ ఇవ్వాలనుకున్నప్పుడు దానికి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించారని, ఏపీకి ప్యాకేజీ ప్రకటించడానికి కేంద్రంలోని ఇతర పెద్దలను ఒప్పించిందీ ఆయనేనని సీనియర్ పాత్రికేయుడు ఎ.కృష్ణారావు అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘బీజేపీలో ద లాస్ట్ జెంటిల్మన్.. ఆయనుంటే చిదంబరం అరెస్టయ్యేవారు కాదేమో’
అరుణ్ జైట్లీ కనుక ప్రస్తుత కేంద్ర కేబినెట్లో ఉండుంటే చిదంబరం వ్యవహారం అరెస్ట్ వరకు వెళ్లుండేది కాదని కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
బీజేపీ కురువృద్ధుడు అడ్వాణీ మనిషిగా పేరుపడి మోదీ సన్నిహిత బృందాల్లోనూ కీలకంగా వ్యవహరించగలగడం జైట్లీ గొప్పదనమని అన్నారు.
బహుశా బీజేపీలోని 'ద లాస్ట్ జంటిల్మన్' ఆయనే కావొచ్చని కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
క్రికెట్‌కూ సేవలందించారు
రాజకీయాల్లో నిత్యం తీరిక లేకుండా గడిపే అరుణ్ జైట్లీ క్రికెట్ పాలక మండళ్లలో బాధ్యతలు చేపట్టి ఆ క్రీడాభివృద్ధికి సహకరించారు.
బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన పనిచేశారు. అంతకుముందు దిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
కశ్మీర్లో అధికారాల బదలాయింపుపై చర్చల ప్రతినిధిగా..
కార్గిల్ యుద్ధం తరువాత 2002 జులైలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అధికారాల బదలాయింపు అంశంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, అక్కడి వేర్పాటువాదులు, ఇతర సంస్థలతో కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా చర్చలు జరిపారు.
ఇవి కూడా చదవండి:
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఈ గాయని నోటికి టేప్ అతికించుకుని నిద్రపోతారు.. కారణమేంటో తెలుసా
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
అరుణ్ జైట్లీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. కొద్ది రోజులుగా దిల్లిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం మరణించారు.