మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో కనిపించడం వల్ల జిమ్ కార్బెట్‌కు వచ్చే లాభం ఏంటి? :అభిప్రాయం

  • 12 ఆగస్టు 2019
జిమ్ కార్బెట్ Image copyright DISCOVERY

డిస్కవరీ చానల్లో పాపులర్ కార్యక్రమం 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ప్రజెంటర్ బియర్ గ్రిల్స్, ప్రధానమంత్రి మోదీ రాక కోసం.. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ 'ఢికాలా' పరిసరప్రాంతాల్లో మిగతా పర్యాటకుల్లాగే కొన్నిరోజుల వరకూ వేచి చూశారు.

బియర్ గ్రిల్స్ తను మోసపోయానని అనుకునుంటారు. అలానే అనుకుంటారు. ఎందుకంటే, అత్యంత కఠినంగా ఉండే అడవుల్లో దుర్భర పరిస్థితులను తట్టుకోగలనని చెప్పే ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. అడవిలో తినడానికి ఏమీ లేనప్పుడు పాములను కూడా కరకర నమిలేస్తూ ఉత్సాహంగా కనిపిస్తారు.

Image copyright Ani

కానీ, జిమ్ కార్బెట్‌లో ఆయన 'ఢికాలా' పరిసరాల లోపలే ఉండాల్సి వచ్చింది. అక్కడ పర్యాటకుల కోసం 33 కెమెరాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి రాకుండా వన్యప్రాణులను దూరంగా ఉంచడానికి చుట్టూ కరెంటు కంచె కూడా ఉంది.

ఇక్కడి మట్టి దారుల్లో, దూరదూరాల వరకూ ఉన్న పచ్చటి గడ్డి మైదానాల్లో, నదీతీరాల్లో మీరు పగటివేళ చక్కగా పర్యటించవచ్చు. అయితే, అధికారిక ఓపెన్ టాప్ వాహనాల్లో మాత్రమే. ఆ వాహనాల నుంచి ఒక్క క్షణం కిందికి దిగినా, భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇక్కడ బియర్ గ్రిల్స్ నిస్సహాయతను అర్థం చేసుకోవచ్చు.

ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా బియర్ గ్రిల్స్ కష్టాలు తీరలేదు. ఆరోజు ఉదయం నుంచీ ఢికాలా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అయితే, అది వర్షాకాలం కాదు. పర్వత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఊహించని విధంగా ఇలా ఎప్పుడైనా జరగచ్చు.

మోదీ కాలాగఢ్ నుంచి ఒక స్పీడ్ బోట్ ద్వారా ఢికాలా చేరుకున్నారు. వర్షం ఆగేవరకూ అడవిలో ఉన్న ఒక పాత రెస్ట్ హౌస్‌లో ఆగారు. ఢికాలాలో ఉన్న ఈ పాత రెస్ట్ హౌస్ ఒక అత్యద్భుత నిర్మాణం.

Image copyright DISCOVERY

జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు ఆ పేరెలా వచ్చింది

భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్. ఉత్తరాఖండ్‌ పురాతన లోతట్టు ప్రాంతాలు గడ్వా, కుమావు ప్రాంతాల్లోకి వస్తాయి. అక్కడ దట్టమైన అడవి, గడ్డి మైదానాలు, పర్వతాలు కలగలసి పర్యాటకులకు ఒక అద్భుత దృశ్యాన్ని అందిస్తాయి. సరిగ్గా ఇక్కడే రామగంగా నది వంపులు తిరుగుతూ ప్రవహిస్తుంటుంది.

ఇక్కడ రణతంభోర్ పులులను చూడాలంటే సులభం, కానీ అసలు సిసలు అందం అంతా జిమ్ కార్బెట్‌ పార్కులోనే ఉంది.

1936లో నాటి యునైటెడ్ ప్రావిన్స్‌కు అప్పట్లో గవర్నర్‌గా ఉన్న మాల్కమ్ హేలీ పేరున దీనికి మొదట హేలీ నేషనల్ పార్క్ అనే పేరు పెట్టారు.

Image copyright Ajay suri

తర్వాత ఈ పార్కుకు ఉత్తరాఖండ్‌లో ఇప్పటికీ గుర్తు చేసుకునే జిమ్ కార్బెట్ పేరు పెట్టారు.

ఆయన నరభక్షకులైన పులులు, చిరుతల నుంచి ఇక్కడి కొండప్రాంతాల ప్రజలను కాపాడారు. ఆ తర్వాత ప్రముఖ వేటగాడైన జిమ్ కార్బెట్ తన జీవితాంతం వన్యప్రాణుల సంరక్షణ కోసం పని చేశారు.

జిమ్ కార్బెట్ తన 16 ఎంఎం కెమెరాతో వన్యప్రాణుల సినిమాలు తీయడమే కాదు, అడవిపై పుస్తకాలు కూడా రాశారు. వాటిని ఇప్పటికీ క్లాసిక్స్‌గా చెబుతారు.

ఆయన పుస్తకాల్లో ముఖ్యమైనవి 'మాన్ ఈటర్స్ ఆఫ్ కుమావూ', 'ద టెంపుల్ టైగర్', 'మోర్ మాన్ ఈటర్స్ ఆఫ్ కుమావూ', 'ది మేన్ ఈటింగ్ లిపర్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్', 'మై ఇండియా', 'జంగల్ లోర్'.

1955లో జిమ్ కార్బెట్ చనిపోయిన తర్వాత ఈ రిజర్వ్ పేరును జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌గా మార్చారు. అంటే టెక్నికల్‌గా, అక్కడి అందాలను బట్టి బట్టి జిమ్ కార్బెట్ భారతదేశంలో మొట్టమొదటి అత్యుత్తమ ప్రకృతి పరిరక్షకులుగా నిలిచారు.

అంతరిస్తున్న పులులను సంరక్షించే 'ప్రాజెక్ట్ టైగర్‌'ను 1973 ఏప్రిల్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇక్కడనుంచే ప్రారంభించారు.

Image copyright Getty Images

జిమ్ కార్బెట్ 'ఢికాలా' జోన్

సరే, ఇప్పుడు మళ్లీ మాన్ వర్సెస్ వైల్డ్ విషయానికొద్దాం..

వర్షం కాసేపటి తర్వాత తగ్గింది. దాంతో బియర్ గ్రిల్స్ టీమ్ అంతకు ముందే నిర్ణయించిన కొన్ని ప్రాంతాల్లో బియర్, మోదీపై షూటింగ్ చేశారు.

ప్రధానమంత్రితో కలిసి రెండు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ షూటింగ్ రామగంగా నదీతీరంలో కూడా జరిగింది. దీనినే గెథియా రో అంటారు. ఆ గడ్డి మైదానానికి మూడు వైపులా ఢికాలా పరిసరాలు చుట్టుముట్టి ఉంటాయి.

ఉత్తరాఖండ్ అటవీశాఖ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధానమంత్రి అక్కడకు రావడానికి ముందు, బియర్ గ్రిల్స్‌ను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఢికాలా పరిసరాలు దాటి వెళ్లడానికి అనుమతించలేదు. అది చాలా ప్రమాదకరం అని ఆయనతో చెప్పారు.

Image copyright Getty Images

నిజానికి, పదేళ్ల ముందు ఒక ఆడపులి ఆ పరిసరాల్లో చొరబడి ఒక రెస్టారెంట్ నిర్వాహకుడిని చంపేయడంతో ఢికాలా చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి చాలాసార్లు ఏనుగులు కూడా వచ్చేశాయి.

ఢికాలా పరిసరాల్లో ఉన్న వన్యప్రాణులకు ఏ నష్టం జరగకుండా, షూటింగ్ కోసం అటవీశాఖ రెండు ప్రాంతాలను నిశ్చయించింది. కార్యక్రమం షూట్ చేస్తున్నప్పుడు ఎస్పీజీ అధికారులు, అటవీశాఖ అధికారులు కెమెరాలకు కాస్త దూరంలో ప్రధానికి రక్షణగా నిలిచారు.

కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో గెథియా రో ప్రాంతం చాలా ముఖ్యమైన ప్రాంతం. అక్కడ 'పాడ్వాలీ' ఒక ఆడపులి, దాని మూడు పిల్లలు ఉంటున్నాయి.

Image copyright DISCOVERY

షూటింగ్ జరిగిన రోజు ఆ పులి కుటుంబాన్ని బయటకు రానివ్వలేదు. ఈ ప్రాంతంలో ఫిబ్రవరి నెలలో ఏనుగులు కనిపించవు. సాధారణంగా మార్చి చివర్లో ఇక్కడి గడ్డి మైదానాలు, చెట్లలోకి ఏనుగులు భారీగా వచ్చేస్తాయి. దాంతో ఈ షూటింగుకు వాటి నుంచి ఉపశమనం లభించింది.

ఆమిర్ ఖాన్ నటించిన 'త్రీ ఇడియట్స్' సినిమా వల్ల లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఎంత పాపులర్ అయ్యిందో, అలాగే మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం తర్వాత జిమ్ కార్బెట్ పార్కుకు కూడా అంతే పాపులారిటీ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ, అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇలాంటి ప్రాంతాలకు నిజంగానే అంత ప్రచారం అవసరమా?

Image copyright AJAY SURI

పర్యాటకుల ఒత్తిడి వల్ల ఎదురయ్యే ముప్పును గుర్తించిన లద్దాఖ్ అధికారులు పాంగాంగ్ సరస్సు దగ్గర క్యాంప్ వేయడాన్ని నిషేధించారు.

బియర్ గ్రిల్స్ ఇక్కడకు రాకముందే జిమ్ కార్బెట్‌కు ప్రపంచ ప్రఖ్యాత టైగర్ రిజర్వుగా పేరుంది.

అందుకే అటవీశాఖ అధికారి ఒకరు వ్యంగ్యంగా "మీరు తాజ్‌మహల్‌కు మరింత పాపులారిటీ తీసుకురాగలరా, మీరలా చేయగలరా?" అన్నారు.

Image copyright CORBETTNATIONALPARK

సాధారణంగా అడవుల్లో సాహసాలను ఎంజాయ్ చేసే బియర్ గ్రిల్స్ ఇక్కడ నుంచి కాస్త నిరాశగా వెనక్కు వెళ్లుంటారేమో అని నాకు అనిపిస్తోంది.

దేన్ని అన్వేషించాలనుకున్నారో, అలాంటి అడవి ఆయనకు దొరకలేదు.

తర్వాత నాకే, ఈ కార్యక్రమం షూటింగ్ కోసం భారతదేశంలో చాలా చక్కగా సరిపోయే ప్రాంతం ఏది? అనే మరో ఆలోచన కూడా వచ్చింది.

Image copyright AJAY SURI

బహుశా చంబల్‌ లోయలు దీనికి పక్కాగా సరిపోవచ్చు. ఈ లోయలు బియర్ గ్రిల్స్‌కు చూపించి ఉండాల్సింది.

సంక్లిష్టమైన చంబల్ లోయల్లోకి వెళ్లిన చాలా మంది ఆ చక్రవ్యూహం నుంచి బయటకు వచ్చే దారి గుర్తించలేకపోయారు.

అందుకే, దానిని 'మానవ భక్షకి' అంటారు. అయినా, అక్కడ ఇలాంటి వాళ్లెవరైనా చిక్కుకుపోతే, పాములు, కప్పలు తింటూ ఎన్నాళ్ళు జీవిస్తారులే!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు