కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం: 40 ఏళ్లకు ఒకసారి 48 రోజుల దర్శనం

  • 13 ఆగస్టు 2019
అత్తి వరదరాజ స్వామి గుడి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం అత్తి వరదరాజ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, పూజలు చేశారు.

గత కొన్ని రోజులుగా దేశ నలమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ గుడిని దర్శించుకుంటున్నారు. జులై 19 నాటికి కోటి 30 లక్షల మంది దర్శించుకున్నట్లు ఒక అంచనా.

ఇంతకీ అత్తి వరదరాజస్వామి గుడి ఎక్కడుంది? ఆ దేవాలయం ప్రత్యేకత ఏమిటి?

దేవాలయాల రాష్ట్రంగా పేరున్న తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదరాజస్వామి గుడి ఉంది. కాంచీపురంలో ఎన్నో దేవాలయాలున్నప్పటికీ ఈ గుడికి మాత్రం ఏంతో ప్రత్యేకత ఉంది.

అత్తి వరదరాజస్వామిని మహావిష్ణువు అవతారంగా భక్తులు విశ్వసిస్తుంటారు. స్థానికులు వరదరాజ పెరుమాళ్‌గా కొలుస్తుంటారు.

40 ఏళ్లకు ఒకసారి దర్శనం

అత్తి వరదరాజస్వామి 40 ఏళ్లకొకసారి భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత.

1979లో దర్శనమిచ్చిన స్వామి మళ్లీ ఈ ఏడాది జూన్‌ 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఆలయ కోనేటి గర్భంలో ఉండే అత్తి వరదస్వామి 40 ఏళ్లకు ఒకసారి అందునా 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు.

ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

స్వామి దర్శనమిచ్చే 48 రోజులలో తొలి 38 రోజుల పాటు శయన స్థితిలోనూ, మిగిలిన 10 రోజులు నిలబడినట్లు భక్తులకు దర్శనమిస్తారు.

ఈసారి జులై 1న నుంచి ప్రారంభమైన దర్శనం ఆగస్టు 17 వరకు ఉంటుంది.

Image copyright I&pr telangana/fb

అత్తి చెట్టుతో విగ్రహం.. కోనేటిలో భద్రంగా..

వరదరాజస్వామి విగ్రహాం అత్తి చెట్టుతో నిర్మితమైంది. 9 అడుగుల పొడవు ఉండే ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఆదేశంతో దేవశిల్పిగా పేరున్న విశ్వకర్మ తయారు చేసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.

16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన దండయాత్రలో ఈ దేవాలయం దోపిడీకి గురైందని, అయితే, ఆ సమయంలో విగ్రహాన్ని కాపాడేందుకు దానిని వెండి పెట్టెలో పెట్టి కోనేరులో భద్రపరిచారని స్థానికులు చెబుతుంటారు.

చెక్కు చెదరని విగ్రహం

మూలవిరాట్ లేకపోవడంతో వేరే విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించారు. కానీ, కొన్నాళ్ల తర్వాత కోనేరు ఎండిపోవడంతో వెండి పెట్టెలో పెట్టిన ప్రధాన విగ్రహం బయటపడింది.

అత్తితో చేసిన ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా చెక్కచెదరకపోవడంతో దాన్ని తిరిగి ప్రతిష్టించారు. తర్వాత 48 రోజుల పాటు క్రతువుల నిర్వహించి మళ్లీ కోనేరులో భద్రపరిచారు. తర్వాత ఇదో సంప్రదాయంగా మారింది.

అప్పటి నుంచి కోనేరులో భద్రపరిచిన విగ్రహాన్ని తిరిగి 40 ఏళ్లకు ఒకసారి తీసి 48 రోజుల పాటు ప్రతిష్టించి మళ్లీ కోనేరులో భద్రపరుస్తున్నారు.

ఇలా 1854 నుంచి చేస్తున్నట్లు అప్పటి వార్తా పత్రికల కథనాల ఆధారంగా తెలుస్తోంది. 1892, 1937, 1979లో చేసిన తర్వాత ఈ ఏడాదిలో మళ్లీ ఈ మహాక్రతువును నిర్వహించారు.

1977-78లో రాజగోపురం నిర్మాణ పనుల వల్ల ఈ క్రతువు రెండేళ్లు ఆలస్యం అయింది.

ఈ గుడికి సంబంధించి దాదాపు 362 వరకు రాత ప్రతులు లభించాయి. ఇందులో కొన్ని కాకతీయులు, తెలుగు చోళులకు చెందినవి కూడా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)