పింగళి వెంకయ్య: జాతీయ ప‌తాక రూప‌క‌ర్తకు త‌గిన గుర్తింపు ద‌క్క‌లేదా

  • 15 ఆగస్టు 2019
పింగళి వెంకయ్య

స్వ‌ాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న ప‌లువురు నేత‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. కానీ, కొంద‌రికి అలాంటి అవ‌కాశం ద‌క్క‌లేద‌నే ఆవేద‌న, విమర్శ వినిపిస్తుంటుంది. అలాంటి ఆవేదన పింగ‌ళి వెంక‌య్య అభిమానుల్లోనూ క‌నిపిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన స్వ‌ాతంత్ర్య స‌మ‌ర‌యోధుల్లో పింగ‌ళి వెంక‌య్య‌ ఒకరు. భారత జాతీయ ప‌తాక రూప‌క‌ర్త ఆయన. కానీ, అందుకు త‌గ్గ‌ట్టుగా వెంక‌య్య‌కు గౌర‌వం ద‌క్కిందా? అంటే ఆయ‌న స్వ‌గ్రామంలో కూడా అంద‌రూ పెద‌వి విరుస్తున్నారు.

పింగ‌ళి వెంక‌య్య కృష్ణా జిల్లా కూచిపూడి మండ‌లం భ‌ట్ల పెనుమ‌ర్రు గ్రామంలో జ‌న్మించారు. ఆ ఊరిలో ఆయన జ్ఞాప‌కార్ధం ఏదైనా ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ చూపించిన దాఖ‌లాలు లేవు.

చిత్రం శీర్షిక మహాత్మా గాంధీతో పింగళి వెంకయ్య (ఎడమ వైపున చివరి వ్యక్తి)

'జపాన్ వెంకయ్య'

సుదీర్ఘ‌కాలం పాటు స్వ‌ాతంత్ర్య‌ పోరాటంలో పాల్గొన్న పింగ‌ళి వెంక‌య్య బ‌హుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఆయ‌న అనేక దేశాల్లో ప‌ర్య‌టించారు. వివిధ భాష‌ల్లో ప్రావీణ్యం సంపాదించారు. చివ‌ర‌కు జప‌నీస్ భాష నేర్చుకోవ‌డం కోసం ప‌ట్టుద‌ల‌తో ఆ దేశం వెళ్లి వ‌చ్చిన వెంక‌య్య‌ను కొంత‌కాలం పాటు 'జ‌పాన్ వెంక‌య్య' అని కూడా పిలిచేవారు.

ఆ త‌ర్వాత వ్య‌వ‌సాయంలో కూడా అడుగుపెట్టి కొత్త పత్తి వంగ‌డాలు క‌నిపెట్టేందుకు పరిశోధన చేయడంతో ఆయనకు 'ప‌త్తి వెంక‌య్య' అన్న పేరు కూడా ఉండేది. వ‌జ్రాల‌పై కూడా ఆయన విశేష‌మైన పరిశీల‌న చేశారు.

చిత్రం శీర్షిక ఆఖరి రోజుల్లో పింగళి వెంకయ్య

అన్నింటికీ మించి 1921లో విజ‌య‌వాడలో జ‌రిగిన అఖిల భార‌త జాతీయ కాంగ్రెస్ మ‌హాస‌భ‌ల్లో పింగ‌ళి వెంక‌య్య కీల‌క భూమిక పోషించారు. ఆ సంద‌ర్భంగానే మ‌హాత్మా గాంధీ ప్ర‌తిపాద‌న‌తో రంగంలోకి దిగిన వెంక‌య్య, దేశ జాతీయ ప‌తాక రూప‌క‌ల్ప‌న‌కు శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా ప‌లుర‌కాల ప‌తాకాల‌ను రూపొందించ‌గా చివ‌ర‌కు త్రివ‌ర్ణ ప‌తాకం ఖాయమైంది. దాంతో, దేశ కీర్తిని చాటే మువ్వ‌న్న‌ెల జెండా రూప‌క‌ర్త‌గా పింగ‌ళి వెంక‌య్య చిర‌స్థాయిలో నిలిచిపోయింది.

అయితే, అనేక ర‌కాల విశిష్ట‌త‌లు క‌లిగిన వెంకయ్య‌కు సరైన స్థానం ద‌క్క‌లేద‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు.

'తెలుగు వ్యక్తి కావడం వల్లే గుర్తింపు రాలేదు'

భట్ల పెనుమ‌ర్రు గ్రామానికి చెందిన త్రిపుర‌నేని వెంక‌ట‌సుబ్బారావు బీబీసీతో మాట్లాడుతూ... "పింగ‌ళి వెంక‌య్య మా గ్రామ‌వాసి కావ‌డం పట్ల మాకు గ‌ర్వంగా ఉంది. అయితే, ఆయన చివ‌రి రోజుల్లో అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవడం మమ్మల్ని ఎంతో క‌ల‌చివేసింది. అమ్మ‌మ్మ ఇంట్లో జ‌న్మించిన పింగ‌ళి వెంక‌య్య బాల్యం మా గ్రామంలోనే గ‌డిచింది.

ఆ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికాలో గాంధీ ప‌రిచ‌యం, ఆయ‌న స్ఫూర్తి తోడుకావ‌డంతో స్వ‌ాతంత్ర్య స‌మ‌రంలో కీలక భూమిక పోషించారు. అయినా ఆయ‌నకు త‌గిన గుర్తింపు రాలేదు. ఆయన తెలుగు వ్యక్తి కాకుండా వేరే రాష్ట్రాల‌కు చెందిన వారు అయ్యుంటే, గుర్తింపు మరోలా ఉండేది. కానీ, ఆయ‌న విగ్ర‌హాన్ని పార్ల‌మెంటులో పెట్టాల‌న్న ప్రతిపాద‌న ముందుకు సాగ‌క‌పోవ‌డం, భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న డిమాండ్ కూడా నెర‌వేర‌క‌పోవ‌డం విచార‌క‌రం" అన్నారు.

భ‌ట్ల పెనుమ‌ర్రులో పింగ‌ళి వెంక‌య్య నివాసం ఉన్న వీధికి ఆయన పేరు పెట్టారు. గ్రామ‌స్థులంతా క‌లిసి ప్ర‌ధాన కూడ‌లిలో వెంక‌య్య విగ్ర‌హం ఏర్పాటు చేశారు. ఏటా జ‌యంతి, వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తుంటారు. గ్రామ‌స్థులే చందాలు వేసుకుని కోటి రూపాయ‌ల‌తో పింగ‌ళి వెంక‌య్య స్మారక భ‌వ‌నం నిర్మించారు. గ్రామస్థుల‌కు వివిధ కార్య‌క్ర‌మాల కోసం ఈ క‌మ్యూనిటీ హాల్ ఉపయోగపడుతోందని స్థానికుడు సంగిశెట్టి సాంబ‌శివ‌రావు చెప్పారు.

చేనేత కార్మికుడైన సాంబ‌శివ‌రావు 60 ఏళ్ల వ‌య‌సులో కూడా పింగ‌ళి వెంక‌య్య కీర్తిని చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాసిన పాట‌ను కూడా వినిపించారు. అంతేగాకుండా క‌మ్యూనిటీ హాల్ నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఉన్నారు.

లగడపాటి హామీ నెరవేరలేదు

బీబీసీతో మాట్లాడిన సంగిశెట్టి సాంబ‌శివ‌రావు... "పార్ల‌మెంట్‌లో క‌నీసం పింగ‌ళి వెంక‌య్య చిత్ర‌ప‌టాన్ని కూడా ఏర్పాటు చేయ‌డంలేదు. కొన్నేళ్ల క్రితం 'తిరంగా ర‌న్' పేరుతో నాటి పార్ల‌మెంటు స‌భ్యుడు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఇచ్చిన హామీలు కూడా నెర‌వేర‌డం లేదు. పింగ‌ళి వెంక‌య్య జ్ఞాప‌కార్థం గ్రామంలో కూడా ప్ర‌భుత్వం త‌రఫున ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు" అన్నారు.

పింగ‌ళి వెంక‌య్య ప్రాథమిక విద్యాభ్యాసం మోపిదేవి మండ‌లంలోని పెద క‌ళ్లేప‌ల్లిలో సాగింది. ఆయ‌న మేన‌మేమ చ‌ల్ల‌ప‌ల్లి రాజావారి సంస్థానంలో క‌ర‌ణం బాధ్య‌త‌ల రీత్యా పెద క‌ళ్లేప‌ల్లిలో ఉండ‌డంతో పింగ‌ళి వెంక‌య్య కూడా ఆయ‌న వెంట వెళ్లారు.

తమ ఊరిలో విద్యాభ్యాసం సాగించిన వెంక‌య్య ఘ‌న‌త‌ను చాటేందుకు ప్రభుత్వాలు క‌నీస ప్ర‌య‌త్నం కూడా లేక‌పోవ‌డం ప‌ట్ల పెద క‌ళ్లేప‌ల్లి వాసులు కూడా క‌ల‌త చెందుతున్నారు. సంగీత‌ రంగంలో పేరు ప్ర‌ఖ్యాతులు పొందిన సుస‌ర్ల ద‌క్షిణామూర్తి, వేటూరి ప్ర‌భాక‌ర శాస్త్రి, వేటూరి సుంద‌ర రామ్మూర్తి వంటి వారి స్వ‌గ్రామం కూడా పెద క‌ళ్లేప‌ల్లే కావ‌డం గ‌మ‌నార్హం.

పెద క‌ళ్లేప‌ల్లి వాసి గొర్రిపాటి పార్థ‌సార‌ధి బీబీసీతో మాట్లాడుతూ... "పింగ‌ళి వెంక‌య్య ప్ర‌స్థానం మా ఊరి నుంచే ప్రారంభ‌మైంది. ఆయ‌న ఎంతో ఘ‌న‌త సాధించిన‌ప్ప‌టికీ అందుకు త‌గ్గ‌ట్టుగా ఆయనకు గుర్తింపు దక్కలేదు. అలాంటి మ‌హానీయుడి సేవ‌లు అంద‌రికీ తెలిసేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి" అని అన్నారు.

చిత్రం శీర్షిక పింగళి వెంకయ్య వీధి

మచిలీపట్నంలో

పింగ‌ళి వెంక‌య్య ప్ర‌స్థానంలో మ‌చిలీప‌ట్నంలోని ఆంధ్ర జాతీయ క‌ళాశాల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ క‌ళాశాల‌లో ఆయ‌న అధ్యాప‌కుడిగా సేవ‌లు అందించారు. అందుకు గుర్తింపుగా మ‌చిలీప‌ట్నం మున్సిపాలిటీలో ఓ వీధికి ఆయ‌న పేరు పెట్టారు.

అంతేకాకుండా పింగ‌ళి వెంక‌య్య దేశానికి చేసిన సేవ‌ల‌ను ఈ త‌రానికి తెలియ‌జేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని నేష‌న‌ల్ కళాశాల క‌ర‌స్పాండెంట్ శార‌దాకుమారి తెలిపారు. బీబీసీతో ఆమె మాట్లాడుతూ... "నేటి తరానికి పింగ‌ళి వెంక‌య్య గురించి అవ‌గాహ‌న అవ‌స‌రం. అందుకే ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాం. వెంక‌య్య వంటి వారు ప‌నిచేసిన క‌ళాశాల‌లో చ‌దువుతున్న వారిలో ఆయ‌న స్ఫూర్తిని నింపే ప‌నిచేస్తున్నాం" అని ఆమె వివ‌రించారు.

చిత్రం శీర్షిక పింగళి వెంకయ్య మనుమడి భార్య సుశీల

మా తాతకు గుర్తింపు లేదు

పింగళి వెంక‌య్య కుటుంబీకులు సైతం ఆయ‌న‌కు తగిన గుర్తింపునిస్తే చాల‌ని కోరుతున్నారు. దేశానికి ఎంతో సేవ చేసి చివ‌రి రోజుల్లో ఆర్థికంగానూ స‌త‌మ‌త‌మైన పింగ‌ళి వెంక‌య్య‌ను భ‌విష్య‌త్ త‌రాలు సైతం గుర్తించుకునేలా ప్రభుత్వాలు చూడాలని ఆయ‌న మనుమడి భార్య పింగ‌ళి సుశీల కోరుతున్నారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ... దేశం కోసం ఎంతో సేవ చేసిన వారికి త‌గిన గుర్తింపు రాలేదు. పార్ల‌మెంట్‌లో ఆయ‌న విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌నే ప్ర‌తిపాద‌న ముందుకు సాగ‌డం లేదు. ఇప్ప‌టికైనా దాని మీద దృష్టి పెట్టాలి. మా తాతకు భార‌త‌ర‌త్న పురస్కారం కూడా ఇవ్వాలి. అప్పుడే ఆయ‌న సేవ‌ల‌కు త‌గిన స్థానం ఉంటుంది. మా కుటుంబం కోరుకునేది అదే" అన్నారు.

పింగ‌ళి వెంక‌య్య స్వ‌గ్రామం భ‌ట్ల పెనుమ‌ర్రుకి త‌గిన రోడ్డు సౌక‌ర్యం కూడా లేక‌పోవ‌డంతో గ్రామ‌స్థులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆయ‌న‌కు గుర్తింపు రాలేద‌నే ఆవేద‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం