కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుపై అరెస్టుకు ముందు జేకే పీపుల్స్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు షా ఫైజల్ ఏమన్నారు?

  • 14 ఆగస్టు 2019
షా పైజల్ Image copyright FACEBOOK/SHAH FAESAL

జమ్ము-కశ్మీర్ ఆర్టికల్-370 రద్దు చేయడంపై, దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడంపై మాట్లాడిన మాజీ ఐఏఎస్ అధికారి, జమ్ము-కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్(జేకేపీఎం) అధ్యక్షుడు షా ఫైజల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనను కూడా మిగతా రాజకీయ నాయకుల్లాగే తనను కూడా త్వరలో అరెస్టు చేస్తారేమో అని అంతకు ముందే 'బీబీసీ హార్డ్ టాక్‌'లో ఆయన అన్నారు. కశ్మీర్‌లో భయం నెలకొందని వ్యాఖ్యానించారు.

'బీబీసీ హార్డ్ టాక్‌' కార్యక్రమం ప్రజెంటర్ స్టీఫెన్ సైకర్ జమ్ము-కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ నేత షా ఫైజల్‌ను సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు.

కశ్మీర్‌లోని 80 లక్షల మంది గత కొన్నిరోజులుగా బందీల్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని 2009లో కశ్మీర్ నుంచి యూపీఎస్సీ టాపర్‌గా నిలిచిన షా ఫైజల్ చెప్పారు.

యుద్ధం లాంటి స్థితి

ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన షా ఫైజల్... "జమ్ము-కశ్మీర్లో గత కొన్ని రోజులుగా కర్ఫ్యూ ఉంది. కశ్మీర్‌లోని 80 లక్షల మంది ఇన్ని రోజులగా బందీల్లాంటి పరిస్థితిలో ఉన్నారు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. మార్కెట్ మూతపడింది. ఒక దగ్గర్నుంచి ఇంకోచోటుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంది. కమ్యూనికేషన్ సౌకర్యాలు పూర్తిగా ఆగిపోయాయి. టెలిఫోన్, మొబైల్ పనిచేయడం లేదు. బయట ఉంటున్న కశ్మీరీలు తమ కుటుంబాలతో మాట్లాడలేకపోతున్నారు. నిత్యావసరాల కొరత ఉంది. అసలు ఏం జరుగుతోందో ప్రజలకు తెలీడం లేదు. భద్రతాదళాలను భారీగా మోహరించారు. అక్కడ యుద్ధం లాంటి పరిస్థితి ఉంది. జనం తమ బంధువులను కూడా కలవలేకపోతున్నారు. వేర్పాటువాదులు, భారత మద్దతుదారులు అందరూ పోలీసుల అదుపులో ఉన్నారు."

"ఆగస్టు 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నేతల్లో నేనొక్కడినే పోలీసుల కస్టడీలో లేకుండా బయటున్నాను. నేను అక్కడినుంచి బయటికొచ్చాక పోలీసులు చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. కానీ నేను ఎయిర్‌పోర్టుకు, అక్కడినుంచి దిల్లీకి ఎలా చేరుకున్నానో అదంతా ఒక పెద్ద కథ. కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల వాళ్లు తమ సీనియర్లతో నేను అక్కడ్నుంచి బయటపడ్డాననే విషయం చెప్పలేకపోయారు. కానీ ఇక్కడ్నుంచి వెళ్లాక నన్ను కూడా మిగతావారిలాగే అదుపులోకి తీసుకుంటారని నాకు అనిపిస్తోంది."

Image copyright Getty Images

కశ్మీర్ నేతలందరూ అదుపులో ఉన్నారు

మీ పార్టీ కార్యకర్తలకు, కశ్మీర్ పౌరులకు మీరు ఏం సందేశం ఇస్తారు, మీరు దీన్ని భారత్ ఆక్రమణగా చెబుతున్నారు. అంటే జనం రోడ్ల మీదకు రావాలని మీరు కోరుకుంటున్నారా?

షా ఫైజల్: "మీరు చూడచ్చు, ఆగస్టు 5న ఏమైంది? ప్రధాన పార్టీల రాజకీయ నేతలందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలు, రాజకీయాలపై నమ్మకం ఉంచే నాలాంటి వారి గురించి ఎలాంటి చర్చా జరపకుండానే పార్లమెంటులో చట్టాన్ని ఆమోదించేశారు. ఇప్పటివరకూ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు సహా చాలా మంది నేతలు కస్టడీలో ఉన్నారు. ఇక, జన సమీకరణ విషయానికి వస్తే గత వారం నుంచి ఇక్కడ భద్రతాదళాలను ఎంత ఎక్కువగా మోహరించారంటే, వారిని చూస్తూ జనం నిరసన ప్రదర్శనలకు దిగడం అసాధ్యం."

Image copyright Getty Images

దీనిపై వ్యతిరేకత వస్తుంది

షా ఫైజల్: "కశ్మీరీలు శాంతియుతంగా ఉండాలని నేను అపీల్ చేస్తున్నా. కానీ భద్రతాదళాల మోహరింపులో కాస్త సడలింపు జరిగినా, అక్కడున్న జనం సహజంగానే దీనిని వ్యతిరేకిస్తారు. నాది, మిగతా కశ్మీరీ నేతలెవరి గొంతూ వినిపించదు. ఇప్పుడు అక్కడ చాలా భారీ సంఖ్యలో భద్రతాదళాలను మోహరించారు. వారి ముందుకెళ్లి ఇప్పుడు తమ గొంతు ఎవరు వినిపించగలరు? అయితే దీన్ని వ్యతిరేకించకుండా మాత్రం ఉండరనే అనిపిస్తోంది".

గత ఎన్నికల్లో చాలాసార్లు ఆర్టికల్ 370 రద్దు చేస్తామని బీజేపీ తమ మ్యానిఫెస్టోలో చెబుతూనే వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వానికి మెజారిటీ కూడా ఉంది. అలాంటప్పుడు దీన్ని తొలగించడం మీకు ఆశ్చర్యంగా ఎందుకు అనిపించింది?

పార్లమెంటులో రాజ్యాంగాన్ని హత్య చేశారు.

షా ఫైజల్: "భారత్‌ను ప్రపంచంలోనే అతిగొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెబుతారు. మోదీ అధికారంలో ఉన్నప్పటికీ, రాజ్యాంగ సంస్థలు మా హక్కుల్ని రక్షిస్తాయని మేం నమ్మాం. మాకు మేం సురక్షితంగా ఉన్నామని అనుకోడానికి కారణం అదే. అయితే దీన్ని అమలు చేసిన తీరు చూసి ఆశ్చర్యంగా అనిపించింది. మీరు రాష్ట్ర రాజ్యాంగ చరిత్ర, ఆర్టికల్ 370 గత 70 ఏళ్ల చరిత్రను తిరగేస్తే, రాజ్యాంగ ప్రక్రియను అమలు చేసి ఆర్టికల్ 370ని రద్దు చేయడం అసాధ్యం అనే విషయాన్ని రాజ్యాంగ నిపుణులందరూ ఏకీభవిస్తారు. అందుకే దీనిని ఉపసంహరించడం కోసం దేశ పార్లమెంటులో రాజ్యాంగాన్ని హత్య చేసి, పూర్తిగా చట్టవిరుద్ధ పద్ధతులను పాటించారు".

Image copyright Getty Images

పార్లమెంటులో మెజారిటీ గళం ఉండకూడదా

ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే తీర్మానం, జమ్ము-కశ్మీర్ పునర్వ్వస్థీకరణ బిల్లు రాజ్యసభ తర్వాత లోక్‌సభలో కూడా మెజారిటీ సభ్యుల ఆమోదం పొందింది కదా?

షా ఫైజల్: "భారత్‌లో అద్భుతమైన వైవిధ్యం ఉంది. దేశ పార్లమెంటులో 130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీలు మెజారిటీవారి గళంగా మారకూడదు. మన సమస్య అదే. ఇలాంటి స్థితిలో మైనారిటీల సమస్యలు ఎవరు వింటారు? రేపు వేరే ఏదైనా రాష్ట్రానికి కూడా ఇలాగే జరగొచ్చు. పార్లమెంటు ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దెబ్బతీసింది. నాకు తెలిసి దీనికి మెజారిటీ లభించలేదు. మేం దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తాం. చాలా పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి కూడా".

Image copyright Rstv

బీజేపీ ఎజెండా

కేంద్రపాలిత ప్రాంతం అయ్యాక జమ్ము-కశ్మీర్‌లో ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అక్కడ పెట్టుబడులు వస్తాయని, దాని ప్రయోజనాలు నేరుగా ప్రజలకే అందుతాయన్నారు?

షా ఫైజల్: "ఆర్టికల్ 370 రద్దు చేయడం చుట్టూ ఒక తప్పుడు కథను అల్లుతున్నట్టు నాకు అనిపిస్తోంది. జమ్ము-కశ్మీర్ అభివృద్ధి ఇండెక్స్‌ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది. జనన-మరణ రేటు సహా చాలా విషయాల్లో జమ్ము-కశ్మీర్ దేశంలోని చాలా రాష్ట్రాలకంటే ఎంతో ముందుంది".

"ఆర్టికల్ 370 భూసంస్కరణల్లో భద్రతకు గ్యారంటీ ఉండేది. అక్కడున్న అలాంటి భూసంస్కరణలు, దేశంలోని వేరే ఏ రాష్ట్రంలో కనిపించలేదు. కానీ అదంతా బీజేపీ ఎజెండా కిందికి వస్తుంది. అదే 'ఒకే విధానం, ఒకే నాయకుడు, ఒకే రాజ్యాంగం, ఒకే రాష్ట్రపతి, ఒకే ప్రధాన మంత్రి'. అందర్నీ ఒకే రంగులో ముంచేందుకే ఈ ఆలోచన, ఇందులో వైవిధ్యం లోపించింది. వారికి మైనారిటీలను, వైవిధ్యాన్ని, భిన్న సంస్కృతులను గౌరవించడం తెలీదు. ముఖ్యంగా ముస్లింలంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ దాన్నే ఉపయోగించారు".

Image copyright Pti

నేను తోలుబొమ్మను కాను

మీరు వేర్పాటువాదాన్ని వ్యతిరేకించారు. సమస్యల పరిష్కారం కోసం చర్చల మార్గంలో వెళ్లాలని చెప్పేవారు?

షా ఫైజల్: "నాకే కాదు, చర్చలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్న అందరి ఆలోచనలకు ఇప్పుడు తెరపడింది. ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌లో రాజకీయం చేయడానికి రెండు రకాల పద్ధతులున్నాయి. ఒకటి మనం తోలుబొమ్మ కావడం, లేదా వేర్పాటువాదిగా మారడం. జనం రాజకీయాలు చేసే పద్ధతి ఇక మారిపోతుంది. నేను తోలుబొమ్మ కావడం లేదు. మొదట మా తాతముత్తాతలను మోసం చేశారు, ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నారు".

Image copyright FACEBOOK/SHAH FAESAL

ఆగస్టు 5న మమ్మల్ని కించపరిచారు

సివిల్ సర్వీస్ పరీక్షల్లో పాస్ అయిన మీరు చాలా ఏళ్లు అధికారిగా పనిచేశారు. వేర్పాటువాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. స్వచ్ఛమైన నీరు, మౌలిక వసతులు, అభివృద్ధి గురించి మాట్లాడేవారు. మీరు చేసింది తప్పని ఇప్పుడు మీకు అనిపిస్తోందా?

షా ఫైజల్: "అనిపిస్తోంది. మేం ఇన్నిరోజులూ ప్రజలకు తప్పుడు ప్రొడక్ట్ అమ్మడానికి ప్రయత్నించామని ప్రపంచం ముందు నేను అంగీకరిస్తున్నాను. కశ్మీరీ భాగస్వాముల్లో ఎవరి విశ్వాసాలనూ పట్టించుకోకుండా రాజ్యాంగంలో మార్పులు చేసి, 2019 ఆగస్టు 5న మమ్మల్ని కించపరిచారు. భారీగా సైనికులను మోహరించి ప్రజలను ఇళ్లలో బంధించారు. వారి గొంతు వినిపించకుండా అణచివేశారు. మోదీ కశ్మీరీల అభిప్రాయం తెలుసుకోకుండానే వారిపై తన ఎజెండాను రుద్దారు.

Image copyright Getty Images

వేర్పాటువాదమా-తీవ్రవాదమా

మీరు అతివాదాన్ని సమర్థిస్తారా?

షా ఫైజల్: నేను అహింసను నమ్ముతాను. కశ్మీర్‌లో అహింసా పద్ధతిలో రాజకీయ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభిస్తాం. దానికి చాలా సమయం పడుతుంది. కానీ, ప్రపంచమంతా అహింసా పద్ధతిలో చేసిన నిరసనలే విజయవంతం అవుతూ వచ్చాయి. నేను కూడా అదే మార్గంలో నడుస్తాను.

Image copyright Getty Images

ఇప్పటివరకూ మీరు మాట్లాడిన భాష, వేర్పాటువాదుల్లాగే అనిపిస్తోంది?

షా ఫైజల్: "ఎవరు ప్రధాన రాజకీయ నాయకులు, ఎవరు వేర్పాటు వాదులు అనేది భారత ప్రభుత్వమే నరేట్ చేస్తుంది. మనం చట్టప్రకారం మాట్లాడాలంటే భారత రాజ్యాంగాన్ని అంగీకరించని వారు వేర్పాటువాదులు. వారితో జనం భారీ సంఖ్యలో ఉన్నారు. ఇంకోవైపు ఇన్న వారు అక్కడ రాజకీయాలు చేస్తున్నారు. మాలాంటి వారు అక్కడ ప్రధాన రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు కశ్మీర్ రాజకీయాల్లో అలాంటి అన్ని అర్థాలూ మారిపోతాయి. నేను పరిష్కారం పక్షాన ఉంటాను. కశ్మీర్లో శాంతిని చూడాలని అనుకుంటున్నాను".

Image copyright Getty Images

మీ నాన్న మిలిటెంట్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయని మీరు భావిస్తున్నారా?

షా ఫైజల్: "గత 30 ఏళ్లలో మిలిటెంట్ ఘటనల్లో వేలమంది చనిపోయారు. మిలిటెన్సీ వల్ల మూడు తరాలు నాశనం అయ్యాయి. ముందు తరాలవారు కూడా తీవ్రవాదం వైపు వెళ్లడం నేను చూడాలనుకోవడం లేదు. కశ్మీరీలు కూడా జపనీయుల్లా తమకు తాము ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి. తమ ఆలోచనలను, తమ ఇళ్లను, తమ మనసులను కొత్తగా సిద్ధం చేసుకోవాలి. ఏది నాశనమైనా దానిని మళ్లీ నిర్మించుకోవాలి".

Image copyright Getty Images

ప్రపంచం మానవహక్కుల ఉల్లంఘనపై దృష్టిపెట్టాలి

ఇమ్రాన్ ఖాన్ దీనిని నాజీలతో పోలుస్తున్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలు, ఐక్యరాజ్యసమితి కూడా దీనిపై చాలా వరకూ మౌనంగా ఉన్నాయి. మీరు పాకిస్తాన్ సాయం పొందాలనుకుంటారా, లేక మిగతా ప్రపంచం అండ కోరుకుంటారా?

షా ఫైజల్: "దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన స్పందన నన్ను చాలా నిరాశకు గురిచేసింది. మూడు అణ్వస్త్ర దేశాలు కశ్మీర్‌ను మాదని చెప్పుకుంటున్నాయి. ఇది న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్. ప్రపంచంలోని పెద్ద దేశాలు దీన్నిలా వదిలేయకూడదు. దీనిపై దృష్టి పెట్టాలి. ఈ ప్రాంతంలో ఈ మూడు దేశాలు అణు యుద్ధానికి దిగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను గమనించాలి".

మీరు ఈ మొత్తం అంశంలో పాక్ సాయం తీసుకుంటారా?

షా ఫైజల్: "పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 70 ఏళ్లలో భారత్-పాకిస్తాన్ కశ్మీర్ అంశానికి పరిష్కారం గుర్తించలేకపోయాయి. ఇప్పుడు ఇందులో అంతర్జాతీయ జోక్యానికి సమయం వచ్చింది. కశ్మీర్లో శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ సమాజం ఈ రెండు దేశాలకు సాయం చేయాలి. కశ్మీరీల గళం వినాలి".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు