'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను నియమిస్తాం' -పంద్రాగస్టు ప్రసంగంలో ప్రకటించిన మోదీ

 • 15 ఆగస్టు 2019
ప్రధాని మోదీ Image copyright DD News

దేశ ప్రజల ఆకాంక్షల మేరకే 370 అధికరణ రద్దు చేశామని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగరవేసిన అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాలు తీసుకురావాలని, ఆ నేపథ్యంలోనే ఆర్టికల్ 370, 35ఏను రద్దు చేశామని చెప్పారు. రాజ్యాంగస్ఫూర్తితో ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని తెలిపారు.

త్వరలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమిస్తామని ప్రకటించారు. భారత త్రివిద దళాలు ఆర్మీ, నేవి, ఏయిర్ ఫోర్స్ కార్యకలాపాలను ఈ కొత్త వ్యవస్థ సమన్వయపరుస్తుందని చెప్పారు.

''ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం. అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదు. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మాకు అధికారం ఇచ్చారు. అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన 10 వారాల్లోనే ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నాం. వ్యవస్థలను గాడిలో పెట్టాం, వేగవంతంగా పనిచేస్తున్నాం. సర్దార్ పటేల్ ఆకాంక్షలను నెరవేర్చాం'' అని పేర్కొన్నారు.

అధికారంలోకి రాగానే సాగునీటి వనరుల అభివృద్ధికి కొత్తగా జలశక్తి అభియాన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. వైద్య రంగంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.

ట్రిపుల్ తలాక్‌ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు సాధికారత కల్పించామని.. 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించామని మోదీ చెప్పారు.

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూమిని కాపాడడానికి ప్రయత్నించాలని అన్నారు. రైతులు 30 నుంచి 40 శాతం వరకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు.

Image copyright DD News

ప్రధాని ప్రసంగంలోని కీలకాంశాలు

 • ఆర్టికల్ 370తో ఒకే దేశం, ఒకే రాజ్యాంగం.. జీఎస్టీతో ఒకే దేశం ఒకే పన్ను అమలులోకి వచ్చింది. త్వరలో దేశమంతా ఒకే గ్రిడ్ ఏర్పాటు చేస్తాం.
 • 370 అధికరణ రద్దుతో పటేల్ కలను సాకారం చేసినట్లైంది.
 • ఆయుష్మాన్ భారత ప్రజలకు వరంలాందిటి. వైద్యాన్ని ప్రతి సామాన్యుడికీ అందుబాటులోకి తేవాలన్నదే మా లక్ష్యం.
 • వచ్చే ఐదేళ్లలో లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకువెళుతాం.
 • రెండోసారి అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నాం.
 • తలాక్‌ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు సాధికారత కల్పించాం.
 • సుస్థిరమైన ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతంది. అవినీతిని పారదోలేందుకే మొదటి నుంచీ కృషి చేస్తున్నాం.
 • ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలి.
 • దేశంలో మౌలిక వసతుల కల్పనకు వంద లక్షల కోట్లు అవసరం.
 • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో విదేశీలయు విశ్వాసం పొందగలిగాం. పెట్టుబడులు తీసుకొచ్చాం.
 • గత ఐదేళ్లలో దేశాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చాం.

‘ఉపాధి కల్పన ప్రస్తావన ఏది?’

ప్రధాని ప్రసంగం అంతా బీజేపీ పాలనలో సాధించామని చెబుతున్న అభివృద్ధి గురించే సాగిందని , సాధించ లేకపోయిన వాటి గురించి ప్రస్తావన లేదని సీనియర్ పాత్రికేయులు జింకా నాగరాజు అన్నారు.

ప్రధాన మంత్రి ఎర్రకోట ప్రసంగంపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మోదీ ఎర్రకోట ప్రసంగం కాస్త సుదీర్ఘంగా బాగానే ఉంది. 70 ఏళ్లలో చేయని వాటిని తమ ప్రభుత్వం 70 రోజులలో చేసినట్లు చెబుతున్నారు. అభివృద్ధి జరిగినట్లు చెబుతున్నారు. కానీ, ఉపాధి కల్పనతోనే అసలైన అభివృద్ధి సాధ్యం. ప్రస్తుతం ఉద్యోగాలు పెరగడం లేదు. ఆటో, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని వారం రోజులుగా మీడియా రాస్తూ ఉంది. ఉద్యోగాలు లేకుండా ప్రగతి సాధ్యం కాదు. భారత్ వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కావాలంటే ఉపాధి అందునా నికరమయిన ఉపాధి పెరగాలి. దీనికోసం ఇంతవరకు పెద్ద ప్రయత్నం జరగలేదు. ప్రధాని ప్రసంగంలో సాధించామని చెబుతున్న జాబితా అర్థవంతమయ్యేది ఉపాధి కల్పన తోనే. మోడీ 2.0 ప్రభుత్వం తక్షణం దృష్టి నిలపాల్సింది ఉపాధి మీద’’ అని పేర్కొన్నారు.

'దేశభక్తిని ప్రేరేపించారు'

ప్రధాని నరేంద్రమోదీ 73 వ స్వాతంత్ర్యదినోత్సవ సందేశంలో దేశభక్తిని ప్రేరేపించే ప్రసంగం చేశారని కేంద్ర మాజీ సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అభిప్రాయపడ్డారు.

"అన్ని వర్గాల గురించి ఏదో ఒక ఆశాజనకమైన సందేశం ఇచ్చారు. ఆర్థిక రంగంలో సంక్షోభ పరిస్థితిని గురించి ప్రస్తావించకుండా రాబోయే కాలంలో 5 ట్రిలియన్ రూపాయల ప్రణాళిక తెస్తామని హామీ ఇచ్చారు. 70 సంవత్సరాలలో 2 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తే గత అయిదేళ్లలో దాన్ని 3 ట్రిలియన్లకు పెంచామన్నారు.

ప్రధాని ప్రసంగంలో ప్రాధాన్యం జమ్ము, కశ్మీర్‌కు దక్కింది. 370 తొలగింపు గురించి సగర్వంగా చెప్పుకున్నారు. విమర్శకులు ఎంత రాద్ధాంతం చేసినా ఆర్టికల్స్ 370, 35ఎ తొలగింపు వల్ల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని చెప్పడానికి ప్రయత్నించారు. వీటి తొలగింపు వల్లభ్‌భాయ్ పటేల కల అని చెప్పారు. గాంధీని, అంబేద్కర్‌ను స్మరిస్తూ స్వతంత్రంకోసం పోరాడిన అమరులకు నివాళులర్పించారు. మిగిలిన జాతీయ నాయకులను జాగ్రత్తగా వదిలేశారు.

ప్రధానమైన ప్రకటన... రక్షణ దళాల సిబ్బందికి కొత్త నాయకత్వం కోసం ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు. ఈ వ్యవస్థతో యుద్ధనీతిపైన, రక్షణ వ్యవహరాలపైన సమగ్రమైన సమాచారం అందించడానికి వీలవుతుంది. సైన్యంలో జీతభత్యాలపైన, అధికారుల అనవసర ఆధిపత్యంపైన అసహనాన్ని కూడా ఈ వ్యవస్థ దూరం చేస్తే మన సైనిక దళాలు మరింత ఉత్సాహంగా పనిచేస్తాయి, పటిష్టమవుతాయి.

ఒకే దేశం-ఒకే రాజ్యాంగం, ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు.

అయితే ప్రసంగంలో అధికారాల కేంద్రీకరణ వాసనలు చాలా ప్రగాఢంగా కనిపించాయి. రాష్ట్రాల ప్రమేయాన్ని, అన్ని పక్షాల ఆలోచనలను కలుపుకునిపోయే లక్షణాన్ని కూడా ప్రకటిస్తే బాగుండేదనిపించింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి సాధించే ప్రగతి లక్ష్యాలను నిర్దేశించారాయన. అంతా కలిసి ఆ సమున్నత లక్ష్యాల కోసం పనిచేయాలన్నారే గాని, దానికి సంబంధించిన ప్రణాళిక విషయమై వాగ్దానాలు లేవు. బహుశా తరువాత రూపొందిస్తారేమో చూడాలి.

చాలా అద్భుతంగా తయారు చేసిన ప్రసంగాన్ని అంతే ప్రభావవంతంగా ప్రజల ముందుంచే ప్రతిభ మన ప్రధానిది" అని శ్రీధర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

విషపూరిత కప్పలు... వాటిని నేర్పుగా తినే ఎలుకలు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి