కశ్మీర్: మోదీ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి దేశంలో విస్తృతంగా మద్దతు ఎందుకు లభిస్తోంది?

  • 16 ఆగస్టు 2019
టీవీలో మోదీ Image copyright EPA

భారత నియంత్రణలో ఉన్న కశ్మీర్ భూభాగానికి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలన్న తమ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం నాడు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. భారతదేశంలో కశ్మీర్ పట్ల ప్రజల అభిప్రాయాలు కఠినంగా మారడం వల్ల అలాంటి నిర్ణయం తీసుకోవడానికి అనువైన వాతావరణం ఏర్పడిందని దిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో డిస్టింగ్విష్డ్ ఫెలోగా ఉన్న అశోక్ మాలిక్ విశ్లేషిస్తున్నారు.

2016 జూలైలో బుర్హాన్ వాని అనే మిలిటెంట్ నాయకుడిని భారత సాయుధ బలగాలు ఓ చొరబాటు వ్యతిరేక ఆపరేషన్‌లో చంపటంతో కశ్మీర్ లోయ భగ్గుమంది.

వాని మరణానంతరం చెలరేగిన హింస కశ్మీర్‌ అశాంతిలో కొత్త దశకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆజాదీ (స్వాతంత్ర్యం) పెనుకేకలు జిహాద్ పిలుపులను మించిపోయాయి.

ఇది మరింత స్వతంత్ర కశ్మీర్ కోసమో, పాకిస్తాన్‌లో కలపటం కోసమో ఇచ్చిన పిలుపు కాదు, కలీఫా కోసం పిలుపు. ఆ నినాదాలు, వీడియోలు, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు, ఆ తరహా సంస్థల దృశ్యాలు.. కశ్మీర్‌లోని చాలా మంది యువత మీద గణనీయ ప్రభావం చూపించటం మొదలైంది.

2016 సంఘటనల ప్రభావం మరో విధంగా కూడా ఉంది. కశ్మీరీ వేర్పాటువాదం.. భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో వామపక్ష విభాగాల సారథ్యంలో సాగిన ప్రదర్శనలు, మీడియా చర్చలు, బహిరంగ వేదికల్లోకి.. తీవ్రతను తీసుకువచ్చాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionశ్రీనగర్‌లో కర్ఫ్యూపై ప్రభుత్వం మాటేంటి? పోలీసులు ఏం చెప్పారు?

చారిత్రకంగా చూసినపుడు, కశ్మీర్ సమస్య అనేది భారతీయ ముస్లిం వివాదంగా లేదు. కశ్మీరీలు వారు హిందువులైనా, ముస్లింలైనా తాము మిగతా భారతీయులందరికన్నా చాలా భిన్నమైన వారిమని భావిస్తారు.

ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న, పనిచేస్తున్న యువ కశ్మీరీ ముస్లింల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్యాంపస్ రాజకీయాల్లో కశ్మీరీ ముస్లింలు ఒక భాగంగా మారారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థల్లో వారు విద్యార్థి సంఘాల నాయకులుగా ఎన్నికవుతున్నారు. వీరు సుదూర ప్రాంతాలైన కేరళ, గోవాల్లో కూడా పనిచేస్తూ కనిపిస్తున్నారు. ఈ మార్పు మిశ్రమ ప్రయోజనాలకు దారితీసినట్లు నిరూపితమైంది.

ఈ పరిణామం యువ కశ్మీరీలను భారతదేశ భిన్నత్వానికి, ఆర్థిక అవకాశాలకు పరిచయం చేయటంతో పాటు వారిలో దేశం పట్ల అనుబంధాన్ని మరింత పెంచుతుందని భారత రాజ్యం ఆశించి ఉండవచ్చు.

అది కొంత మేరకు జరిగింది. అయితే, అతివాద వామపక్ష భావాలతో వేర్పాటువాద ఆలోచనలు కలవటానికి, అలాగే చిన్న వర్గమే అయినా ప్రభావవంతమైన ముస్లిం యువతతో కలవటానికి కూడా ఇది అవకాశం కల్పించింది. 2016 తర్వాత ఈ విభిన్న బృందాలను కలిపిన దారం... మోదీ పట్ల వ్యతిరేకత, భారత రాజ్యం పట్ల వ్యతిరేకత. వారి ఊహలో ఇవి రెండూ ఒక్కటిగా మారాయి.

Image copyright AFP

అయిత, ఈ పరిణామం మిగతా భారతదేశ ప్రజాభిప్రాయం మీద ప్రతికూల ప్రభావానికి దారితీసింది.

మోదీని దుష్టుడిగా చిత్రీకరిస్తుండటం ఒక్కటే దీనికి కారణం కాదు. ప్రధానమంత్రి మోదీకి వ్యక్తిగత ప్రజాదరణ ఉన్నప్పటికీ... ఈ సంక్లిష్ట దృగ్విషయాన్ని ఒక వ్యక్తికి కుదించడమన్నది అతిగా సూక్ష్మీకరించడమే అవుతుంది.

కశ్మీర్‌ ''బాధిత ప్రాంతం''గా ఉండటం, కశ్మీరీ వేర్పాటువాద పోకడలు, కశ్మీర్‌లో హింసాత్మక వీధి నిరసనలు, కశ్మీర్ సంబంధిత ఉగ్రవాదం అన్నీ కలిసి కశ్మీరీ రాజకీయ నాయకుల మీద ప్రజల్లో అసహనం చరిత్రాత్మక ఉచ్ఛస్థితికి చేరుకోవటం వల్ల ఇది జరిగింది.

కశ్మీర్‌ ఒక సంఘర్షణ ప్రాంతంగా (ఇంకా పొడిగిస్తే పాకిస్తాన్) జరిగే సంవాదం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందనే విషయాన్ని సరిగా అవగాహన చేసుకోలేదు.

Image copyright AMBEDKAR VICHAR MANCH
చిత్రం శీర్షిక ఆర్టికల్ 370ని రద్దు చేయటం పట్ల చాలా మంది భారతీయులు సంబరాలు జరుపుకున్నారు

ఇందుకు రెండు కారణాలున్నాయి:

  • కశ్మీర్ లోయలో కానీ, భారతదేశంలోని ఇతర రాజకీయ కార్యక్రమాల్లో కానీ కశ్మీర్ తిరుగుబాటును, భారత వ్యతిరేక నినాదాలను టెలివిజన్, సోషల్ మీడియాలు ప్రభావవంతంగా వ్యాపింపజేశాయి. ఇది ఒక వ్యతిరేకతను, ప్రతిచర్యను సృష్టించింది. కశ్మీర్ వెలుపల క్యాంపస్‌లలోను, ఇతర వేదికల్లోను ఉదార వామపక్ష సంవాదంలోకి వేర్పాటువాద రాజకీయాలు విస్తరించటం వల్ల ఆజాదీ (స్వాతంత్ర్యం) వాదులకు కొత్త మిత్రులు లభించగా, వారితో ఏకీభవిస్తున్న శ్రోతలు, ప్రేక్షకులకు కూడా వారిని పరిచయం చేసింది.
  • 1990ల వరకూ భారత భద్రతా బలగాలు.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్-జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో మావోయిజం; అసోం, మణిపూర్, నాగాలాండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లలో వేర్పాటువాదం తదితర సజీవ, క్రియాశీల అంతర్గత సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఈ అంశాల్లో చాలా వరకూ బలవంతపు స్తబ్దత, సుస్థిరత నెలకొంది. కానీ కశ్మీర్ దీనికి మినహాయింపుగా మిగిలింది. సైనిక, పారామిలటరీ బలగాలకు ప్రతి ఏటా ప్రభుత్వం ఇచ్చే సాహస పతకాల్లో ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్లు, పాకిస్తాన్ సరిహద్దు వెంట ఆపరేషన్లకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం దీనిని ప్రతిబింబిస్తోంది.

ఈ రెండు అంశాలు కశ్మీర్‌ను చాలా లోతైన అసాధారణ తీవ్రత కలిగిన అఖిల భారత అంశంగా మార్చాయి. ఈ విషయం పలు సందర్భాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

2019 ఫిబ్రవరిలో భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, పాకిస్తాన్ నియంత్రణలోని కశ్మీర్‌ గగనతలంలో ఇరు దేశాల యుద్ధ విమానాలతో దగ్గరగా జరిగిన పోరాటం తర్వాత యుద్ధ విమానం నుంచి పారాచూట్ సాయంతో బయటపడ్డారు. ఆ వెంటనే ఆయనను పాకిస్తాన్ సైన్యం నిర్బంధించింది.

మార్చి ఒకటో తేదీన ఆయనను విడుదల చేసి భారతదేశానికి పంపించారు. భారతదేశానికి దక్షిణంగా సుదూరంలో ఉన్న రాష్ట్రం కేరళలో సైతం.. అభినందన్‌ను విడుదల చేసిన దృశ్యం ఆ పక్షం రోజుల్లో రోజు వారీ సీరియళ్లను సైతం తలదన్నుతూ అత్యధిక టెలివిజన్ రేటింగ్ సాధించిందని ఆ రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.

ఇక పుల్వామా ఆత్మాహుతి దాడి మరింత విస్పష్టమైన దృష్టాంతం.

అభినందన్ వర్ధమాన్ ఉదంతానికి రెండు వారాల ముందు ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కశ్మీర్ లోయలో జరిగిన ఈ దాడిలో పారామిలటరీ సీఆర్‌పీఎఫ్ బలగానికి చెందిన 40 మంది చనిపోయారు. చనిపోయిన జవాన్లలో పశ్చిమాన ఉత్తర ప్రదేశ్ మొదలుకుని ఈశాన్యంలో అసోం, దక్షిణాన కర్నాటక వరకూ దేశంలోని 16 వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వారి భౌతిక కాయాలకు కన్నీళ్లతో భావోద్వేగపూరిత అంత్యక్రియలు నిర్వహించారు.

నెమ్మదిగా బలంగా కశ్మీర్ పట్ల కఠినమైన భావజాలం భారతదేశమంతటా వేళ్లూనుకుంది.

బాధిత ప్రాంతంగా ఉండటం, హింస, బెదిరింపులు, రుగ్మతల ఆవర్తనంగా పరిగణించే కశ్మీర్‌లో యధాతథ స్థితి పట్ల నైరాశ్యం దీనిని మరింతగా పెంచింది.

రాజకీయంగా అది ఎంత దుందుడుకు పనైనా కానీ పాత మార్గాన్ని విడిచి కొత్త ప్రారంభాన్ని ఇవ్వటానికి ఒక సారవంతమైన భూమిక ఏర్పడింది.

(సౌజన్యం: అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం