తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని ప్రకటించిన కేసీఆర్ -ప్రెస్ రివ్యూ

  • 16 ఆగస్టు 2019
Image copyright trspartyonline/twitter

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తేనున్నట్లు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతనా లేకుండా సేవలందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకొంటోందని కేసీఆర్ తెలిపారు. త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని సీఎం పేర్కొన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

రాష్ట్ర సంపద ఐదేళ్లలో రెట్టింపైందని, ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్ల నుంచి 1.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. ఉద్యోగావకాశాలు స్థానికులకే ఎక్కువగా దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.

Image copyright YSRCParty/twitter

వ్యవస్థను మార్చేందుకే నవరత్నాలు

అవినీతి, దళారీలు, సామాజిక-ఆర్థిక- రాజకీయ వెనకబాటుతనంతో కునారిల్లుతున్న వ్యవస్థను మార్చుకోవాలన్న కృత నిశ్చయంతోనే తమ ప్రభుత్వం 'నవరత్నాలు' ప్రకటించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం రాసింది.

నవరత్నాల పథకాల ద్వారానే వ్యవస్థలో సత్వర మార్పు సాధ్యమవుతుందని విజయవాడలోని ఇందిగారాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సీఎం జగన్ చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు పెద్ద పీట వేస్తూ తొలి బడ్జెట్‌ సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు.

మద్య నియంత్రణలో భాగంగా బెల్ట్‌ షాపులన్నింటినీ మూయిస్తున్నామని, అక్టోబర్‌ 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నామని జగన్ వివరించారు. కౌలు రైతులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేలా చట్టం చేసినట్లు వివరించారు.

చిత్రం శీర్షిక పోలవరం స్పిల్ వే నిర్మాణ పనులు (పాత చిత్రం)

రేపు పోలవరానికి రివర్స్ టెండర్లు

పోలవరం సాగునీటి ప్రాజెక్టు, జల విద్యుత్కేంద్రాన్ని కలిపి ఒకే యూనిట్‌గా శనివారం ఏపీ ప్రభుత్వం రివర్స్‌ టెండర్‌ పిలవనున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త రాసింది.

విద్యుత్కేంద్రానికి రూ.3,220.22 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులో మిగిలిపోయిన కాంక్రీట్‌ పనులు, గేట్ల తయారీ, బిగింపు పనులకు కలిపి రూ.1850 కోట్లు.. మొత్తంగా రూ.5,070.22 కోట్లకు ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.

ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్‌, బెకమ్‌ సంస్థలకు ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబు ప్రీక్లోజర్‌ నోటీసు జారీచేశారు. ఈ నోటీసులకు ఆ సంస్థల నుం చి సమాధానాలు వచ్చాయి. తాము గతంలో చేసేందుకు అంగీకరించిన రూ.387.56 కోట్లలో 5 శాతం డిస్కౌంట్‌ ఇచ్చి రూ.368.19 కోట్లకు గేట్ల తయారీ, బిగింపు పనులు చేపట్టేందుకు సిద్ధమేనని బెకమ్‌ వెల్లడించింది.

పోలవరం సాగునీటి పనుల్లో మిగిలిన పనుల ధరలనే ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌ (ఐబీఎం)గా తీసుకున్నారు. విద్యుత్‌ ప్రాజెక్టుకూ గతంలో పిలిచిన టెండర్‌ ధరనే ఐబీఎంగా తీసుకుని బిడ్‌లను పిలుస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో Image copyright hmrl.co.in

హైదరాబాద్ మెట్రో రికార్డ్..

హైదరాబాద్ మెట్రోలో బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 3.06 లక్షల మంది ప్రయాణించినట్లు ఈనాడు దినపత్రిక వార్త రాసింది.

మెట్రో ప్రారంభం తర్వాత ప్రయాణికుల సంఖ్యా పరంగా బుధవారం ఈ రికార్డు నమోదైంది. గత జూన్‌ 22న మెట్రోలో 2.89 లక్షల మంది ప్రయాణించారు. ఇదివరకు ఇదే అత్యధికంగా ఉండేది.

మెట్రో రెండు మార్గాల్లో 50 మెట్రోస్టేషన్లు ఉన్నాయి. హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ ప్రయాణికుల రద్దీ పరంగా మొదటి స్థానంలో ఉంది. బుధవారం హైటెక్‌సిటీలో 23,607 మంది ఎక్కగా.. 18,125 మంది దిగారు. అమీర్‌పేటలో 20,841 మంది ఎక్కితే 18,284 మంది దిగారు. మెట్రోలో 1.69 లక్షల మంది మెట్రో కార్డుపైన, 1.37 లక్షల మంది టోకెన్ల ద్వారా ప్రయాణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు