మోదీ ప్రభుత్వానికి లక్ష కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ సాధ్యమేనా?

  • 17 ఆగస్టు 2019
నరేంద్ర మోదీ Image copyright Getty Images

2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.05 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అందుకోసం, ఇప్పటికే 24 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబుడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

ప్రధానంగా భారీగా నష్టాలను ఎదుర్కొంటున్న కొన్ని సంస్థలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరికొన్ని సంస్థల్లో ప్రభుత్వం తన వాటాల్లో కొంతభాగాన్ని అమ్మనుంది.

నిజానికి, ప్రైవేటీకరణ కూడా పెట్టుబడుల ఉపసంహరణ కిందకే వస్తుంది. కానీ, ప్రైవేటీకరణలో సంస్థ యాజమాన్య నియంత్రణను ప్రభుత్వం కోల్పోతుంది. అంటే, ఆ కంపెనీలో 51 శాతానికి పైగా వాటాను ప్రభుత్వం ప్రైవేటు కొనుగోలుదారులకు విక్రయిస్తుంది.

సాధారణ పెట్టుబడుల ఉపసంహరణలో అయితే ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని అమ్మేస్తుంది కానీ, సంస్థ యాజమాన్య నియంత్రణ తన చేతిలోనే ఉండేలా చూస్తుంది. అంటే, ఆ సంస్థలో 51 శాతానికి పైగా వాటా ప్రభుత్వం చేతుల్లో ఉంటుందన్నమాట.

బడ్జెట్‌ లోటును తగ్గించేందుకు, సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఇలా నిధులు సమకూర్చుకుంటుంది.

మరి, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా మోదీ ప్రభుత్వం అంత భారీ మొత్తంలో నిధులను సమకూర్చుకోగలదా? ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనుకుంటోంది?

గత రెండేళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి మించి నిధులను సమకూర్చుకుంది. ఉదాహరణకు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అంతకు మించి రూ.85,000 కోట్లు సమీకరించింది. కాబట్టి, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

"పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను ఆదాయ మార్గాలుగా మలచుకోవడం ద్వారా మూడేళ్లలో మా లక్ష్యాలను పూర్తిచేస్తాం. లక్షా ఐదు వేల కోట్ల రూపాయల నిధులను సులువుగా సమీకరించగలుగుతామన్న నమ్మకం ఉంది" అని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు.

పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను గుర్తించి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే బాధ్యత నీతి ఆయోగ్‌దే. నీతి ఆయోగ్ ఉఫాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ కుమార్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారు.

బీబీసీతో ఆయన మాట్లాడుతూ... పెట్టుబడుల ఉపసంహరణ కోసం తాము 46 సంస్థల పేర్లను సిఫార్సు చేయగా, అందులో 24 కంపెనీలలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు.

"ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అంశం త్వరలోనే కొలిక్కి వస్తుంది" అని ఆయన అన్నారు.

Image copyright Getty Images

అమ్మకానికి 'మహారాజా'

ఎయిర్ ఇండియాలో వాటా విక్రయం పూర్తయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో అది కీలకమైన ప్రైవేటీకరణ డీల్ అవుతుంది. గత ఏడాది, ఎయిర్ ఇండియాలో వాటాను అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ప్రభుత్వం పెట్టిన షరతుల కారణంగా పెట్టబడిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

"ప్రభుత్వం పెట్టిన షరతుల్లో.. అయిదేళ్ల వరకూ కొనుగోలుదారుడు సిబ్బందిని తొలగించకూడదన్నది ఒకటి. కానీ, ప్రైవేటు పెట్టబడిదారులు అందుకు అంగీకరించరు" అని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు వివేక్ కౌల్ అన్నారు.

అయితే, ఈసారి ప్రభుత్వం షరతులను సరళీకరించిందని రాజీవ్ కుమార్ చెప్పారు. "గత ఏడాది వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఆ పొరపాట్లు జరగవు" అని ఆయన అన్నారు.

ఎయిరిండియా విక్రయానికి సంబంధించి విమానయాన శాఖ కొత్త ప్యాకేజీని రూపొందించింది. కానీ, దానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ప్రభుత్వం తన వాటాను పూర్తిగా విక్రయించి, కంపెనీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తుందా? అన్న విషయంలోనూ ఇంకా స్పష్టత లేదు.

ఈ అంశం ఇప్పుడు హోమంత్రి అమిత్ షా చేతుల్లో ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ మీద ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీకి ఆయన ఛైర్మన్‌గా ఉన్నారు. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను రూపొందించేది ఈ కమిటీయే.

Image copyright ONGC
చిత్రం శీర్షిక ఓఎన్‌జీసీ

పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం హయాంలో... ఒక ప్రభుత్వ సంస్థ షేర్లను అమ్మితే, మరో ప్రభుత్వ సంస్థ బలవంతంగా ఆ షేర్లను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇటీవల ఓన్‌జీసీ, హెచ్‌పీసీఎల్ మధ్య అలాగే జరిగింది. మంచి లాభాల్లో ఉన్న ఓఎన్‌జీసీ దాదాపు రూ.37,000 కోట్లతో హెచ్‌పీసీఎల్‌లో 51 శాతం నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. అందుకోసం, ఓఎన్‌జీసీ బ్యాంకు నుంచి రూ.24,000 కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చింది.

ఇలాంటి డీల్‌ను పెట్టుబడుల ఉపసంహరణ అనలేమని వివేక్ కౌల్ అభిప్రాయపడ్డారు. "పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఒక డ్రామా. అది ప్రభుత్వం నిధులను సమకూర్చుకునేందుకు సులువైన మార్గం" అని వివేక్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంస్థలను లేదా కొంత వాటాను ప్రైవేటు సంస్థలు కొనుగోలు చేయడాన్ని మాత్రమే నిజమైన పెట్టుబడుల ఉపసంహరణ అవుతుందని ఆయన అన్నారు.

అయితే, వివేక్ అభిప్రాయంతో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ విభేదించారు. పెట్టుబడుల ఉపసంహరణలో అన్నిసార్లూ, ప్రైవేటు కొనుగోలుదారులు ఉండాల్సిన అవసరం లేదని రాజీవ్ కుమార్ అన్నారు.

ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్ లాంటి డీల్స్‌నే కేంద్ర ప్రభుత్వం పునరావృతం చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

నిజం చెప్పాలంటే, 1991 నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలూ ఇలాగే చేస్తూ వచ్చాయి.

Image copyright EPA
చిత్రం శీర్షిక అమిత్ షా, నరేంద్ర మోదీ

వేగం పెరిగిందా? తగ్గిందా?

గత రెండేళ్లలో పెట్టుబడుల ఉపసంహరణల వేగం పెరిగిందా? తగ్గిందా? వాస్తవం ఏంటి? ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలా, విమర్శించాలా?

అంటే, ప్రైవేటీకరణను బలంగా సమర్థించేవారు, ప్రభుత్వానికి సొంత వ్యాపారాలు, కంపెనీలు ఉండాల్సిన అవసరం లేదని నమ్మేవారు, మోదీ ప్రభుత్వం హయాంలో పెట్టుబడుల ఉపసంహరణలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని భావిస్తారు. అలాంటివారికి, ప్రభుత్వం తన సంస్థలన్నింటినీ లేదా అధిక శాతం కంపెనీలను అమ్మేసి, ప్రజలకు గృహాలు, ఆరోగ్యం, ఉపాధి, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలను సమకూర్చడంపై ఎక్కువ దృష్టిపెట్టాలని కోరుకుంటారు.

కానీ, ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడాన్ని వ్యతిరేకించే నిపుణులు మాత్రం, మోదీ ప్రభుత్వం వేగాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు, సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధ సంస్థ స్వేదేశీ జాగ్రన్ మంచ్ అంటోంది.

గత రెండేళ్లలో పెట్టుబడుల ఉపసంహరణల వేగం పెరిగిందని మంచ్ చెబుతోంది. ఆ సంస్థకు చెందిన అరుణ్ ఓజా మాట్లాడుతూ... "మేము పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకం కాదు. కానీ, వ్యూహాత్మక అమ్మకాలకు వ్యతిరేకం. బహిరంగ మార్కెట్‌లో షేర్లను జారీ చేయడం ద్వారా పెట్టుబడులను ఉపసంహరించవచ్చు" అన్నారు.

ఆర్థిక మందగమనం

గత త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి 5.8 శాతానికి పడిపోయింది. 2003 నుంచి 2012 వరకు ఎగుమతుల పెరుగుదల రేటు 13- 14 శాతం ఉండేది. నేడు ఆ రేటు 2 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక మందగమనం గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతున్న మాట వాస్తవమేనని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అంగీకరించారు.

"నిజానికి మేము చాలా ఆందోళన చెందుతున్నాం. సాధ్యమైనంత త్వరగా ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది" అని ఆయన చెప్పారు.

దేశంలో మూలధన కొరత తీవ్రంగా ఉంది. దేశీయ కంపెనీల దగ్గర తగినంత మూలధనం లేదు. అందులోనూ చాలా సంస్థలు రుణ భారంతో సతమతమవుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ పరిస్థితి బాగాలేదు. ఇలాంటి పరిస్థితిలో, విదేశీ పెట్టుబడులు చాలా అవసరం. గత కొన్నేళ్లుగా సంస్కరణలను అమలు చేసేందుకు, సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్ని సఫలమైంది.

శుభవార్త ఏమిటంటే, 2018-19 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మొత్తం రికార్డు స్థాయిలో 64.37 బిలియన్ డాలర్లుగా ఉంది.

Image copyright Getty Images

భారీగా ప్రభుత్వ ఆస్తులు

భారత ప్రభుత్వానికి 257 సంస్థలు ఉన్నాయి. మరో 70కి పైగా కంపెనీలను ప్రారంభించనుంది. ఇవే కాకుండా, రైల్వే ఆస్తులు కూడా ఉన్నాయి. అంతేకాదు, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలో కలిపి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 57 శాతం వాటా ఉంది. నియంత్రణ వాటాను కోల్పోకుండా, బ్యాంకుల్లో తన వాటాను ఐదు నుంచి ఆరు శాతం ప్రభుత్వం విక్రియించవచ్చని రాజీవ్ కుమార్ అంటున్నారు.

అయితే, అందుకు ప్రభుత్వ నిబద్ధత, రాజకీయ సంకల్పం అవసరమని నిపుణులు అంటున్నారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు మునుపటి ప్రభుత్వాలకు భిన్నంగా ఏమీ లేవని వివేక్ కౌల్ అభిప్రాయపడ్డారు.

"అమెరికా ఫస్ట్" అంటూ జాతీయవాద విధానాన్ని ఎత్తుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచీకరణకు నట్లు బిగించారు. మోదీ ప్రభుత్వంలోనూ ఒక గందరగోళం ఉంది. ప్రభుత్వ సంస్థలను విదేశీ పెట్టుబడిదారులకు విక్రయించే ముందు జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. అదేసమయంలో, ప్రపంచీకరణను కొనసాగించడం ముఖ్యమని మరో వర్గం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

"నల్లమలను కాపాడుకుందాం": ఉద్యమానికి సినీ ప్రముఖుల మద్దతు

ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు

ఈ రైతు కుటుంబం ఐదు ఆత్యహత్యలు ఎందుకు చూడాల్సి వచ్చింది

హమ్జా బిన్ లాడెన్: అల్ ఖైదా నాయకుడి కుమారుడు చనిపోయాడని ధ్రువీకరించిన ట్రంప్

నిర్మలా సీతారామన్: 'దుబాయ్ తరహా మెగా షాపింగ్ పండుగలు.. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు 10 వేల కోట్లు'

నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు