తెలంగాణలో ఎంత వర్షం కురిసిందో తెలుసుకోవాలా.. రూ.20 లక్షల ఫీజు చెల్లించండి

  • 17 ఆగస్టు 2019
పొలం పనుల్లో మహిళ Image copyright Getty Images

నిజామాబాద్ జిల్లాలో వర్షపాతం వివరాలు తెలియజేయాలని అడిగిన ఒక ఆర్‌టీఐ కార్యకర్తకు.. ఆ వివరాలు కావాలంటే రూ. 20 లక్షలు ఫీజు చెల్లించాలంటూ షాక్ ఇచ్చింది తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ.

శేరుపల్లి రాజేష్ స్వతంత్ర పాత్రికేయుడు. ఆర్‌టీఐ కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో లోటు వర్షపాతం వల్ల వ్యవసాయం, రైతులపై ప్రభావం ఎలా ఉందనే అంశం మీద ఆయన తాజాగా ఒక కథనం రాయాలనుకున్నారు.

ఇందుకోసం.. గత ఏడాది కాలంలో వర్షపాతం వివరాలు కావాలంటూ మొదట నిజామాబాద్ ముఖ్య ప్రణాళికాధికారిని సంప్రదించారు.

అక్కడి నుంచి వివరాలు లభించకపోవటంతో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దరఖాస్తు చేశారు. 2018 జూన్ నుంచి 2019 మే వరకూ 12 నెలల్లో నమోదైన వర్షపాతం వివరాలు కావాలని కోరారు.

ఆయన దరఖాస్తును వాతావరణ వివరాలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థకు పంపించారు. ఆ సంస్థ నుంచి జులై 30న రాజేష్‌కు ఒక లేఖ అందింది. ఆయన అడిగిన సమాచారం ఇవ్వటానికి రూ. 17,22,000 ఫీజు, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కింద అదనంగా రూ. 3,09,960 - మొత్తం కలిపి రూ. 20,30,960 చెల్లించాలన్నది ఆ లేఖ సారాంశం.

''నిజామాబాద్ జిల్లాలో వర్షపాతం వివరాలు కావాలని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీకి ఆర్‌టీఐ కింద అభ్యర్థన పంపించాను. దానికి వారు నిజామాబాద్‌లో 41 ఏడబ్ల్యూసీ (ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్) ఉన్నాయని, వాటి సమాచారం ఇవ్వాలంటే ఒక్కో కేంద్రానికి రూ. 3,500 చొప్పున మొత్తం రూ. 20 లక్షలకు పైగా చెల్లించాలని బదులిచ్చారు. అందులో జీఎస్‌టీ కూడా కలిపారు. ఆ రిప్లయ్ చూసి నేను షాకయ్యాను'' శేరుపల్లి రాజేశ్ బీబీసీతో చెప్పారు.

''గతంలో చాలాసార్లు ఆర్‌టీఐకి దరఖాస్తులు చేశాను. కానీ ఎన్నడూ జీఎస్‌టీ అడగలేదు. అంతేకాదు, వాళ్ళు ఇస్తామన్న సమాచారం చాలా వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నదే. అసలు ఆ శాఖకు ఇలా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్న సంగతీ తెలిసినట్లు లేదు'' అని ఆయన పేర్కొన్నారు.

ఆర్‌టీఐ సమాచారానికి ఫీజులు ఎంత?

ఈ వ్యవహారంపై హైదరాబాద్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త జి.శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై అవగాహనా లేక ఆర్‌టీఐ దరఖాస్తుకు ఈ విధంగా ఫీజు అడిగి ఉంటారని అభిప్రాయపడ్డారు.

సమాచార హక్కు చట్టం అమలు విషయంలో ఉద్యోగులకు తగిన శిక్షణ లేకపోవటం ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోందన్నారు.

ఆర్‌టీఐ ప్రకారం.. సమాచారం అందించటానికి ఒక ఏ4 సైజు పేజీకి రూ. 2 చొప్పున, సీడీలో అయితే రూ. 100, డీవీడీలో ఇస్తే రూ. 200, ఫ్లాపీలో ఇస్తే రూ. 50 ఫీజుగా చెల్లించాలని చెప్పారు.

అలాగే.. పుస్తకాల వంటి ప్రింటెడ్ మెటీరియల్‌ను ఎంఆర్‌‌పీ ధరకు అందించాల్సి ఉంటుందన్నారు. ఇక సమాచారం డిజిటల్ రూపంలో ఉంటే.. వాటిని ఈమెయిల్ ద్వారా ఉచితంగానే పంపించవచ్చునన్నారు.

ప్రైవేటు సంస్థల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాం: టీఎస్‌పీడీపీఎస్ డైరెక్టర్

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(టీఎస్‌పీడీపీఎస్) ఇన్‌చార్జ్ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఈ విషయమై బీబీసీతో మాట్లాడుతూ.. వాతావరణ కేంద్రాల నుంచి వర్షపాతం వివరాలు కావాలని కోరే ప్రైవేటు బీమా సంస్థల నుంచి రూ. 3,500 చొప్పున ఫీజు వసూలు చేస్తున్నామని చెప్పారు.

‘‘ప్రైవేటు సంస్థలు వ్యాపార అవసరాల నిమిత్తం సమాచారం కోరుతున్నాయి కనుక.. ఆ సంస్థల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాం’’ అని వివరించారు.

‘‘మా దగ్గర రెడీగా ఉన్న సమాచారం ఉచితంగా అందిస్తాం. అయితే.. వాతావరణ కేంద్రాల నుంచి సమాచారం తెప్పించటానికి అయ్యే ఖర్చును దరఖాస్తుదారు భరించాలి కదా?’’ అని ఆయన పేర్కొన్నారు.

అదే తరహాలో ఆర్‌టీఐ ఆర్‌టీఐ దరఖాస్తుదారును కూడా ఫీజు కట్టాలని కోరామన్నారు. ఈ విషయంలో సమస్యలు ఎదురైనపుడు అప్పిలేట్ అథారిటీని సంప్రదిస్తే పరిష్కారం అవుతుందన్నారు.

ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేసిన వ్యక్తికి ప్రైవేటు బీమా సంస్థలకు సంబంధం లేదని తమకు ఎలా తెలుస్తుందన్నారు.

‘చట్టం ప్రకారం చాలా తక్కువ ఖర్చుతో, ఒక్కోసారి ఉచితంగా సమాచారం పొందొచ్చు’

‘వాతావరణ శాఖ సమాచారమంతా పబ్లిక్ డొమైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉండాల్సిందే. సాధారణంగా కాలేజీల్లో ఒక జవాబు పత్రం కావాలని విద్యార్థి అడిగితే దానికి కొంత రుసుం ఉంటుంది. కానీ, అదే ఆర్టీఐ కింద అడిగితే ఆ చట్టం ప్రకారం తీసుకోవాల్సినంత ఫీజు ఉంటుంది. వర్షపాత సమాచారానికీ అదే వర్తిస్తుంద’ని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ఆర్టీఐ దరఖాస్తు కింద ఇచ్చే సమాచారానికి రూ.20 లక్షలు ఫీజు అడగడం సరికాదు. చట్టం ప్రకారం చాలా తక్కువ ఖర్చుతో, ఒక్కోసారి ఉచితంగా సమాచారం పొందొచ్చని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం