కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నీట మునిగిన పంటలు

  • 18 ఆగస్టు 2019
వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి పేర్ని నాని
చిత్రం శీర్షిక వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి పేర్ని నాని

కృష్ణా న‌ది వ‌ర‌ద‌లతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప‌లు గ్రామాల‌తో పాటు విజ‌య‌వాడ న‌గ‌రంలోని అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి.

ప్ర‌భుత్వం స‌హాయ చ‌ర్య‌ల కోసం రంగంలో దిగింది. విప‌క్ష నేత‌లు కూడా బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు.

పెరిగిన వ‌ర‌ద తాకిడితో అనేక చోట్ల వ‌ర‌ద బాధితులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్ర‌కాశం బ్యారేజ్ నుంచి రికార్డ్ స్థాయిలో నీరు విడుద‌ల‌

ప్ర‌కాశం బ్యారేజ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక నీటి విడుద‌ల రికార్డ్ 2009లో న‌మోద‌య్యింది. ఆ త‌ర్వాత ఇదే అత్య‌ధికం అని ఇరిగేష‌న్ అధికారులు చెబుతున్నారు.

తాజాగా శ‌నివారం సాయంత్రం 6 గంటలకు న‌మోద‌యిన నీటిమ‌ట్టం 17 మీట‌ర్లుగా ఉంది. దాని కార‌ణంగా దిగువ‌కు 7 ల‌క్షల క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు. రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగిస్తున్నారు.

ఇప్ప‌టికే అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు చేరింది. అమ‌రావ‌తి, తుళ్లూరు, తాడేప‌ల్లి మండ‌లాల ప‌రిధిలోని 12 గ్రామాల్లో వ‌ర‌ద స‌హాయ‌ చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రెండు మండ‌లాల్లో కూడా వ‌ర‌ద తాకిడి తీవ్రంగా ఉంది. స‌హాయ చ‌ర్య‌ల్లో భాగంగా కంచిక‌చ‌ర్ల వ‌ద్ద నాటు ప‌డ‌విలో వాగు దాటిస్తున్న సమయంలో గౌత‌మి(11) అనే బాలిక నీటిలో గ‌ల్లంతైంది. గాలింపు చేపట్టగా ఆమె మృత‌దేహం ల‌భించింది.

విజ‌య‌వాడ విల‌విల‌

వ‌ర‌ద తాకిడితో విజ‌య‌వాడ న‌గ‌రం విల‌విల్లాడుతోంది. ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు ఇళ్ల‌లోకి చేరింది. దాంతో బాధితుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 48 పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

విజ‌య‌వాడ ప‌రిధిలోని భ‌వానీపురం, కృష్ణ‌లంక‌, రాణీగారి తోట ప్రాంతాల్లో వ‌ర‌ద కార‌ణంగా వంద‌ల సంఖ్య‌లో ఇళ్లు నీటిపాల‌య్యాయి.

గుంటూరు జిల్లాలోనూ..

గుంటూరు జిల్లాలోని అనేక మండ‌లాలు వ‌ర‌ద ముప్పులో ఉన్నాయి. దాచేపల్లి ప్రాంతంలో సుమారుగా 6,500 ఎకరాల్లో పత్తి, మిరప పంటలు వ‌ర‌ద తాకిడికి గుర‌య్యాయి.

కొల్లిపర మండలంలోని ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌ల‌కు నిలిచిపోయాయి. అరటి, పసుపు, కంద, జామ నిమ్మ, కూరగాయల తోటల్లోకి నీరు చేరిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. కొల్లూరు, దుగ్గిరాల మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.

గుంంటూరు జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు, 39 గ్రామాల్లో 537 కుటుంబాలు, 709 మంది ప్రజలకు వరద ముప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1619 మంది తరలించారు.

ప‌లు చోట్ల రోడ్డు ర‌వాణా స్తంభించింది. అనేక చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకి అంత‌రాయం ఏర్ప‌డింది. రాజ‌ధాని ప‌రిధిలోని మూడు మండ‌లాల్లో 6,887 స‌ర్వీసుల‌కు విద్యుత్ స‌దుపాయం నిలిచిపోయిన‌ట్టు ట్రాన్స్ కో ప్ర‌క‌టించింది.

చిత్రం శీర్షిక వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు

స‌హాయ‌ బృందాలు రంగంలోకి...

అనూహ్యంగా పెరిగిన వ‌ర‌ద‌ల తాకిడితో బాధితుల‌ను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలో దిగింది.

ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు రావ‌డంతో ముందస్త చ‌ర్య‌ల్లో జాప్యం జ‌రిగిన‌ట్టు విపక్షాలు, బాధితులు ఆరోపిస్తున్నారు.

వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ప‌ర్య‌టిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజ‌య‌వాడ‌లో మంత్రులు అనిల్ కుమార్, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంప‌ల్లి శ్రీనివాస్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

వ‌ర‌ద ప్రభావిత రెండు జిల్లాల్లోఊన‌ విధులు నిర్వహించడానికి 140 మంది పైర్‌ సిబ్బంది, 180 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను నియమించిన మంత్రి మోపిదేవి తెలిపారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ ఎన్డీఆర్‌ఎఫ్‌ సభ్యులు 10 మంది చొప్పున విడిపోయి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, కృష్ణా, తొట్లవల్లూరు, రాణిగారితోట, కంచికర్ల, కొల్లిపర, కొల్లూరు, గుంటూరు జిల్లా తుల్లూరు, సీతానగరం మండలాల్లో సహాయ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

రెండు జిల్లాలు కలిపి మొత్తం 56 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 14,413 ఆహార పొట్లాలు, 42వేల మంచినీటి ప్యాకెట్లను వరద బాధితులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

అంటువ్యాధులు ప్రబలకుండా తగు వైద్యం అందించడానికి రెండు జిల్లాల్లో 54 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకు రెండు జిల్లాలు కలిపి 32 మండలాలకుగాను 87 గ్రామాల్లో వరద ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు.

కృష్ణ జిల్లాలో 6 వేల హెక్టార్లలో పంట నష్టం

కృష్ణా జిల్లాలో 6 వేల హెక్టార్లలో వ్యవసాయం నష్టం వాటిల్లిందని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. 1600 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటివరకు 15 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.

ఎగువ‌న శాంతిస్తున్న వ‌ర‌ద‌

కృష్ణా న‌ది జ‌ల ప్ర‌వాహం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఎగువ‌న శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ నుంచి అవుట్ ఫ్లో త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది.

పులిచింత‌ల వ‌ద్ద కూడా వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గుద‌ల క‌నిపిస్తుండ‌డంతో ఆదివారం ఉద‌యానికి ప్ర‌కాశం బ్యారేజ్ వ‌ద్ద కూడా వ‌ర‌ద త‌గ్గుద‌ల ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు.

కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ బీబీసీతో మాట్లాడుతూ.. ''ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.21 లక్షల క్యూసెక్కుల అవుట్‌ప్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. సాగర్‌ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 7,13,052 క్యూసెక్కులు వస్తుండగా, బయటకు 7,13,042 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 8,39,136 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 7,97,502 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 7,57,005 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 7, 71,134 క్యూసెక్కులను పంపుతున్నారు. ఆదివారం నాటికి విజ‌య‌వాడ వ‌ద్ద కూడా త‌గ్గుద‌ల క‌నిపించ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నాం'' అన్నారు.

చిత్రం శీర్షిక గవర్నర్ ఏరియల్ సర్వే

గ‌వ‌ర్న‌ర్ ఏరియ‌ల్ స‌ర్వే

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హరిచందన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు.

కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

చిత్రం శీర్షిక బాధితులను పరామర్శిస్తున్న టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు

వ‌ర‌ద నిర్వ‌హ‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యారంటున్న టీడీపీ

ప్ర‌భుత్వ తీరు మీద టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. వ‌ర‌ద నీటి నిర్వ‌హ‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యార‌ని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.

వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ ''చంద్ర‌బాబు నివాసంపై దృష్టి పెట్ట‌డ‌మే త‌ప్ప‌, వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌నే ఆలోచ‌న ప్ర‌భుత్వంలో క‌నిపించ‌డం లేదు. వ‌ర‌ద నీరు 12 ల‌క్ష‌ల క్యూసెక్కులు వ‌దిలిన‌ప్పుడు క‌న్నా ఈసారి ఎక్కువ న‌ష్టం వాటిల్లింది.

అనేక లంక‌ల్లో విలువైన పంట‌లు న‌ష్టపోయారు. ఇళ్ల‌ల్లో నీరు చేరిన త‌ర్వాత కూడా బాధితుల‌కు త‌గిన స‌హాయం అందించ‌లేదు. త‌క్ష‌ణం బాధితుల‌ను ఆదుకోవాలి. పకడ్బందీగా పునరావాస శిబిరాలను నిర్వహించాలి. బాధితులు అందరికీ నిత్యావసరాలు పంపిణీ చేయాల''ని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ఉప్పల‌పాడు పక్షుల పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి...

టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సేఫ్ కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా...

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య

'ఏడేళ్ల వయసులో జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్లకు ఎందుకు చెప్పానంటే...'

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు? మరణ శిక్ష విధించారా...